- వొడాఫోన్-ఐడియాకు కేంద్ర ప్రభుత్వం సలాం
- పదేళ్ల వరకు అప్పులు, వడ్డీ చెల్లింపు వాయిదా
- ఆ మేరకు అవకాశం కల్పించిన మోడీ సర్కార్
- 2040 వరకు ఎగవేతకు కంపెనీకి అనుమతి?
- వేల కోట్ల రూపాయల ఎగవేతకు కేంద్రం రూట్లు
సహనం వందే, న్యూఢిల్లీ:
భారత కుబేరుడు బిర్లాకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కళ్ళు చెదిరే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. అప్పుల కుప్పగా మారిన వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం బిగ్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిలు 87,695 కోట్ల రూపాయలను దశాబ్దాల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2032-41 మధ్య ఆ బకాయిలు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది.
బిర్లా ఆధ్వర్యంలో కంపెనీ…
వోడాఫోన్ ఐడియా (వీఐ) అనేది ఒక ప్రైవేటు టెలికాం సంస్థ. ఇది ప్రధానంగా రెండు పెద్ద వ్యాపార గ్రూపుల విలీనం ద్వారా ఏర్పడింది. మన దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా దీనిలో ప్రధాన భాగస్వామి. అంతకుముందు ఉన్న ఐడియా సెల్యులార్ ఆయనదే. లండన్ కేంద్రంగా పనిచేసే వోడాఫోన్ గ్రూప్ అంతర్జాతీయ టెలికాం సంస్థ. ఆ కంపెనీల బకాయిలను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఫ్రీజింగ్ చేయడం విమర్శలకు తావిస్తోంది.
అప్పులకు బదులుగా వాటా…
వోడాఫోన్ ఐడియా సంస్థ ప్రభుత్వానికి స్పెక్ట్రమ్ ఫీజులు, ఏజీఆర్ బకాయిల కింద వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బు కట్టే స్తోమత కంపెనీకి లేకపోవడంతో 2021లో కేంద్ర ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. బకాయిలపై వడ్డీని షేర్లుగా మార్చుకునేందుకు (ఈక్విటీ కన్వర్షన్) అవకాశం ఇచ్చింది. అలా 2023 ఫిబ్రవరిలో ప్రభుత్వం దాదాపు 16,133 కోట్ల రూపాయల వడ్డీ బకాయిలకు బదులుగా 33 శాతం వాటాను తీసుకుంది. ఆ తర్వాత మరిన్ని బకాయిలను వాటాగా మార్చడంతో ఇది 49 శాతానికి చేరింది. అలా ప్రభుత్వం అందులో వాటాదారుగా మారింది.
వాటా ఉన్నా నగదు రాదు…
ప్రభుత్వానికి ఈ కంపెనీలో దాదాపు సగం వాటా ఉంది. కానీ ఇది కేవలం కాగితాల మీద కనిపిస్తున్న విలువే. కంపెనీ షేర్ల విలువ నిరంతరం పడిపోతుండటంతో ప్రభుత్వం ఈ వాటాను అమ్మి నగదు రూపంలోకి మార్చుకోవడం అసాధ్యం. ఒకవేళ మార్కెట్లో షేర్లు అమ్మితే ప్రభుత్వం భారీగా నష్టపోతుంది. అంటే అటు బకాయిలు రావు, ఇటు ఉన్న వాటాకు విలువ లేదు. ఇలాంటి స్థితిలో 87,695 కోట్లు వాయిదా వేయడం అంటే ఆ సొమ్మును కంపెనీకి కానుకగా ఇచ్చినట్లే.
సామాన్యుడి సొమ్ము పక్కదారి…
అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) అనేది నిజానికి ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను సొమ్ము లాంటిది. కంపెనీలు మన దగ్గర వసూలు చేసిన ఆదాయంలో కొంత భాగం ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పన్నును కంపెనీ పెద్దలు పక్కదారి పట్టించడం వల్ల వేల కోట్లు పేరుకుపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ సొమ్మును వసూలు చేయకుండా 2040 వరకు టైమ్ ఇవ్వడం అంటే ప్రైవేటు యాజమాన్యం చేసిన పాపాలకు ప్రజల సొమ్ముతో ప్రాయశ్చిత్తం చేయడమే.
దివాలా తీస్తే దిక్కెవరు?
ప్రస్తుతం కంపెనీకి ఊపిరి పోయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోతే పరిస్థితి ఏమిటి? వచ్చే ఐదేళ్లలో వొడాఫోన్ ఐడియా దివాలా తీస్తే ఈ 87 వేల కోట్లు పూర్తిగా గాలిలో కలిసిపోతాయి. అప్పుడు 49 శాతం వాటా ఉన్నా ప్రభుత్వం ఏమీ చేయలేదు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఒక నష్టాల్లో ఉన్న కంపెనీపై పెట్టడం దారుణం అని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
నిబంధనలను తుంగలో తొక్కారు
ఏజీఆర్ బకాయిల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేయాలని చెప్పింది. కానీ ప్రభుత్వం మాత్రం టెలికాం రంగంలో పోటీ పేరుతో నిబంధనలను పక్కన పెట్టింది. ఒక కంపెనీ తన వైఫల్యాల వల్ల నష్టపోతుంటే దానికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలా మారి భరోసా ఇవ్వడంపై ఆరోపణలు వస్తున్నాయి. రేపు రైతులు లేదా సామాన్యులు తమ అప్పులు కట్టలేమంటే ప్రభుత్వం ఇలాగే 15 ఏళ్ల గడువు ఇస్తుందా?
బాధ్యత లేని యాజమాన్యం
వొడాఫోన్ ఐడియా యాజమాన్యం గతంలో కూడా నిధులు సమీకరిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచకుండా కాలక్షేపం చేస్తూ బకాయిలు ఎగ్గొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ పెద్దలు తమ లాభాలను రక్షించుకుంటూ నష్టాలను మాత్రం ప్రభుత్వ ఖాతాలో వేస్తున్నారు. ప్రభుత్వం కూడా కంపెనీలోని తన వాటాను నగదుగా మార్చుకునే ప్రయత్నం చేయకుండా బకాయిలపై వడ్డీని కూడా వదులుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు.
ప్రజలకు మిగిలేది భారమే
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టెలికాం సేవల ధరలు తగ్గుతాయని ఆశించడం భ్రమ. ఇప్పటికే కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఈ బకాయిల వెసులుబాటు కేవలం కంపెనీ బ్యాలెన్స్ షీట్ ను బాగు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సామాన్యుడికి మాత్రం మౌలిక సదుపాయాల కొరత, కాల్ డ్రాప్స్ వంటి సమస్యలు తప్పవు. ఒక ప్రైవేటు కార్పొరేట్ సంస్థ అప్పుల భారాన్ని పరోక్షంగా ప్రజల భుజాన వేయడమే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు రహస్యం.