- మరోసారి సివిల్స్ పరీక్ష రాయడానికి లేదు
- ఈ ఏడాది నుంచే యూపీఎస్‌సీ కొత్త నిబంధన
- ఐపీఎస్‌లకు ఐఏఎస్ దారులన్నీ బంద్
- గ్రూప్ ‘ఏ’ ఉద్యోగాలన్నింటిపై ఆంక్షల కంచె
- ఆశావహుల కలలు చెల్లాచెదురు
- ఒకే సర్వీసుతో జీవితాంతం సరిపెట్టుకోవాలి
సహనం వందే, హైదరాబాద్:
దేశంలో సివిల్స్ రాసే కుర్రాళ్ల కల ఒక్కటే కలెక్టర్ కావాలని! కానీ అందరికీ ఐఏఎస్ రాదు. కొందరికి ఐపీఎస్ వస్తుంది… మరికొందరికి ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను శాఖ) వస్తుంది. ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే ఒక్కసారి ఐపీఎస్ లేదా గ్రూప్ ఏ సర్వీసుల్లో చేరితే మళ్లీ ఐఏఎస్ కోసం పరీక్ష రాస్తానంటే కుదరదు. తలుపులు మూసేశారు. ఈ ఏడాది నుండి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది.

గ్రూప్ ‘ఏ’ అంటే ఎవరు?
అసలు ఈ గ్రూప్ ‘ఏ’ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. సివిల్స్ పరీక్ష రాసినప్పుడు ర్యాంకును బట్టి సుమారు 24 రకాల ఉద్యోగాలు ఇస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ కాకుండా… విదేశీ వ్యవహారాల శాఖ (ఐఎఫ్ఎస్), ఆదాయపు పన్ను శాఖ (ఐఆర్ఎస్), రైల్వే సర్వీసులు (ఐఆర్టీఎస్), పోస్టల్ సర్వీసులు వంటి వాటిని గ్రూప్ ఏ కేటగిరీ అంటారు. ఇప్పటివరకు ఐపీఎస్ వచ్చినా, ఐఆర్ఎస్ వచ్చినా.. మళ్లీ పరీక్ష రాసి ఐఏఎస్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యూపీఎస్‌సీ ఆ అవకాశాన్ని ఎత్తివేసింది.
ఎందుకీ కఠిన నిర్ణయం?
ప్రతి ఏటా 1000 మంది సివిల్స్ కు ఎంపికవుతుంటే అందులో సగం మంది పాతవాళ్లే ఉంటున్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉంటూ మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ కొడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఒక్కో ఐపీఎస్ ట్రైనీ మీద ఖర్చు చేసే 50 లక్షల రూపాయల ప్రజల సొమ్ము గంగలో పోస్తున్నట్లు లెక్క. ట్రైనింగ్ మధ్యలో ఆపేసి వెళ్లడం వల్ల సీట్లు వృధా అవుతున్నాయి. పోలీసు శాఖలో ఖాళీలు పెరుగుతున్నాయి. ఈ తలనొప్పి వదిలించుకోవడానికే ఒకసారి సర్వీసులో చేరితే మళ్లీ పరీక్ష రాయకూడదని యూపీఎస్‌సీ గీత గీసింది.
నష్టపోయేది ఎవరు?
ఈ నిబంధన వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. మొదటి ప్రయత్నంలో ఏదో ఒక ఉద్యోగం వచ్చినా ఆ తర్వాత పట్టుదలతో ఐఏఎస్ కావాలని కలలుగనే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐపీఎస్ ట్రైనింగ్ కష్టంగా ఉందని భావించే వారు మధ్యలో వదిలేసి మళ్లీ రాద్దామన్నా కుదరదు. టాలెంట్ ఉన్న వాళ్లని ఒకే చోట కట్టేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. అయితే కొత్త వారికి ఎక్కువ సీట్లు దక్కుతాయని యూపీఎస్‌సీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.
శిక్షణ వృధా…
హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకునే ఐపీఎస్‌లు ప్రతి ఏటా 30 నుండి 40 మంది మధ్యలోనే రిజైన్ చేసి వెళ్తున్నారు. వీళ్లంతా ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ లకు సెలెక్ట్ అయిన వారే. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చుతో పాటు ఒక కీలకమైన ఐపీఎస్ పోస్టు ఖాళీగా ఉండిపోతోంది. ఆ గ్యాప్ పూరించడానికి మళ్లీ ఏడాదవుతుంది. ఇలాంటి పరిపాలనాపరమైన ఇబ్బందులను తొలగించేందుకే ఐపీఎస్, గ్రూప్ ఏ సర్వీసుల అభ్యర్థులపై బ్రేకులు వేశారు.
భవిష్యత్తు సవాలుగా మారిందా?
రాబోయే నోటిఫికేషన్ అభ్యర్థుల పాలిట అగ్నిపరీక్షే. దరఖాస్తు చేసే ముందే తాము ఏ సర్వీసులోకి వెళ్లాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఒకసారి ఐపీఎస్ అని ఆప్షన్ ఇస్తే ఇక జీవితాంతం ఖాకీ డ్రెస్సే! ఐఏఎస్ మార్పు కుదరదు. దీనివల్ల అభ్యర్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ రూల్ వల్ల కొత్త వారికి అవకాశాలు పెరిగినా పాత వారి కెరీర్ ఎదుగుదల ఆగిపోతుందన్నది వాస్తవం. యూపీఎస్‌సీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అభ్యర్థుల్లో కాక రేపుతోంది.