- మహాత్ముడు ఒక్కరే హీరో కాదంటున్న కేంద్రం
- ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పుస్తకంలో మార్పు
- విప్లవకారుల పోరాటానికే పట్టం కట్టిన పుస్తకం
- బాపూ ప్రభావం తక్కువ… పోరాటాలే ఎక్కువ
- బ్రిటన్ బలహీనపడటం వల్లే స్వరాజ్యం
- కాంగ్రెస్ అసమర్థత వల్లే దేశం ముక్కలు
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలో చరిత్ర ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. స్వాతంత్ర్య పోరాట ఘట్టాల చరిత్రను కేంద్ర ప్రభుత్వం మారుస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో జరిగిన మార్పులు దీనికి నిదర్శనం. 1947 దేశ విభజనకు కాంగ్రెస్ అంగీకారమే కారణమని కొత్త పాఠాలు చెబుతున్నాయి. ఇది కేవలం విద్యా సంస్కరణ కాదు… పక్కా రాజకీయ ఎజెండా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్‌కు విభజన ముద్ర
భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ పాత్ర ఎంత అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన అంచనా వేసే పనిలో పడింది. మొన్నటికి మొన్న గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పేరు మార్చిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పుడు దేశ విభజన… స్వాతంత్ర ఉద్యమం… వీటిలో మహాత్మాగాంధీ పాత్రపై కేంద్ర ప్రభుత్వం సంచలనమైన వైఖరి తీసుకుంది. ఆ మేరకు మంగళవారం 8వ తరగతి సాంఘికశాస్త్రం పాఠ్య పుస్తకాల్లో ఎన్‌సీఈఆర్‌టీ భారీ మార్పులు చేసింది. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని కొత్తగా చేర్చారు. విభజనను మొదట గాంధీజీ వ్యతిరేకించినా చివరకు ఆయన తలొగ్గారని వివరించారు. ఈ పుస్తకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్రపై కత్తెర…
స్వాతంత్ర్యం కేవలం గాంధీజీ అహింసా మార్గం వల్లనే రాలేదని కొత్త పాఠం నొక్కి చెబుతోంది. నావికా దళం, విమాన దళంలో జరిగిన తిరుగుబాట్లు కూడా కీలకమని వివరించారు. అంటే ఆనాటి పోరాటాల్లో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనేకమంది చేసిన పోరాటాలే స్వాతంత్రం సిద్ధించడానికి కారణమని చెప్పింది. అంటే విప్లవకారుల పోరాటాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు బ్రిటన్ బలహీనపడటం వల్లనే ఆ దేశం భారత్‌ను వదిలి వెళ్లిందని విశ్లేషించారు. ఈ విషయంలో దేశంలో అనేక మంది విప్లవకారులకు కూడా ఇటువంటి అభిప్రాయమే ఉందనే చర్చ జరుగుతుంది.
వందేమాతరం సరికొత్త విశ్లేషణ
జాతీయవాదాన్ని విద్యార్థుల్లో నూరిపోసేందుకు వందేమాతరం గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. బకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన ఈ గేయం వెనుక ఉన్న సాంస్కృతిక స్ఫూర్తిని వివరించారు. వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను ఇచ్చి వాటి అర్థాన్ని విద్యార్థులే గ్రహించాలని సూచించారు.
తిరగరాస్తున్న చరిత్ర
2020 జాతీయ విద్యా విధానం పేరుతో చరిత్రను తిరగరాస్తున్నారు. 1919 జలియన్ వాలా బాగ్, 1946 డైరెక్ట్ యాక్షన్ డే వంటి కీలక ఘట్టాలను కొత్త కోణంలో చేర్చారు. పాత పుస్తకాల్లో విభజన అనేది ఒక అనివార్యమైన బాధాకరమైన ప్రక్రియగా ఉండేది. కానీ ఇప్పుడు దానిని ఒక రాజకీయ వైఫల్యంగా చూపిస్తున్నారు.
ప్రతిపక్షాల పోరాటం…
ఈ మార్పులపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలను తమ రాజకీయ ప్రచార సాధనాలుగా వాడుకుంటోందని ధ్వజమెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠ్యపుస్తకాల్లో రాజకీయ విమర్శలు చోటు చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ స్వయం ప్రతిపత్తిని కోల్పోయిందని వారు విమర్శిస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తే దేశ అస్తిత్వానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
విద్యార్థులపై ప్రభావం
పాఠశాల స్థాయిలోనే రాజకీయ ఆలోచనలు పిల్లల బుర్రల్లోకి ఎక్కించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవాలను వదిలేసి కేవలం ఒక వర్గం వైఫల్యాలను ఎత్తిచూపడం వల్ల పక్షపాత ధోరణి పెరుగుతుందని చర్చ జరుగుతుంది.