- అవినీతిపై సంచలన వ్యాఖ్యలు
- అవినీతితోనే అభివృద్ధి జరిగిందని విమర్శలు
- సింగిల్ విండో సిస్టమ్ పేరుతో అక్రమాలు
- ఎన్డీటీవీ తమిళనాడు సమ్మిట్ లో వక్తలు
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలో ఇప్పుడు డెవలప్‌మెంట్ మోడల్స్ మధ్య పాలిటిక్స్ హీటెక్కాయి. ఒకవైపు ద్రవిడ నమూనా.. మరోవైపు గుజరాత్ నమూనా అంటూ రాజకీయ పార్టీలు చంకలు గుద్దుకుంటున్నాయి. కానీ ఈ అంకెల గారడీ వెనుక ఉన్న అసలు రంగును ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా, తమిళనాడు మంత్రి పీటీఆర్ త్యాగరాజన్ బయటపెట్టారు. అవినీతిని సమర్థవంతంగా వాడుకోవడంలోనే సక్సెస్ ఉందన్న వీరి విశ్లేషణ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది.
దక్షిణ దిక్కున ప్రగతి జోరు
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆర్థికంగా దూసుకుపోతున్నాయని సుర్జిత్ భల్లా విశ్లేషించారు. కేంద్రం విధించే కఠినమైన నిబంధనలు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉన్నా ఈ రాష్ట్రాలు మాత్రం ఎలా రాణిస్తున్నాయన్నది కీలక ప్రశ్న. దశాబ్దాలుగా ఇక్కడ వృద్ధి రేటు స్థిరంగా ఉండటానికి గల కారణాలను ఆయన విడమరిచి చెప్పారు. పారిశ్రామికవేత్తలు దక్షిణ భారతం వైపు చూడటానికి ఇక్కడి రాజకీయ, పరిపాలనా వాతావరణమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
అవినీతిలోనూ ఒక పద్ధతి
తమిళనాడు సక్సెస్ వెనుక సమర్థవంతమైన అవినీతి ఉందంటూ సుర్జిత్ భల్లా బాంబు పేల్చారు. దేశంలో ప్రతి చోటా అవినీతి ఉన్నప్పటికీ తమిళనాడులో అది ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుందని చెప్పారు. అక్కడ బ్యూరోక్రాటిక్ జాప్యం అస్సలు ఉండదని… సింగిల్ విండో ద్వారా అనుమతులు వస్తాయని వివరించారు. డబ్బు చేతులు మారినా పనులు మాత్రం ఆగవని… అందుకే పెట్టుబడిదారులు అక్కడ హ్యాపీగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ వింత వాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్ నమూనాపై విమర్శలు
సుర్జిత్ భల్లా వ్యాఖ్యలకు మంత్రి పీటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సమర్థవంతమైన అవినీతికి గుజరాత్ మోడల్ పెద్ద ఉదాహరణ అని ఆయన ఎద్దేవా చేశారు. 2014 కంటే ముందు 10 ఏళ్ల పాటు గుజరాత్ లో ఏం జరిగిందో పారిశ్రామికవేత్తలను అడిగితే తెలుస్తుందని చెప్పారు. అక్కడ ఒక చోట డబ్బులు కడితే చాలు పనులన్నీ చకచకా జరిగిపోయేవని విమర్శించారు. అధికారం మొత్తం ఒకరి చేతిలోనే ఉండటం వల్ల అక్కడ ఇలాంటి పద్ధతి సాధ్యమైందని పీటీఆర్ ఆరోపించారు.
సింగిల్ విండో రహస్యం
సింగిల్ విండో సిస్టమ్ పేరుతో జరుగుతున్న తతంగాన్ని వీరు బట్టబయలు చేశారు. తమిళనాడులో పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ మధ్య ఒక స్పష్టమైన అవగాహన ఉంటుందని భల్లా అభిప్రాయపడ్డారు. గుజరాత్ లో కూడా గతంలో ఇదే తరహాలో నిర్ణయాలు తీసుకునేవారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో అనేక మంది అధికారులు, నాయకులు జోక్యం చేసుకోవడం వల్ల పనులు ఆలస్యం అవుతాయని… కానీ ఈ రెండు మోడల్స్ లో ఆ సమస్య లేదని విశ్లేషించారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే వీటి అసలు రహస్యమని తేల్చారు.
రాజకీయ లబ్ధి కోసమేనా
ఈ మోడల్స్ అన్నీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే సృష్టించారని విమర్శకులు మండిపడుతున్నారు. ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఎవరు సమర్థులన్నదే ఇక్కడ అసలు పోటీ అని ధ్వజమెత్తుతున్నారు. దక్షిణ రాష్ట్రాలు సాధించిన పురోగతిని కేవలం అవినీతితో ముడిపెట్టడం సరికాదని కొందరు వాదిస్తున్నారు. విద్యా, వైద్య రంగాల్లో సాధించిన ఫలితాల వల్లే తమిళనాడు వంటి రాష్ట్రాలు బాగుపడ్డాయని చెబుతున్నారు. కానీ మేధావుల మధ్య జరిగిన ఈ చర్చ వ్యవస్థలోని కుళ్లును మాత్రం ఎండగట్టింది.
అంతిమంగా ప్రజలకే నష్టం
అభివృద్ధి ఏ నమూనాలో జరిగినా అవినీతి రాజ్యమేలడం ఆందోళనకరం. గుజరాత్ మోడల్ అయినా.. ద్రవిడ మోడల్ అయినా సామాన్యుడిపై భారం పడుతూనే ఉంది. కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే పాలకులు ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది. అధికార యంత్రాంగం, రాజకీయ నేతలు కుమ్మక్కై చేస్తున్న ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ నమూనాలు కేవలం కాగితాలకే పరిమితమై అంకెల గారడీగా మిగిలిపోతాయి.