- కాన్పూర్ యువకుడి అద్భుత ప్రయాణం
- ఉత్తరప్రదేశ్ గడ్డపై పుట్టిన తొలి విమాన సంస్థ
- ఈ వారం నుంచి ఆకాశంలో ఎగరనున్న ‘శంఖ్’
సహనం వందే, కాన్పూర్:
నిన్నటి వరకు ఆయన చేతులు టెంపో స్టీరింగ్‌ను తిప్పాయి. నిత్యం రద్దీగా ఉండే కాన్పూర్ గల్లీల్లో వస్తువులను గమ్యస్థానాలకు చేర్చడమే ఆయన దినచర్య. కానీ ఆ చేతులే ఇప్పుడు విమాన రెక్కలకు ఊపిరి పోస్తున్నాయి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి గగన విహారానికి బాటలు వేసిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ విజయగాథ ప్రతి సామాన్యుడికి ఒక స్ఫూర్తి పాఠం.

టెంపో స్టీరింగ్ నుంచి విమానం దాకా
శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ప్రయాణం అత్యంత సామాన్యంగా మొదలైంది. ఒకప్పుడు పొట్టకూటి కోసం కాన్పూర్ రోడ్లపై టెంపో నడిపారు. లోడర్‌గా కూడా పనిచేశారు. చదువు అబ్బకపోయినా కష్టపడే తత్వం ఆయన్ను వదల్లేదు. ఏడేళ్ల క్రితం వరకు ఆయన జీవితం రోజువారీ కూలీ చుట్టూనే తిరిగింది. కానీ మదిలో ఏదో సాధించాలనే బలమైన కోరిక మాత్రం ఎప్పుడూ రగులుతూనే ఉండేది. అదే పట్టుదల ఆయన్ను ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తొలి ఎయిర్‌లైన్ అధినేతగా నిలబెట్టింది.
సిమెంట్ వ్యాపారంతో మారిన జాతకం…
2014 సంవత్సరం శ్రవణ్ జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. అప్పుడే ఆయన సిమెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. చిన్నగా మొదలైన ఆ వ్యాపారం అనతికాలంలోనే విస్తరించింది. అక్కడి నుంచి స్టీల్, మైనింగ్, రవాణా రంగాల్లోకి దూసుకెళ్లారు. భారీ ట్రక్కుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. 2022లో శంఖ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి భవన నిర్మాణ సామాగ్రి రంగంలో కోట్లు గడించారు. ఈ ఆర్థిక విజయమే ఆయన విమానయాన కలకు పునాది వేసింది.
సామాన్యుడి కష్టం నుంచి పుట్టిన ఆలోచన
మధ్యతరగతి వారికి విమాన ప్రయాణం అంటే ఇప్పటికీ ఒక కల. అత్యవసర సమయంలో టికెట్ ధరలు చూస్తే గుండె గుభేలుమంటుంది. ఈ విషయాన్ని శ్రవణ్ లోతుగా గమనించారు. విమాన ప్రయాణం లగ్జరీ కాదనీ… అదీ ఒక సామాన్యుడి రవాణా సదుపాయం కావాలని నిర్ణయించుకున్నారు. అందుకే 2023లో శంఖ్ ఏవియేషన్ సంస్థను స్థాపించారు. పండగల సమయంలో టికెట్ ధరలు పెంచకుండా బస్సు చార్జీలకే విమాన సేవలు అందించాలన్నదే ఆయన ప్రధాన సంకల్పం.
ఈ జనవరి నుంచే విమానాల విహారం…
ఈ జనవరి మొదటి వారంలోనే శంఖ్ ఎయిర్ తన సేవలను ప్రారంభించనుంది. మొదట మూడు ఎయిర్‌బస్ విమానాలతో ఈ ప్రయాణం మొదలవుతుంది. మరో రెండు నెలల్లో విమానాల సంఖ్య ఐదుకు చేరుతుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. లక్నో నుంచి ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు నేరుగా సర్వీసులు నడుపుతారు. వారణాసి, ప్రయాగ్‌రాజ్ వంటి ఆధ్యాత్మిక నగరాలను కూడా కలుపుతూ రూట్లు సిద్ధం చేశారు.
విమానం ఇక సామాన్యుడి వాహనం
శంఖ్ ఎయిర్ కేవలం లాభాల కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేయనుంది. మధ్యతరగతి ప్రజలకు చౌకగా టికెట్లు అందించడమే తమ విధి అని శ్రవణ్ స్పష్టం చేశారు. విమానం ఎక్కడం అంటే లగ్జరీ అనే భావనను తుడిచేయడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. వచ్చే మూడేళ్లలో విమానాల సంఖ్యను 25కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. 2028 నాటికి అంతర్జాతీయ రూట్లలో కూడా విమానాలను నడిపేలా కసరత్తు చేస్తున్నారు.
యువతకు స్ఫూర్తిదాయక ప్రయాణం
శ్రవణ్ ప్రయాణం యువతకు ఒక గొప్ప పాఠం. సంకల్పం ఉంటే టెంపో డ్రైవర్ కూడా విమానయాన సంస్థను నడపగలడని ఆయన నిరూపించారు. కేవలం 35 ఏళ్ల వయసులోనే ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ ఈ స్థాయికి చేరారు. కాన్పూర్ గల్లీల నుంచి ఆకాశ మార్గం దాకా సాగిన ఈ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యుల కలకు రెక్కలు కట్టే శంఖ్ ఎయిర్ త్వరలోనే ఆకాశంలో తన విజయ శంఖాన్ని పూరించనుంది.