దేశవ్యాప్తంగా 83 సాయుధ శిక్షణ కేంద్రాలు

MP Kalisetti
  • ఎంపీ అప్పలనాయుడి ప్రశ్నకు సమాధానం
  • విజయనగరానికి ఇవ్వడం లేదని వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ:

దేశ సరిహద్దులను కాపాడే వీరులను తయారు చేసేందుకు కేంద్రం భారీ కసరత్తు చేస్తోంది. కేంద్ర సాయుధ బలగాల శిక్షణ కోసం దేశవ్యాప్తంగా అత్యాధునిక మౌలిక వసతులను కల్పిస్తోంది. లోక్‌సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. శిక్షణలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూనే కొత్త కేంద్రాలపై కీలక ప్రకటన చేసింది.

భారీగా శిక్షణ కేంద్రాలు
దేశవ్యాప్తంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) కోసం మొత్తం 83 శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల రక్షణలో ఈ బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సాంప్రదాయ పద్ధతులతోపాటు ఆధునిక మెలకువలను నేర్పిస్తున్నట్లు వివరించారు. ఈ కేంద్రాల ద్వారా లక్షలాది మంది జవాన్లకు నిరంతరం శిక్షణ అందుతోంది.

విజయనగరానికి నిరాశే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం కీలక స్పష్టత ఇచ్చింది. విజయనగరం జిల్లాలో కొత్తగా సాయుధ పోలీసు బలగాల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదని మంత్రి తేల్చి చెప్పారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కలికిరిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ శిక్షణ కేంద్రం కొనసాగుతోందని గుర్తు చేశారు.

ఆధునిక యుద్ధ తంత్రాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా శిక్షణ పద్ధతుల్లో భారీ మార్పులు చేశారు. బేసిక్ ట్రైనింగ్‌తో పాటు కౌంటర్ ఇన్సర్జెన్సీ, జంగిల్ వార్‌ఫేర్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, వైద్య చికిత్సలపై కూడా జవాన్లకు అవగాహన కల్పిస్తున్నారు. అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర సేవల కోసం ప్రత్యేక కోర్సులను కూడా ఈ 83 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి సభకు వివరించారు.

రూ.743 కోట్ల ఖర్చు
గత ఐదేళ్లలో శిక్షణ మౌలిక వసతుల కోసం కేంద్రం భారీగా నిధులు వెచ్చించింది. ఈ కాలంలో మొత్తం 755.42 కోట్ల రూపాయలను కేటాయించగా… అందులో 743.46 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే కేటాయించిన నిధుల్లో దాదాపు 98 శాతానికి పైగా నిధులను వినియోగించారు. వాహనాల కొనుగోలు, ఆధునిక సాంకేతిక పరికరాల కోసం ఈ నిధులు ఖర్చయ్యాయి.

శిక్షణలో సరికొత్త జోరు
శిక్షణ కేంద్రాల విస్తరణతో పాటు ఆధునీకరణపై కేంద్రం దృష్టి సారించింది. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా జవాన్లను తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించామని మంత్రి చెప్పారు. గరిష్టంగా ఖర్చు చేస్తున్న నిధులు బలగాల సామర్థ్యాన్ని పెంచుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సాంకేతికత ఆధారిత శిక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం తన సమాధానంలో వివరించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *