- దీర్ఘకాలిక డిమాండ్లపై సీఎం రేవంత్ కు వినతి
- కెరీర్ కు అడ్డుపడుతున్న పదోన్నతుల జాప్యం
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం సంక్షోభంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్లే ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు వైద్యుల్లో తీవ్ర అసంతృప్తిని నింపుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ముఖ్యమంత్రికి మొర
ప్రభుత్వ వైద్యుల సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అప్రమత్తమైంది. సంఘం అధ్యక్షులు డాక్టర్ నరహరి నేతృత్వంలో ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. వైద్య విద్య, ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో నెలకొన్న ఇబ్బందులను ఆయనకు పూసగుచ్చినట్లు వివరించారు. ఈ సమస్యలను అత్యవసరంగా భావించి పరిష్కరించాలని కోరారు. వైద్య విధాన పరిషత్ మనుగడపై డాక్టర్లు కీలక డిమాండ్ ముందుకు తెచ్చారు. దీనిని పూర్తి స్థాయి ద్వితీయ ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌గా మార్చాలని కోరుతున్నారు.
సీనియారిటీ రగడ
ప్రజారోగ్య శాఖలో అమలవుతున్న పాత నిబంధనలు వైద్యుల పాలిట శాపంగా మారాయి. జిల్లా స్థాయి వైద్యాధికారుల నియామకాల్లో సీనియారిటీని తుంగలో తొక్కడంపై డాక్టర్లు మండిపడుతున్నారు. దీనివల్ల సమర్థులైన అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిబంధనలు సవరించి సీనియారిటీ ప్రాతిపదికన పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామీణ కొలువుకు ఊతం
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు వెనకాడుతున్న వైనంపై చర్చ జరిగింది. మారుమూల ప్రాంతాల్లోని వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని సంఘం కోరింది. అక్కడ కనీస వసతులు లేకున్నా సేవలు అందిస్తున్న వారికి ప్రోత్సాహం అవసరమని గుర్తు చేశారు. అప్పుడే నిపుణులైన వైద్యులు అక్కడ నిలదొక్కుకుంటారని సూచించారు.
ఆగిన పదోన్నతులు
వైద్యుల కెరీర్ ఎదుగుదల పదేళ్లుగా అగమ్యగోచరంగా మారింది. కాలపరిమితితో కూడిన పదోన్నతులు కల్పించాలని డాక్టర్లు గట్టిగా కోరుతున్నారు. పదేళ్లు దాటినా ఒకే హోదాలో పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సమయంలో ప్రమోషన్లు రాకపోతే వ్యవస్థలో నైపుణ్యం కొరవడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రజారోగ్యమే ముఖ్యం
వైద్యుల అసంతృప్తి నేరుగా సామాన్య రోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. డాక్టర్లు మానసిక ప్రశాంతతతో ఉన్నప్పుడే నాణ్యమైన చికిత్స అందుతుందని సంఘం గుర్తు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం పంతాలకు పోకుండా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. లేనిపక్షంలో ఆరోగ్య వ్యవస్థకు తీవ్ర నష్టం తప్పదని స్పష్టం చేసింది.