వైద్యం చేయండి… బిల్లు అడగకండి – డబ్బులు కట్టలేదని చికిత్స నిలిపివేయొద్దు

AAP MP Swathi Maliwal
  • ఆ ప్రకారం పార్లమెంటులో చట్టం తేవాలి
  • రాజ్యసభలో ఎంపీ స్వాతి మలివాల్ డిమాండ్
  • ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్ఠీకరణ
  • రోగులు ఆదాయ వనరులు కాదని వెల్లడి
  • పేదోడి ప్రాణం కంటే పైసలే ముఖ్యమా?
  • డబ్బులు ఇవ్వకుంటే వైద్యం చేయరా?
  • కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై ఎంపీ ఫైర్
  • ఆసుపత్రి బెడ్ చార్జీ.. స్టార్ హోటల్ రేంజీ!

సహనం వందే, న్యూఢిల్లీ:

ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల దందాపై రాజ్యసభలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ నిప్పులు చెరిగారు. పేదవాడి ప్రాణం కంటే పైసలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న యాజమాన్యాల తీరును ఎండగట్టారు. అత్యవసర సమయంలో డబ్బుల కోసం రోగిని వేధించకుండా… ముందస్తు చికిత్స అందించేలా కఠిన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందంటూ గళమెత్తారు.

రోగి అంటే ఆదాయం కాదు
ఆసుపత్రులు రోగులను కేవలం డబ్బులు ఇచ్చే మిషన్లుగా చూస్తున్నాయని స్వాతి మలివాల్ మండిపడ్డారు. హోటళ్ల కంటే దారుణంగా గదుల అద్దెలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇన్సూరెన్స్ ఉందని తెలిస్తే చాలు అనవసరమైన టెస్టులు రాస్తూ బిల్లులు పెంచుతున్నారని ఆరోపించారు. ప్రతి చిన్న వస్తువును బిల్లులో కలిపి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు.

చట్టం అందరికీ వర్తించాలి
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఈ చట్టం కింద వైద్య పరీక్షల ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని సూచించారు. ప్రస్తుతం కేవలం 12 రాష్ట్రాల్లోనే ఈ చట్టం అమలులో ఉందని… ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనూ ఇది లేకపోవడం దారుణమని అన్నారు. దీనివల్ల ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నాయని ధ్వజమెత్తారు.

చికిత్సే ప్రాధాన్యత కావాలి
ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే రోగుల విషయంలో మానవత్వం ఉండాలని ఎంపీ కోరారు. చికిత్స ముందు… బిల్లు తర్వాత అనే నిబంధన చట్టబద్ధం చేయాలని పేర్కొన్నారు. డబ్బులు కట్టలేదన్న కారణంతో చికిత్స నిలిపివేయడం నేరమని స్పష్టం చేశారు. రోగి ప్రాణం కాపాడటం కంటే వేరేది ఏదీ ముఖ్యం కాకూడదని హితవు పలికారు. ఈ మేరకు పార్లమెంటులో ప్రత్యేక చట్టం తేవాలని కోరారు.

మందుల పేరుతో దోపిడీ
ప్రైవేటు ఆసుపత్రుల్లో మందుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవని స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. జెనరిక్ మందులకు బదులు ఖరీదైన బ్రాండెడ్ మందులను కట్టబెడుతున్నారని తెలిపారు. బయటి మార్కెట్లో 15 నుంచి 20 శాతం డిస్కౌంట్ దొరుకుతున్నా… ఆసుపత్రులు మాత్రం పూర్తి ధర వసూలు చేస్తున్నాయని చెప్పారు. బిల్లులు పారదర్శకంగా ఉండటం లేదని… లోపల చాలా దాగి ఉన్న చార్జీలు ఉంటున్నాయని విమర్శించారు.

బీమా కంపెనీల తిరకాసు
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల తీరుపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీమియం ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యులకు భారం చేస్తున్నాయని అన్నారు. తీరా క్లెయిమ్ కోసం అడిగితే కుంటి సాకులు చెప్పి తిరస్కరిస్తున్నాయని తెలిపారు. ఇన్సూరెన్స్ ప్రీమియంల పెరుగుదలపై కఠిన పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షలాది కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతున్నాయని గుర్తు చేశారు.

ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి
దేశ భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన వ్యవస్థ అవసరమని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ మనిషిని మనిషిగా చూడాలని… ఆదాయ వనరుగా కాదని హితవు పలికారు. వైద్య రంగాన్ని క్రమబద్ధీకరించకపోతే మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఈ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *