ఏఐలో మాతృ’ఘోష’ – ఇంగ్లీష్‌ కే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దాసోహం

AI Vs Telugu
  • ఇతర భాషలపై వివక్ష… అంతర్జాతీయ కుట్ర
  • మాతృభాషకు మరణ శాసనం లిఖిస్తున్న ఏఐ
  • ఇంగ్లీష్ తెలిస్తే ప్రాణభిక్ష… లేకుంటే మరణశిక్ష
  • వెయ్యి అబద్ధాల కృత్రిమ మేధస్సు

సహనం వందే, హైదరాబాద్:

మనం సృష్టించిన యంత్రాలు మనల్ని కాపాడతాయని నమ్మాం. కానీ ఆ మేధస్సు వెనుక ఒక దారుణమైన వివక్ష దాగి ఉంది. ఏఐ అందరికీ సమానమనేది ఒక భ్రమ మాత్రమేనని తేలిపోయింది. అక్షరాల మధ్య తేడా ప్రాణాల మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఇంగ్లీష్‌ రాని వాడు ఏఐని నమ్మితే అది నేరుగా ప్రమాదానికే దారి చూపిస్తుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు… ఒక అమానవీయ భాషా వివక్ష.

మౌనంగా రోదిస్తున్న మాతృత్వం
ఒక తల్లి వేదనను అర్థం చేసుకోలేని ఏఐ మేధస్సు ఎంత ఉన్నా వ్యర్థమే. ఒక గర్భవతి తనకు కాళ్ల వాపులు ఉన్నాయని ఇంగ్లీష్‌లో అడిగితే… ఆ యంత్రం ఆమెను హెచ్చరిస్తూ ‘ప్రీ ఎక్లాంప్సియా’ ముప్పు గురించి జాగ్రత్త పడమని చెబుతోంది. కానీ అదే ప్రశ్నను మాతృభాషలో అడిగితే ‘ఏమీ కాదు’ అని నిర్లక్ష్యంగా బదులిస్తోంది. భాష మారితే ప్రాణానికి ఇచ్చే విలువ కూడా మారిపోతుందా అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న.

AI English Vs Telugu

ఇంగ్లీష్ తెలిస్తే ప్రాణభిక్ష… లేకుంటే మరణశిక్ష
వైద్యం గురించి ఏఐ ఇచ్చే సమాధానాలు ప్రాణసంకటంగా మారుతున్నాయి. గుండెపోటు లక్షణాల గురించి ఇంగ్లీష్‌లో అడిగితే నిమిషాల్లో ఆసుపత్రికి వెళ్లమని చెప్పే ఏఐ ఇతర భాషల్లో మాత్రం అవే లక్షణాలకు చిన్నపాటి చిట్కాలు చెబుతూ కాలయాపన చేస్తోంది. ఇంగ్లీష్ తెలిసిన వాడికి ప్రాణభిక్ష… తెలియని వాడికి మరణశిక్ష అన్నట్లుగా ఏఐ తీరు ఉందనడానికి ఇదే నిదర్శనం.

అంకెల వెనుక అగాధం
ఒక ఏఐ మోడల్ ఇంగ్లీష్‌లో 75 శాతం మేర సరైన సమాధానాలు ఇస్తుంటే ఇతర భాషల్లోకి వచ్చేసరికి కేవలం 22 శాతానికే పరిమితమవుతోంది. అంటే ఇతర భాషల్లో అడిగే ప్రశ్నల్లో మెజారిటీ సమాధానాలు అవాస్తవాలే. సమాచారం లేని చోట ఏఐ సొంతంగా కథలు అల్లి తప్పుడు వైద్య సలహాలు ఇస్తోంది. ఇది కేవలం గణాంకాల వైఫల్యం కాదు.. కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం.

లాభాల కోసమే ప్రాధాన్యతలు
‘ది ఎకనామిస్ట్’ నివేదిక ప్రకారం… ఏఐ లోపాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను ముప్పులోకి నెడుతున్నాయి. టెక్ కంపెనీలు కేవలం లాభాల కోసమే కొన్ని భాషలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని స్పష్టమవుతోంది. వైద్యం వంటి కీలక రంగాల్లో ఏఐని గుడ్డిగా అనుమతించడం వల్ల పేద దేశాల్లో మరణాల రేటు పెరిగే అవకాశం ఉంది. సాంకేతికత సామాన్యుడికి రక్షణగా నిలవనప్పుడు అది ఎంత గొప్పదైతే మాత్రం లాభం ఏముంది?

మానవత్వం లేని మేధస్సు
మానవత్వం లేని మేధస్సు మరణ మృదంగాన్నే వాయిస్తుంది. భాషా అంతరాల వల్ల వైద్య చికిత్సలో పొరపాట్లు జరిగితే దానికి బాధ్యులు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ అసమానతలను తక్షణమే తొలగించకపోతే ఆధునిక సాంకేతికత ఒక శాపంగా మారడం ఖాయం. మనం నేర్చుకోవాల్సింది భాషను కాదు.. తోటి మనిషి ప్రాణానికి ఇచ్చే విలువను.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *