ప్రేక్షకులే మా బలం… కమల్ హాసన్!
సహనం వందే, విశాఖపట్నం:
తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో థగ్ లైఫ్ ఒకటి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్బస్టర్లను అందించిన ఈ సంస్థ, ఇప్పుడు థగ్ లైఫ్‌ని భారీ ఎత్తున విడుదల చేయబోతోంది. ఈ మేరకు గురువారం మేకర్స్ విశాఖపట్నంలో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
కమల్ హాసన్ భావోద్వేగ ప్రసంగం…
ప్రీ-రిలీజ్ ఈవెంట్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ విశాఖపట్నం ప్రజల పట్ల తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. ‘వైజాగ్ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చాను. అప్పటికి నా మొహం కూడా ఎవరికి తెలియదు. షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ కూడా నడవలేని ఫ్యాన్ బేస్ ని మరో చరిత్ర అనే చిత్రం ఇచ్చింది. తర్వాత ఏక్ తుజే కేలియే సినిమా చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు మన కుర్రాడు హిందీకి వెళ్లి కొట్టాడురా అని అభినందించారు. అలాంటి వైజాగ్‌లో సాగర సంగమం, ఏక్ తుజే కేలియే, శుభసంకల్పం సినిమాలు చేశాను. ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి నేను సెల్యూట్ చేస్తాను. అలాగే నేర్చుకున్నాను. నేను కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ చేశాను. అయితే నా బ్యాడ్ ఫిలిమ్స్ మర్చిపోయి కేవలం మంచి సినిమాలనే గుర్తుపెట్టుకున్నారు. మంచి సినిమాలు మీకు అందించడం నా బాధ్యత. నేను 15 తెలుగు సినిమాలు చేస్తే అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ప్రేక్షకులకు నా రుణం తీర్చుకోవడానికి థగ్ లైఫ్ సినిమా మీకు అందిస్తున్నాను. ఒక కళాకారుడు చేసే పని ఇదే. ఇది చాలా గొప్ప చిత్రం. శింబు అద్భుతమైన నటన కనబరిచారు. నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో కనిపించారు. అభిరామి అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. నాజర్ తో నాది చాలా సుదీర్ఘ ప్రయాణం. ఆయన లాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష నటనను ప్రేక్షకులు చాలా ఆస్వాదిస్తారు. చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్ 5న మేము అనుకున్నది కరెక్టా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకి మీరు ఇచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నాను. జూన్ 5న అందరం థియేటర్స్‌లో కలుద్దాం’ అని అన్నారు.