అలవెన్స్ లాక్… డాక్టర్ల షాక్ – టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ నరహరి ఆవేదన

Dr.Narahari TGGDA President raise voice on Allowances
  • కొన్ని మెడికల్ కాలేజీలకు మాత్రమే భత్యం
  • పది కళాశాలల్లో ఐదింటికే మంజూరు

సహనం వందే, హైదరాబాద్:

తెలంగాణలో నూతనంగా స్థాపించిన మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 10 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా… వాటిల్లో పనిచేస్తున్న వైద్యులకు ఇవ్వాల్సిన అదనపు అలవెన్స్ కేవలం 5 కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సంఘం నిప్పులు చెరిగింది. ప్రభుత్వమే విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులలో పది కళాశాలల ప్రస్తావన స్పష్టంగా ఉన్నప్పటికీ అలవెన్స్ విషయంలో కోత విధించడం అన్యాయమని, ఇది డాక్టర్లను మోసం చేయడమేనని టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ బి. నరహరి మండిపడ్డారు. ఈ విధానం వల్ల అనేకమంది డాక్టర్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లిఖితపూర్వక అలవెన్స్ హామీ గాలికే!

కొత్త కళాశాలల అలవెన్సుల విషయంలో కేవలం అధికారిక ఉత్తర్వులే కాకుండా ఏకంగా మంత్రివర్గ ఉపసంఘం కూడా స్పష్టమైన హామీ ఇచ్చిందని టీజీజీడీఏ గుర్తు చేసింది. ఉపసంఘం ఇచ్చిన హామీని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీజీజీడీఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యున్నత స్థాయి కమిటీ ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కేవలం ఐదు కళాశాలలకు మాత్రమే భత్యాలు ఇవ్వాలని పట్టుబట్టడం రాష్ట్ర వైద్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు.

అందరికీ న్యాయం చేయండి!
అలవెన్స్
విషయంలో గిరిజన ప్రాంతాలలోని కాలేజీలకు మాత్రమే పరిమితం చేయకూడదని టీజీజీడీఏ అభిప్రాయపడింది. కొత్తగా స్థాపించిన వైద్య కళాశాలలు ఏవైనా సరే… అవి గిరిజన ప్రాంతంలో ఉన్నా లేక ఇతర ప్రాంతంలో ఉన్నా వాటిల్లో పనిచేస్తున్న డాక్టర్లందరికీ ఈ అదనపు భత్యాలను కచ్చితంగా అందించాలని సంఘం కోరింది. ఈ వివక్ష చికిత్స నాణ్యతపై, అలాగే వైద్యుల మనోధైర్యంపై ప్రభావం చూపుతుందని టీజీజీడీఏ కోశాధికారి డాక్టర్ ఎం.కె. రవూఫ్ హెచ్చరించారు. అందరికీ ఒకే రకమైన గౌరవం, సమానమైన న్యాయం దక్కాలని ఆయన ఉద్ఘాటించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *