బరితెగిస్తే బడితపూజే – సహజీవనం చేస్తే జైలుకే.. ఇండోనేషియా రూల్

Cohabitation in Indonesia
  • పెళ్లి కాకుండా కలిసుంటే ఆరు నెలల జైలు శిక్ష
  • వివాహానికి ముందు శృంగారంతో కటకటాలే
  • ఇష్టారాజ్యంగా తిరిగితే సీరియస్ యాక్షన్స్
  • షరియా చట్టాల అమలుకు సర్కారు నిర్ణయం
  • విదేశీ పర్యాటకులకూ వర్తించనున్న రూల్స్
  • వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అంటున్న సంఘాలు

సహనం వందే, ఇండోనేషియా:

ఇండోనేషియాలో ఇకపై సహజీవనం చేస్తే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఒకే ఇంట్లో కలిసి ఉండటాన్ని ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోంది. పెళ్లి కాకుండా జంటలు కలిసి ఉంటే 6 నెలల వరకు జైలు శిక్ష విధించేలా కొత్త శిక్షాస్మృతిని శుక్రవారం నుంచి అధికారికంగా అమలు చేస్తోంది. వ్యక్తిగత నిర్ణయాల్లో ప్రభుత్వం తలదూర్చడమే కాకుండా పడకగది ముచ్చట్లపై కూడా నిఘా పెట్టడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సహజీవనానికి ఆరు నెలల జైలు
ఇండోనేషియా ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త చట్టం ప్రకారం పెళ్లి చేసుకోకుండా జంటలు ఒకే ఇంట్లో కలిసి ఉంటే వారిని నేరగాళ్లుగా చూస్తారు. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేసినా అది చట్టవిరుద్ధమే. ఇలాంటి జంటలకు 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీనివల్ల యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే అకె వంటి ప్రాంతాల్లో కఠినమైన షరియా చట్టాలు ఉండగా… ఇప్పుడు వాటిని దేశవ్యాప్తంగా విస్తరించారు. సామాజిక విలువల రక్షణ కోసమే ఈ చర్యలని ప్రభుత్వం సమర్థించుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Living Relationship is crime at Indonesia

పెళ్ళికి ముందు శృంగారానికి ఏడాది జైలు…
కొత్త శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 411 ప్రకారం వివాహం కాకుండా శృంగారంలో పాల్గొంటే గరిష్టంగా ఒక ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. అయితే కేవలం బాధితుల జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మూడో వ్యక్తుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోమని చెబుతున్నప్పటికీ ఈ నిబంధన ప్రజల ప్రైవసీని పూర్తిగా దెబ్బతీస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. దశాబ్దాల నాటి డచ్ వలస చట్టాలను పక్కన పెట్టి మరీ ఈ కఠిన నిబంధనలను ప్రభుత్వం తీసుకువచ్చింది.

పర్యాటకులపై పిడుగు
ఈ కొత్త నియమాలు కేవలం స్థానిక పౌరులకే పరిమితం కాదు. అక్కడికి వెళ్లే విదేశీ పర్యాటకులకు కూడా ఇవి వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాలి వంటి ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు వచ్చే విదేశీయులు ఈ చట్టం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ వ్యాపార సంఘాలు, హోటల్ అసోసియేషన్లు ఈ నిర్ణయంపై గళమెత్తాయి. ఈ కఠిన నిబంధనల వల్ల పర్యాటకులు ఇండోనేషియాకు రావడానికి వెనుకాడతారని… తద్వారా పర్యాటక రంగం, విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ విమర్శకుల నోళ్లకు తాళం
ఈ చట్టం కేవలం శృంగారం లేదా సహజీవనంపైనే కాకుండా రాజకీయ స్వేచ్ఛపై కూడా దెబ్బకొడుతోంది. దేశాధ్యక్షుడిని లేదా ప్రభుత్వ సంస్థలను విమర్శించడం కూడా ఇకపై నేరంగా మారింది. జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా శిక్షార్హమేనని చట్టం చెబుతోంది. ఇది పౌర స్వేచ్ఛను అణచివేయడమేనని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో 2019లో ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అదే నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *