- అంతర్జాతీయ పత్రికలో భారీగా కోతలు
- ప్రజాస్వామ్య చీకటిలో మరణిస్తున్న జర్నలిజం
- అమెజాన్ అధినేత చేతిలో ఉద్యోగుల విలవిల
- ప్రజాస్వామ్య చీకటిలో మరణిస్తున్న జర్నలిజం
- జర్నలిస్టుల సామూహిక ఉద్వాసన
- అంతర్జాతీయ బ్యూరోలు మూత
సహనం వందే, అమెరికా:
ప్రపంచ జర్నలిజం రంగంలో ఒకప్పుడు వెలుగులీనిన వాషింగ్టన్ పోస్ట్ ఇప్పుడు చీకట్లోకి జారిపోతోంది. డిజిటల్ విప్లవం, సోషల్ మీడియా ధాటికి తలవొగ్గి వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. వార్తల వేటలో ప్రాణాలు పణంగా పెట్టే రిపోర్టర్లను నిర్దాక్షిణ్యంగా ఇళ్లకు పంపిస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అనుకునే మీడియా ఇప్పుడు వ్యాపార లెక్కల ముందు మోకరిల్లింది. చీకటిలో ప్రజాస్వామ్యం మరణిస్తుందన్న నినాదం ఇచ్చిన పత్రికలే వెలుగులో అంతరించిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

యజమాని వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ చేతుల్లోకి వాషింగ్టన్ పోస్ట్ వెళ్ళిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. పత్రికా స్వేచ్ఛ కంటే తన వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని ఆయన భావిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. సుమారు 20 వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన జర్నలిజం విలువలను పక్కన పెట్టారు. ప్రభుత్వంతో ఘర్షణ పడకుండా ఉండేందుకు సంపాదకీయ స్వేచ్ఛను హరించడం జర్నలిస్టులను తీవ్రంగా కలవరపెడుతోంది.
తగ్గిన కలాల బలం
వాషింగ్టన్ పోస్ట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పెను సంచలనం రేపుతోంది. ఏకంగా వెయ్యి మందికి పైగా జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించారు. పత్రిక చరిత్రలోనే ఇది అతిపెద్ద కోతగా మిగిలిపోనుంది. ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు తన సీటును వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం వార్తా విభాగం మాత్రమే కాదు… బిజినెస్ సెక్షన్‌లో కూడా భారీగా కోతలు విధించారు. ఈ- మెయిల్స్ ద్వారా ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఇది మీడియా రంగంలో ఒక నల్లటి రోజుగా రిపోర్టర్లు భావిస్తున్నారు.
ప్రాంతీయ వార్తలకు పాతర
స్థానిక వార్తలకు వాషింగ్టన్ పోస్ట్ ఇకపై దూరంగా ఉండబోతోంది. నగర, ప్రాంతీయ వార్తలను కవర్ చేసే రిపోర్టర్ల సంఖ్యను భారీగా తగ్గించారు. కమ్యూనిటీ వార్తలకు ఇకపై స్థానం ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది. సామాన్యుల గొంతుకగా నిలిచే లోకల్ బ్యూరోలను మూసివేయడం వల్ల ప్రజా సమస్యలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు వార్తలు పెరిగిపోతున్న తరుణంలో బాధ్యతాయుతమైన లోకల్ జర్నలిజాన్ని తుడిచిపెట్టడం దారుణమని విశ్లేషకులు అంటున్నారు.
అంతర్జాతీయ బ్యూరోలు ఖాళీ
విదేశీ గడ్డలపై వాషింగ్టన్ పోస్ట్ జెండా ఎగిరే రోజులు పోయాయి. అంతర్జాతీయ బ్యూరోల పరిమాణాన్ని దారుణంగా తగ్గించేశారు. భారత బ్యూరో చీఫ్ సహా ఉక్రెయిన్ బ్యూరో చీఫ్‌ను కూడా తొలగించడం గమనార్హం. యుద్ధ ప్రాతిపదికన వార్తలు అందించే మిడిల్ ఈస్ట్ రిపోర్టర్లను కూడా ఇంటికి పంపేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక పరిణామాలను కవర్ చేసే నెట్‌వర్క్ ఇప్పుడు కుప్పకూలింది. విదేశీ వ్యవహారాల కవరేజీని గణనీయంగా కుదించడమే కాకుండా విదేశీ బ్యూరోల బడ్జెట్‌లో భారీగా కోత పెట్టారు.
క్రీడలు… పుస్తకాలకు గుడ్ బై
పత్రికలో ఎంతో ఆదరణ పొందే క్రీడా విభాగాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. స్పోర్ట్స్ రిపోర్టర్లను వేరే విభాగాలకు మార్చడం లేదా తొలగించడం జరుగుతోంది. అలాగే బుక్ రివ్యూ సెక్షన్‌ను కూడా రద్దు చేశారు. ఎంతో మంది మేధావులు చదివే ఎడిటోరియల్ టీమ్‌ను పూర్తిగా ఖాళీ చేశారు. సాహిత్యానికి, విజ్ఞానానికి చోటు లేని పత్రికగా వాషింగ్టన్ పోస్ట్ మారుతోంది. ఆడియో విభాగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రముఖ పోడ్ కాస్ట్ షోలను కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వ్యాపారమే పరమావధి
జర్నలిజం విలువల కంటే లాభాలే ముఖ్యమని వాషింగ్టన్ పోస్ట్ యాజమాన్యం భావిస్తోంది. ఇకపై కేవలం జాతీయ రాజకీయాలు, బిజినెస్ వార్తలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. సామాజిక బాధ్యతను పక్కన పెట్టి కేవలం క్లిక్స్ కోసం పనిచేసే స్థాయికి మీడియా దిగజారింది. ఈ నిర్ణయాల వల్ల పత్రిక నాణ్యత పడిపోయే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల తొలగింపుతో మిగిలిన వారిపై పనిభారం పెరిగి విశ్లేషణాత్మక వార్తలకు ఆస్కారం ఉండదు. సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో మీడియా తన ఉనికిని కోల్పోతున్న తీరుకు ఇది నిదర్శనం.
పెట్టుబడిదారుల వేట
డాలర్ల వేటలో జర్నలిజం బలైపోతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల వల్ల ప్రకటనల రాబడి తగ్గింది. దీంతో 100 కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి జర్నలిస్టుల పొట్ట కొడుతున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న యజమానులు సైతం ఖర్చుల తగ్గింపు పేరుతో ఉద్యోగులను రోడ్డున పడేయడం శోచనీయం. ఒకప్పుడు గంభీరంగా సాగిన వాషింగ్టన్ పోస్ట్ ప్రస్థానం ఇప్పుడు సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. దీనివల్ల జర్నలిజం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.