దళిత టీచర్‌ వండితే తినరా? – కుల వివక్షపై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆగ్రహం

Justice Ujjal Bhuyan on caste descrimination
  • సమానత్వానికి తూట్లు పొడవడం దారుణం
  • జిల్లా కోర్టులే న్యాయవ్యవస్థకు పునాది
  • రాజ్యాంగ నైతికతపై న్యాయమూర్తుల సదస్సు

సహనం వందే, హైదరాబాద్:

దేశంలో నేటికీ కులం, మతం ప్రాతిపదికన వివక్ష కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులైన సమాజంలో ఇలాంటి ధోరణులు ఉండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. సమానత్వం, సౌభతృత్వం పునాదులపై నిర్మితమైన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు.

అంగన్‌వాడీ ఉదంతంపై మండిపాటు…
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీలో శనివారం ప్రత్యేక సదస్సు జరిగింది. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, జ్యుడిషియల్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ నైతికత – జిల్లా న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ… ఒక ఎస్సీ అంగన్‌వాడీ టీచర్‌ భోజనం వండితే తమ పిల్లలు తినరని కొందరు పేర్కొన్న ఉదంతాన్ని ఉటంకించారు. 21వ శతాబ్దంలోనూ ఇలాంటి వివక్ష ఉండటం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిరమిడ్‌లాంటి న్యాయవ్యవస్థ…
న్యాయవ్యవస్థను ఒక పిరమిడ్‌తో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పోల్చారు. అందులో కిందిస్థాయి కోర్టులే పునాది అని ఆయన వివరించారు. ఈ పునాది ఎంత బలంగా ఉంటే న్యాయవ్యవస్థ అంత పటిష్టంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా న్యాయమూర్తులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, రాజ్యాంగ స్ఫూర్తితో సామాన్యుడికి న్యాయం అందేలా చూడాలని ఆయన సూచించారు.

వెన్నెముక వంటి జిల్లా కోర్టులు
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ ‘ప్రజా విశ్వాసం – న్యాయం మధ్య అంతరాన్ని తగ్గించడం’ అనే అంశంపై ప్రసంగించారు. జ్యుడిషియరీ అంటే ట్రయల్‌ కోర్టులేనని… ఇవి మొత్తం వ్యవస్థకు వెన్నెముక వంటివని ఆయన స్పష్టం చేశారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థను తక్కువ భావనతో చూడకూడదని హితవు పలికారు. అంతకుముందు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, అకాడమీ అధ్యక్షురాలు జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య స్వాగతోపన్యాసం చేశారు.

ప్రముఖుల సమక్షంలో సదస్సు
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నవీన్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మురళీమోహన్‌, సంఘం అధ్యక్షులు జి.రాజగోపాల్‌ అతిథులను వేదికపైకి ఆహ్వానించి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. రిజిస్ట్రార్‌ జనరల్‌, అకాడమీ డైరెక్టర్‌ ఎస్‌.ఎన్‌.శ్రీదేవి, సీనియర్‌ ఫ్యాకల్టీ సభ్యులు డాక్టర్‌ సున్నం శ్రీనివాస రెడ్డి, రాధాకృష్ణ చాహవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యాయమూర్తుల భాగస్వామ్యం
న్యాయమూర్తుల సంఘం నేతలు లక్ష్మి శారద, మైత్రేయి, దుర్గాప్రసాద్‌, డాక్టర్‌ హెచ్‌.సంపత్‌, మంద వెంకటేశ్వరరావు ఈ సదస్సులో భాగమయ్యారు. రాష్ట్రంలోని న్యాయమూర్తులందరూ ప్రత్యక్షంగా, వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి కె.మురళీమోహన్‌, సభ్యురాలు పూజ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఘనంగా సన్మానం
సదస్సు అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. డాక్టర్‌ సున్నం శ్రీనివాస్‌ రెడ్డి వందన సమర్పణ చేయగా, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. టీజీఎల్‌ఎస్‌ఏ సభ్య కార్యదర్శి సీహెచ్‌ పంచాక్షరీ సహా పలువురు రిజిస్ట్రార్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *