బిల్ ‘గేట్’వుట్ – న్యూఢిల్లీ ఏఐ వేదికగా ఘోర పరాభవం

Billgates out AI Summit
  • నేటి ప్రసంగాన్ని రద్దు చేసిన నిర్వాహకులు
  • ఎప్‌స్టీన్ పాపాలకు భారీ మూల్యం
  • అంతర్జాతీయ వేదికపై అప్రతిష్ట
  • గందరగోళంలో గేట్స్ ఫౌండేషన్
  • టెక్ గురువు ముసుగు తొలగింది
  • ఆయన తీరుపై కేంద్రం అసహనం

సహనం వందే, న్యూఢిల్లీ:

మానవతావాదిగా, టెక్ దిగ్గజంగా దశాబ్దాలుగా వెలిగిన బిల్ గేట్స్ ప్రతిష్ట ఇప్పుడు మట్టిలో కలిసింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఏఐ సదస్సు నుండి ఆయన అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న చీకటి సంబంధాలు బట్టబయలు కావడంతో భారత ప్రభుత్వం ఆయన ఉనికిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Billgates skips keynote address at AI Summit

కీనోట్ ప్రసంగం రద్దు…
న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో బిల్ గేట్స్ కీలక ప్రసంగం చేయాల్సి ఉంది. గురువారం ఉదయం 11:50 గంటలకు ఆయనకు కేటాయించిన 12 నిమిషాల సమయం రద్దయిపోయింది. సదస్సు ప్రారంభానికి కొన్ని గంటల ముందే అధికారిక వెబ్‌సైట్ నుండి ఆయన పేరును తొలగించడం ద్వారా భారత్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇది గేట్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పెద్ద దౌత్యపరమైన పరాభవం.

ఎప్‌స్టీన్ ఫైళ్లలో చీకటి నిజాలు
అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా పత్రాలు గేట్స్ అసలు రంగును బయటపెట్టాయి. రష్యన్ యువతులతో సంబంధాలు, లైంగిక వ్యాధుల చికిత్స వంటి అంశాలపై ఎప్‌స్టీన్ పంపిన ఈ-మెయిళ్లు ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎప్‌స్టీన్ నేర సామ్రాజ్యానికి గేట్స్ ఒక మార్గదర్శిగా వ్యవహరించారనే వార్తలు ఇప్పుడు ఆయన్ని చుట్టుముట్టాయి. దాతృత్వం పేరుతో నేరస్థులతో ఆయన జరిపిన రహస్య భేటీలే ఇప్పుడు ఈ బహిష్కరణకు దారితీశాయి.

నైతికత ముందు పెట్టుబడుల తలవంపు
భారతదేశం తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో 16,39,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ పెట్టుబడుల కంటే నైతిక విలువలకే పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావించింది. అమెరికా న్యాయస్థానాల్లో వెల్లడైన సంచలన విషయాలను పరిగణనలోకి తీసుకుని లైంగిక బాధితులకు సంఘీభావంగా గేట్స్ పేరును పక్కన పెట్టింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు కూడా ఒక హెచ్చరికగా మారింది.

గందరగోళంగా ఫౌండేషన్ వివరణ…
గేట్స్ ఫౌండేషన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది. సదస్సు ప్రాధాన్యత కోసమే గేట్స్ రావడం లేదని… ఆయన స్థానంలో అంకుర్ వోరా పాల్గొంటారని చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. ఎప్‌స్టీన్ సంబంధాల సెగతోనే ఆయన ఢిల్లీ పర్యటన అపహాస్యం అయిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్‌తో గేట్స్ వ్యవహారం, ఆమె కోడింగ్ శిక్షణ కోసం ఎప్‌స్టీన్ నగదు చెల్లించడం వంటి అంశాలు ఇప్పుడు ఆయనను ముద్దాయిగా నిలబెడుతున్నాయి.

ప్రపంచ వేదికపై ఒంటరి
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్మన్ వంటి దిగ్గజాలు పాల్గొంటున్న ఈ సభలో గేట్స్ లేకపోవడం ఆయన పతనానికి పరాకాష్ట. మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ సమక్షంలోనే ఈ పరిణామాలు జరగడం ఆయన కంపెనీపై కూడా ప్రభావం చూపేలా ఉంది. ఎప్‌స్టీన్ లాంటి కరుడుగట్టిన నేరస్థుడిని ‘కీ అడ్వైజర్’ (ముఖ్య సలహాదారు)గా నియమించుకున్న గేట్స్‌కు భారత్ గడ్డపై సరైన గుణపాఠం ఇది. 70 ఏళ్ల వయసులో ఆయన నిర్మించుకున్న ఇమేజ్ ఇప్పుడు కుప్పకూలిపోయింది. కాగా మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కావడంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *