- సంపన్న భారత్‌కు ధనవంతులు దూరం
- నాణ్యమైన విద్య.. జీవనం కోసమే వలస
- ఇక్కడ కనీసం కాలుష్యం లేని గాలి ఎక్కడ?
- చిన్న వివాదాలకు కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు
- ఈ చికాకులకు దూరంగా విదేశాలకు పయనం
- ఇప్పటివరకు దేశాన్ని వీడిన 4,300 మంది
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలోని అత్యంత ధనవంతులు… బిలినియర్లు… పారిశ్రామికవేత్తలు కట్టకట్టుకుని ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు? ఈ ప్రశ్నకు ఆర్థిక సలహాదారు అక్షత్ శ్రీవాస్తవ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వీరు పన్నుల నుంచి తప్పించుకోవడానికో ఇంకేదో కాదు. తమ కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసమే విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశానికి ఇది నిజంగా సిగ్గుచేటు. వ్యవస్థలోని లోపాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశ ఆర్థిక భవిష్యత్తుకు వెన్నెముక వంటి సంపద దేశం వీడుతోంది. ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం ఇప్పటివరకు 4300 మంది మిలియనీర్లు దేశం విడిచిపోయినట్టు సమాచారం.
స్వచ్ఛమైన గాలి లేదంటున్న ధనవంతులు…
పారిశ్రామికవేత్తలు, ధనవంతులు దేశం వదిలి వెళ్లడానికి ప్రధాన కారణాలు ఏమిటి? స్వచ్ఛమైన గాలి, పటిష్టమైన భద్రత, ముఖ్యంగా పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం ఈ సంపన్న వర్గం విదేశాలకు వెళ్తున్నారని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. స్వచ్ఛమైన గాలి… భద్రత… పిల్లల విద్య… ఉద్యోగ అవకాశాలు భారత్‌లో కంటే విదేశాల్లో మెరుగ్గా ఉన్నాయని వారు నమ్ముతున్నారు. వేల కోట్ల పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉన్నవారు ఈ సమస్యల కారణంగా దేశాన్ని వీడుతుంటే ఇక్కడి పాలక వర్గాలు ఇప్పటికీ కళ్లు మూసుకుని కూర్చోవడం దారుణం. ఈ సంపన్న వర్గం దేశం వీడితే వారి పెట్టుబడులు, వ్యాపార సంస్థలు కూడా ఆ దేశాలకు వెళ్లిపోతాయి. ఇది దేశీయ వ్యాపార, వాణిజ్య రంగానికి మరణశాసనం రాసినట్టే.
దేశం న్యాయవ్యవస్థ పట్ల అసహనం…
ధనవంతులు దేశం వదిలి వెళ్లడానికి ఇక్కడి వ్యవస్థాగత లోపాలే ప్రధాన కారణం. పై సమస్యలతోపాటు న్యాయ వ్యవస్థలో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండే కేసులు ఒక కారణం. తమ వ్యాపార వివాదాల పరిష్కారం కోసం వ్యాపారవేత్తలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. విదేశాల్లో లభించే వేగవంతమైన, పారదర్శకమైన వ్యాపార సంస్కృతిని వారు మనదేశంలో కోరుకుంటున్నారు.
పన్నుల ఆదాయానికి భారీ గండి…
దేశంలో ప్రత్యక్ష పన్నులు చెల్లించేది కేవలం రెండు శాతం మంది మాత్రమే. ఈ రెండు శాతం నుంచి ఒక్క ధనవంతుడు దేశం వదిలి వెళ్లినా ఆ పన్ను భారం మిగిలిన సామాన్యుల మీద, మధ్యతరగతి ప్రజల మీద పడుతుంది. ధనవంతులు విదేశాలకు వెళ్లడం వల్ల ప్రభుత్వ పన్ను ఆదాయం తగ్గుతుంది. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు, పేదల సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెపోటు లాంటిది. పెట్టుబడిదారులు దేశ ఆర్థిక స్థిరత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంపదను, పెట్టుబడులను ఆకర్షించాల్సిన వ్యవస్థ… వాటిని దూరం చేసుకుంటున్న దుస్థితిలో ఉంది.