- ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ టాపిక్
- గ్యాంగ్ వార్ సంస్కృతిపై రాయల్టీపై చర్చ
- థాయ్‌లాండ్‌లో సినిమా తీసినా వింత వాదన
సహనం వందే, ముంబై:
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాస్తున్న ధురంధర్ ది రివెంజ్ చిత్రం ఇప్పుడు ఒక అంతర్జాతీయ చర్చకు దారితీసింది. కరాచీలోని ల్యారీ మురికివాడ నేపథ్యంలో సాగే ఈ కథ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయడంతో అక్కడి స్థానికులు వింత డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. తమ ప్రాంతం పేరును, అక్కడి పరిస్థితులను వాడుకుని కోట్లు గడించిన నిర్మాతలు తిరిగి తమకు వాటా ఇవ్వాలని కోరడం ఇప్పుడు సరిహద్దుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

బ్యాంకాక్ సెట్.. ల్యారీ ఎఫెక్ట్
ఈ సినిమాలో కనిపించే గరుడ చౌక్, ఇరుకైన వీధులు, మురికివాడలు అన్నీ పాకిస్థాన్‌లోని ల్యారీని తలపిస్తాయి. కానీ వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఒక్క రోజు కూడా పాకిస్థాన్‌లో జరగలేదు. చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆరెకరాల స్థలంలో భారీ సెట్ వేసి ల్యారీని పునర్నిర్మించారు. కానీ ఆ సెట్ ఎంత సహజంగా ఉందంటే ల్యారీ ప్రజలు అది తమ ఊరేనని భ్రమపడ్డారు. తమ ప్రాంతాన్ని ఇంత గొప్పగా చూపించి కోట్లు సంపాదిస్తున్నారని వారు నమ్ముతున్నారు.
ఎందుకు వాటా అడుగుతున్నారు?
సినిమాలో తమ ప్రాంతం పేరును, అక్కడి గ్యాంగ్ వార్ సంస్కృతిని వాడుకోవడం వల్ల తమకు గుర్తింపు వచ్చిందని… కాబట్టి ఆ లాభాల్లో తమకు భాగం ఉండాలని ల్యారీ ప్రజలు వాదిస్తున్నారు. ముఖ్యంగా సినిమా 1000 కోట్లు వసూలు చేయడంతో అందులో కనీసం 500 కోట్లు లేదా 80 శాతం వాటా తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని వాడుకుని నిర్మాతలు బాగుపడ్డారని… ఆ డబ్బుతో తమ ఊరిని అభివృద్ధి చేయాలని వారు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
రణవీర్ సింగ్ మాయాజాలం
రణవీర్ సింగ్ ఈ సినిమాలో పోషించిన హంజా అలీ మజారీ అనే పాత్ర ల్యారీ గ్యాంగ్ లీడర్ల స్ఫూర్తితోనే రూపొందింది. ఈ పాత్రకు వచ్చిన క్రేజ్ కారణంగానే సినిమాకు ఇంతటి భారీ వసూళ్లు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ల్యారీ ప్రజల డిమాండ్లపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ గొడవ వల్ల సినిమాకు ఉచిత ప్రచారం లభించి వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.