- వార్తా ప్రసారాలపై వేటుకు సర్కారు సన్నాహం
- యుద్ధ నేపథ్యంలో మారుతున్న వార్తా గమనం
- జర్నలిజం ముంగిట కొత్త సవాళ్లు
- మీడియాపై పెరుగుతున్న రాజకీయ దాడులు
సహనం వందే, హైదరాబాద్:
యుద్ధంపై అమెరికా వార్తా సంస్థలు ఇస్తున్న స్టోరీలపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రసార హక్కులే ఆయుధాలుగా మారాయి. వార్తా సంస్థల మెడపై కత్తి వేలాడుతోంది. స్వేచ్ఛాయుత ప్రసారాలకు తెరపడుతుంది. నియంత్రణే లక్ష్యంగా పాలకులు సాగిస్తున్న ఈ క్రీడ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. భయాందోళనల మధ్య జర్నలిజం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వానికి, మీడియాకు మధ్య యుద్ధం మొదలైంది. ప్రసార హక్కుల రద్దుతో పరిస్థితి మరింత విషమించింది.
దూకుడు పెంచిన ఎఫ్ సీసీ
ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్ సీసీ) చైర్మన్ బ్రెండన్ కార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రాడ్‌కాస్టర్ల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. మీడియా సంస్థల తీరుపై ఆయన మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే వార్తలు ఇస్తున్నారని ఆరోపించారు. లైసెన్స్ రెన్యూవల్ సమయంలో ఇవన్నీ చూస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా లేని వార్తలు రాస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

సోషల్ మీడియా ట్రంప్ పోస్టు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. మీడియా సంస్థల యుద్ధ కథనాలపై ఆయన గుర్రుగా ఉన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో 5 అమెరికన్ రిఫ్యూయలింగ్ విమానాలపై దాడి జరిగిందని ఆ జర్నల్ రాసింది. ఆ వార్త తప్పుదారి పట్టించేలా ఉందని ట్రంప్ విమర్శించారు. అమెరికా ఓడిపోవాలని మీడియా కోరుకుంటోందని ఆయన ఆరోపించారు.
ఎఫ్ సీసీ చైర్మన్ వాదన
ప్రసార సంస్థలు ప్రజా ప్రయోజనం కోసం పనిచేయాలని కార్ అన్నారు. అవాస్తవాలతో వార్తలు ప్రసారం చేయడం సరికాదని పేర్కొన్నారు. మీడియా సంస్థలు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. లేకపోతే లైసెన్సులు కోల్పోతారని స్పష్టం చేశారు. ప్రభుత్వ నియంత్రణను బలంగా అమలు చేస్తామని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ హెచ్చరికలు మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
రక్షణ మంత్రి హెగ్సెత్ ఆగ్రహం
రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంపై సీఎన్ఎన్ కథనాలను ఆయన తప్పుబట్టారు. ఎంతో సేపూ ఆయన సీఎన్ఎన్ తీరుపైనే ఫిర్యాదు చేశారు. త్వరలో ఆ వార్తా నెట్ వర్క్ మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బిలియనీర్ డేవిడ్ ఎల్లిసన్ చేతికి ఆ సంస్థ వెళ్తుందని పేర్కొన్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ మౌనం
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురణకర్త డౌ జోన్స్ అండ్ కంపెనీ స్పందించలేదు. ప్రభుత్వ ఆరోపణలపై వారు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇతర మీడియా సంస్థల ప్రతినిధుల నుండి ఎటువంటి స్పందన రాలేదు. తమ కథనాలపై తాము నిలబడుతున్నారా లేదా అనేది స్పష్టత లేదు. ఇప్పటికే ఎప్‌స్టీన్ పేరుతో జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీస్తోంది. మీడియా స్వేచ్ఛపై ఈ దాడులు ఎటు దారితీస్తాయో చూడాలి.
యుద్ధం-మీడియా మధ్య పోరు
యుద్ధం నేపథ్యంలో మీడియా నియంత్రణ అనేది పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వాలు మీడియాను తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని చూస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన 5 విమానాల కథనం ఇప్పుడు కేంద్ర బిందువైంది. ప్రసార లైసెన్సుల రద్దు అస్త్రం మీడియాను భయపెడుతోంది. ఇది కేవలం యుద్ధ వార్తలకే పరిమితమా లేదా అన్నది వేచి చూడాలి. మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న ఈ దాడి భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో ఆసక్తికరంగా మారింది.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్