భారత్ హిందూ దేశమే – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్తీకరణ

Bharat HIndu Desam - Mohan Bhagavath
  • అందుకోసం పార్లమెంటు ఆమోదం అక్కర్లేదు
  • రాజ్యాంగంతో సంబంధం లేని పరమ సత్యం
  • ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకంకాదన్న చీఫ్
  • హిందూ అంటే ద్వేషించడం కాదని వివరణ
  • కుల వివక్ష హిందుత్వ కాదని కామెంట్
  • భగవత్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా సంచలనం

సహనం వందే, కోల్ కతా:

హిందూ జీవన విధానమే భారత దేశానికి ఆత్మ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని అంగీకరించాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా దేశ మూలాలను వెతకాలని… భారత్ ఎప్పటికీ హిందూ దేశంగానే వర్ధిల్లుతుందని కోల్ కతా వేదికగా ఆయన కుండబద్దలు కొట్టారు.

RSS Chief Comments

అది సూర్యోదయం లాంటి సత్యం
తూర్పున సూర్యుడు ఉదయించడానికి ఏ రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని భగవత్ వ్యాఖ్యానించారు. అదే విధంగా భారత్ హిందూ దేశం అనడానికి కూడా ప్రత్యేక చట్టాలు అక్కర్లేదని అన్నారు. ఇది ఈనాటి నిర్ణయం కాదని… శతాబ్దాలుగా వస్తున్న సత్యమని చెప్పారు. ఈ దేశాన్ని మాతృభూమిగా భావించే వారు, ఇక్కడి సంస్కృతిని ప్రేమించే వారు ఉన్నంత వరకు ఇది హిందూ దేశమేనని స్పష్టం చేశారు. పార్లమెంటులో చట్టం చేసినా చేయకపోయినా వాస్తవం మారదని ధీమా వ్యక్తం చేశారు.

ముస్లింలకు వ్యతిరేకం కాదు…
ఆర్ఎస్ఎస్
అంటే కేవలం హిందువుల కోసమే పనిచేస్తుందని… అది ముస్లింలకు వ్యతిరేకమని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సంఘ్ ఎప్పుడూ పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు. తమపై పగ పెంచుకునే వారు ఒక్కసారి వచ్చి తమ కార్యకలాపాలను గమనించాలని కోరారు. వాస్తవాలను తెలుసుకోకుండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. దేశం పట్ల భక్తి ఉన్న ఎవరైనా ఇక్కడ భాగస్వాములేనని హితవు పలికారు.

కుల వివక్ష హిందుత్వ కాదు…
హిందుత్వ అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం కాదని మోహన్ భగవత్ వివరించారు. పుట్టుకతో వచ్చే కుల వివక్షకు హిందుత్వలో స్థానం లేదన్నారు. అందరూ సమానమేనన్న భావనతోనే సంఘ్ ముందుకు వెళ్తోందని చెప్పారు. భారత దేశ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ద్వేషం లేని సమాజ స్థాపనే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

మాతృభాషపై మమకారం పెరగాలి
మన దైనందిన జీవితంలో విదేశీ భాషల వ్యామోహం తగ్గాలని భగవత్ సూచించారు. స్వభాషలోనే ఆత్మీయత ఉంటుందని గుర్తు చేశారు. మాతృభాషను గౌరవించడం అంటే మన మూలాలను గౌరవించడమేనని అన్నారు. పూర్వీకుల గొప్పతనాన్ని చాటిచెప్పే సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *