- హైదరాబాదులో అభిమానుల అతి
- వారిని చుట్టుముట్టి ఇబ్బందిపెట్టిన జనం
- వరుస ఘటనలతో సినీ ప్రముఖుల ఆందోళన
- రాష్ట్రంలో శాంతిభద్రతలపై విపక్షాల నిప్పులు
- పోలీసుల వైఫల్యమే కారణమని విమర్శలు
సహనం వందే, హైదరాబాద్:
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడటం సహజమే అయినా అది హద్దులు దాటితేనే ప్రమాదం. తాజాగా అగ్ర కథానాయిక సమంతకు హైదరాబాదులో ఎదురైన అనుభవం ఇప్పుడు సంచలనంగా మారింది. జనం మధ్య చిక్కుకుని ఆమె పడ్డ ఇబ్బంది చూస్తుంటే నగరంలో భద్రత ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రక్షణ కరువైన వేళ భాగ్యనగరం పరువు పోతోందని విపక్షాలు సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి.
తోపులాటలో సమంత
హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సమంతకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆమె వస్తున్నారని తెలియగానే అభిమానులు భారీగా తరలివచ్చారు. సమంతను చూడాలని, సెల్ఫీలు తీసుకోవాలని ఒక్కసారిగా జనం ఆమెపైకి దూసుకువచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది ఆపడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. జనాల తోపులాటలో సమంత తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతి కష్టం మీద సిబ్బంది ఆమెను కారు వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఇంత జరుగుతున్నా ఆమె ఎంతో నిబ్బరంగా ఉండటం గమనార్హం.

నిధి అగర్వాల్ కూ చేదు అనుభవమే…
నగరంలో సినీ తారలకు భద్రత కరువైందనే వాదన బలంగా వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే నటి నిధి అగర్వాల్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఒక ప్రచార కార్యక్రమానికి వెళ్లిన ఆమెను జనం చుట్టుముట్టారు. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో చిత్ర పరిశ్రమలో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని… ఈవెంట్ల నిర్వహణలో కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
విపక్షాల విమర్శలు…
ఈ ఘటనపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ వీడియోలు వైరల్ అవుతుంటే హైదరాబాద్ నగరానికి అవమానంగా ఉందని మండిపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. గత 10 రోజుల్లోనే 15 హత్యలు జరిగాయని… అసలు పోలీసులు ఏం చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు.
కేంద్ర మంత్రి సూచనలు…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రైవేట్ కార్యక్రమాల నిర్వహణలో సమూల మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఈవెంట్లు నిర్వహించేటప్పుడు కచ్చితమైన నిబంధనలు ఉండాలని చెప్పారు. తెలంగాణ పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలాంటి అపశ్రుతులు దొర్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు నగర ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం తనకు ఈ విషయం తెలియదని… తాను బిజీగా ఉన్నానని దాటవేయడం గమనార్హం.