- ప్రాణాంతక బ్యాక్టీరియాతో బడా సంస్థల పాలు
- ట్రస్టిఫైడ్ ఇన్వెస్టిగేషన్‌లో విస్తుపోయే నిజాలు
- అముల్ మదర్ డైయిరీలో ప్రమాదకర స్థాయి
- గుడ్లలో నిషిద్ధ క్యాన్సర్ కారక రసాయనం
- నియంత్రణ సంస్థల వైఫల్యంపై నిలదీత
సహనం వందే, హైదరాబాద్:
కోట్లాది మంది భారతీయుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న డైయిరీ దిగ్గజాలు ఇప్పుడు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అముల్, మదర్ డైయిరీ, కంట్రీ డిలైట్ వంటి అగ్రగామి సంస్థల ఉత్పత్తుల్లో ప్రాణాంతక బ్యాక్టీరియా పొంచివుందని ట్రస్టిఫైడ్ సంస్థ జరిపిన తాజా పరిశోధనలో బట్టబయలైంది. ఇది కేవలం నాణ్యతా లోపం కాదు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ బడా డైయిరీ సంస్థలు సాగిస్తున్న వ్యవస్థాగత నేరమని ఈ నివేదిక నిరూపిస్తోంది.

ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ బండారం
ఆహార స్వచ్ఛతను నిశితంగా పరిశీలించే స్వతంత్ర సంస్థ ట్రస్టిఫైడ్… మార్కెట్లో విక్రయించే వివిధ బ్రాండ్ల నమూనాలను సేకరించి రహస్యంగా పరీక్షలు నిర్వహించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన కనీస ఆరోగ్య ప్రమాణాలను సైతం ఈ కంపెనీలు తుంగలో తొక్కాయని ల్యాబ్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. లాభాల వేటలో పడి సామాన్యుల కిచెన్లలోకి విషాన్ని సరఫరా చేస్తున్న ఈ సంస్థల వెనుక ఉన్న అసలు రంగును ఈ పరిశోధన బయటపెట్టింది.
మదర్ డైయిరీలో బ్యాక్టీరియా విస్ఫోటనం
1974లో ఏర్పాటై ప్రభుత్వ అండదండలతో నడిచే మదర్ డైయిరీలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ట్రస్టిఫైడ్ పరీక్షల ప్రకారం ఈ పాలల్లో ఉండాల్సిన దానికంటే 8 రెట్లు ఎక్కువగా టీపీసీ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఐదు దశాబ్దాల చరిత్ర గల సంస్థలో ఇంతటి నిర్లక్ష్యం వహించడం వెనుక అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం అశ్రద్ధ మాత్రమే కాదు... వినియోగదారుల పట్ల చూపిస్తున్న తీవ్ర అగౌరవం.
అముల్ సామ్రాజ్యంలో కలుషిత పెరుగు
భారతీయ పాడి విప్లవానికి చిహ్నంగా చెప్పుకునే అముల్ (1948) ప్రతిష్ట ఇప్పుడు మంటగలుస్తోంది. అముల్ తాజా, అముల్ గోల్డ్ పాలల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా ఆందోళనకర స్థాయిలో ఉండగా… అముల్ పెరుగులో ఏకంగా వేల రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. మార్కెట్ లీడర్‌గా ఉండి సామాన్యుడి ఆరోగ్యంతో ఇలాంటి జూదం ఆడటం అముల్ నైతికతను ప్రశ్నిస్తోంది. పేరున్న బ్రాండ్ అనే భ్రమలో ప్రజలు విషాన్ని కొంటున్నారని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.
కంట్రీ డిలైట్ ప్రచారాల వెనుక పచ్చి అబద్ధం
నేరుగా రైతుల నుండే పాలను సేకరిస్తామని, మధ్యవర్తులు ఉండరని 2015 నుండి ప్రచారం చేసుకుంటున్న కంట్రీ డిలైట్ బండారం కూడా బయటపడింది. వీరి పాలల్లో కూడా రెండింతలు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు ట్రస్టిఫైడ్ వెల్లడించింది. సాంకేతికతను వాడుకుని స్వచ్ఛతను అందిస్తున్నామని చెప్పే మాటలు కేవలం మార్కెటింగ్ తంతేనని తేలిపోయింది. వినియోగదారుల సెంటిమెంట్లను వ్యాపార వస్తువులుగా మార్చుకుని నాణ్యతను గాలికొదిలేసిన వైనం ఇక్కడ స్పష్టమవుతోంది.
ఎగ్గోజ్ గుడ్లలో క్యాన్సర్ రసాయనం
ఆహార కల్తీలో అన్నిటికంటే భయంకరమైన విషయం ఎగ్గోజ్ గుడ్లలో ఏఓజెడ్ అనే నిషేధిత రసాయనం లభ్యం కావడం. ఇది శక్తివంతమైన క్యాన్సర్ కారకమని తెలిసినా కోళ్ల పెంపకంలో దీన్ని వాడటం నేరపూరిత చర్య. ప్రోటీన్ కోసం గుడ్లు తినే పిల్లలు, గర్భిణీలు తెలియకుండానే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. లాభాల కోసం ప్రజలకు ప్రాణాంతక వ్యాధులను పంచుతున్న ఈ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ మౌనంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
ఈ దిగ్భ్రాంతికరమైన నివేదిక బయటకు వచ్చినా అముల్ వంటి సంస్థలు దాన్ని కొట్టిపారేస్తూ బుకాయింపులకు పాల్పడుతున్నాయి. అటు ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యం కంటే బడా సంస్థల ప్రయోజనాలే ముఖ్యమనే ధోరణిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రజలు తమ ఆహారంపై అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.