- హిందూ ధర్మం ఇండియాకు ప్రాణమని వెల్లడి
- ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇక్కడి వారే
సహనం వందే, ముంబై:
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందూ అనేది ఒక మతం కాదు… అదొక సంస్కృతి అని ఆయన అభివర్ణించారు. దేశ పురోగతికి ఐక్యతే ప్రధానమని నొక్కి చెప్పారు. ముంబైలో జరిగిన సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేదికగా ఆయన దేశ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు.

జాతికి గుర్తింపు
భారత గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ హిందువేనని మోహన్ భగవత్ అన్నారు. హిందూ అనేది ఒక పేరు కాదు… అది ఒక సంస్కృతి అని వివరించారు. ఈ భూమిపై నివసించే వారిలో ఆ సంస్కృతి సహజంగానే ఉంటుందన్నారు. ఇక్కడ ఉన్న ముస్లింలు, క్రైస్తవులు కూడా ఈ దేశానికి చెందినవారేనని చెప్పారు. మనమంతా ఒకే సమాజం, ఒకే దేశమని ఆయన గుర్తు చేశారు.
నాలుగు రకాలు
సమాజంలో ఉన్న హిందువులను భగవత్ నాలుగు రకాలుగా విభజించారు. తాము హిందువులమని గర్వంగా చెప్పుకునే వారు మొదటి రకం. హిందువులమైతే ఏంటనే ఉదాసీనత చూపే వారు రెండో రకం. ఇంట్లోనే హిందువులుగా ఉంటూ బయట భయపడే వారు మూడో రకం. తమ మూలాలను పూర్తిగా మరిచిపోయిన వారు నాలుగో రకమని ఆయన విశ్లేషించారు. అందరినీ ఏకం చేయడమే సంఘ్ లక్ష్యమని తెలిపారు.
విభజన విషాదం
దేశ విభజనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ భావనను మరిచిపోవడం వల్లే దేశం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మతం ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టారని విమర్శించారు. మనం హిందువులం కాబట్టే అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పారు. దేశం ఐక్యంగా ఉండాలంటే హిందూ భావజాలం బలంగా ఉండాలని భగవత్ పిలుపునిచ్చారు.
భరోసా ఇచ్చే ధర్మం
హిందుత్వాన్ని అంగీకరించడం అంటే సొంత మతాన్ని వదులుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు. హిందుత్వం అనేది అందరి భద్రతకు ఒక గ్యారెంటీ లాంటిదని చెప్పారు. భాషలు, ఆచారాలు వేరైనా సంస్కృతి ఒక్కటేనని వివరించారు. దీనినే భారతీయుత అని కూడా పిలవవచ్చన్నారు. హిందూ ముస్లిం ఐక్యత అనే పదం వాడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అందరూ ఇప్పటికే ఒక్కటేనని పేర్కొన్నారు.
సంఘ్ ప్రస్థానం
ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవాలంటే నేరుగా వచ్చి కలవాలని ఆయన కోరారు. ప్రచారం లేదా ఆరోపణల ఆధారంగా సంఘ్ గురించి అంచనా వేయవద్దని సూచించారు. 100 ఏళ్ల ప్రయాణంలో సంఘ్ అనేక మార్పులకు లోనైందని చెప్పారు. వాస్తవాల ఆధారంగా ఎవరైనా విమర్శిస్తే వాటిని సరిదిద్దుకుంటామని ఆయన ప్రకటించారు. సత్యం తెలుసుకోవడానికి చర్చలు అవసరమని భగవత్ అభిప్రాయపడ్డారు.
యువతకు మార్గదర్శనం
కుటుంబాల్లో సంభాషణలు పెరగాలని భగవత్ సూచించారు. నేటి తరం యువత డ్రగ్స్, ఆత్మహత్యల బారిన పడకుండా చూడాలని కోరారు. పిల్లల్లో ఆత్మగౌరవం, స్వయం అవగాహన పెంపొందించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సుభాష్ ఘాయ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.