- ప్రమాదకరంగా ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పిస్తూ రైడ్
- రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఒత్తిడి
- బ్లింకిట్, జెప్టో, జొమాటోలపై కార్మికుల గళం
- టైం ఆప్షన్ తీసేయాలని దేశవ్యాప్త సమ్మె
- పాత పేమెంట్ పద్ధతినే అమలుకు డిమాండ్
- కొత్త ఏడాది వేళ స్తంభించనున్న ఫుడ్ సేవలు
సహనం వందే, హైదరాబాద్:
మన ఆకలి తీర్చే గిగ్ కార్మికులు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొత్త ఏడాది వేడుకల వేళ తమ కష్టాలను ప్రపంచానికి చాటేందుకు సిద్ధమయ్యారు. కంపెనీల మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాల డెలివరీ పేరుతో సాగిస్తున్న మరణ మృదంగాన్ని అడ్డుకోవాలని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.
10 నిమిషాల డేంజర్
డెలివరీ యాప్స్ ఇప్పుడు 10 నిమిషాల డెలివరీ అంటూ వింత ప్రయోగాలు చేస్తున్నాయి. దీనివల్ల డెలివరీ బాయ్స్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సిగ్నల్స్ దాటుతూ ప్రాణాలకు తెగించి వాహనాలు నడుపుతున్నారు. నిమిషం ఆలస్యమైతే వారి రేటింగ్స్ పడిపోతున్నాయి. ఇన్సెంటివ్స్ రాకుండా కంపెనీలు అడ్డుకుంటున్నాయి. అందుకే ఈ ప్రమాదకరమైన ఆప్షన్ ను వెంటనే తొలగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాణ సంకటంగా డెలివరీ
హైదరాబాదులో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ డెలివరీ రైడర్లు గంటకు 80 నుండి 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. యాప్ ఇచ్చే టైమర్ వల్ల రాంగ్ రూట్లో కూడా వెళ్లక తప్పడం లేదు. 10 నిమిషాల్లో డెలివరీ ఇవ్వకపోతే పెనాల్టీలు పడుతున్నాయి. పొట్టకూటి కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నామని కిషోర్ కుమార్ అనే రైడర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పేమెంట్ పద్ధతిపై రగడ
గతంలో ఉన్న పేమెంట్ పద్ధతిని కంపెనీలు ఏకపక్షంగా మార్చేశాయి. దీనివల్ల కార్మికుల ఆదాయం సగానికి సగం తగ్గిపోయింది. పండుగల సమయంలో ఇచ్చే బోనస్ లు కూడా నిలిపివేశారు. అల్గారిథమ్ పేరుతో కంపెనీలు చేసే మాయాజాలం వల్ల కష్టపడినా చివరకు మిగిలేది సున్నా అని కార్మికులు వాపోతున్నారు. పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంఘం డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్త నిరసన జ్వాల
ఈ సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా భారీగా ఉండనుంది. ఇప్పటికే డిసెంబర్ 25వ తేదీన జరిగిన ట్రైలర్ లో దాదాపు 40 వేల మంది పాల్గొన్నారు. దీంతో 60 శాతం ఆర్డర్లు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు కొత్త సంవత్సర సందర్భంగా అసలు సినిమా చూపిస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల సేవలకు ఆటంకం కలగనుంది. సుమారు లక్షన్నర మంది కార్మికులు ఈ పోరాటంలో భాగస్వాములవుతున్నారు.
మహిళా కార్మికుల అడుగు
భారతదేశంలోనే మొదటిసారిగా మహిళా గిగ్ కార్మికుల సంఘం కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చింది. మహిళా కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. కిలోమీటరుకు కనీస రేటును ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెటర్నిటీ లీవ్స్, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్లాట్‌ఫారమ్ కార్మికులను చట్టబద్ధంగా కార్మికులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు.
కంపెనీల బెదిరింపులు
సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను యాజమాన్యాలు భయపెడుతున్నాయి. గోదాముల వద్ద బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటున్నాయి. నిరసన తెలిపే వారి ఐడీలను బ్లాక్ చేస్తామని బెదిరిస్తున్నాయి. అయినా వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. లేదంటే సేవలు పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.