- మూడో వంతు చెల్లిస్తే కేసులన్నీ కొట్టేస్తాం
- సోదరులు నితిన్, చేతన్ లకు భారీ ఊరట
- విదేశాల్లో ఉన్న మోసకారులకు కోర్టు భరోసా
- సుప్రీం తీర్పుపై రాయిటర్ వార్తా సంస్థ విశ్లేషణ
- బ్యాంకులను ముంచిన నితిన్, చేతన్ బ్రదర్స్
సహనం వందే, న్యూఢిల్లీ:
బ్యాంకులను ముంచిన బిలియనీర్ సోదరులు నితిన్, చేతన్ సందేసరాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతుంది. దాదాపు రూ. 13 వేల కోట్ల బ్యాంకు మోసం కేసులో దేశం విడిచి పారిపోయిన నితిన్, చేతన్ ల పై సుప్రీంకోర్టు వేసిన బ్రేక్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. వేల కోట్లు కొల్లగొట్టిన వారికి అత్యున్నత న్యాయస్థానం ఊరటనిస్తూ మొత్తం అప్పులో మూడో వంతు చెల్లిస్తే క్రిమినల్ కేసులన్నీ రద్దు చేస్తామంటూ ఆదేశాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే సంచలనం అని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసుపై బ్యాంకులు ఇచ్చిన రాజీమార్గం ఆధారంగానే ఈ తీర్పు వెలువడిందని అంటున్నారు. బ్యాంకుల వ్యవహార శైలిపై దేశమంతా అట్టుడికిపోతుంది.
వేల కోట్లు రుణాలు కొల్లగొట్టి విదేశాలకు ఎస్కేప్…
స్టర్లింగ్ బయోటెక్ కంపెనీ ప్రమోటర్లైన బ్రదర్స్ నితిన్, చేతన్ సందేసరాలు 13 ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రూ.13,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని ఆ సొమ్మును తీసుకుని దేశం విడిచి పారిపోయారు. ఆంధ్ర బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు వంటి ప్రభుత్వ బ్యాంకులే వీరి చేతిలో భారీగా నష్టపోయాయి. డబ్బు తిరిగి రాకపోగా కంపెనీ ఆస్తులు కూడా మాయమయ్యాయి. ఈ మహా మోసంపై ఈడీ, సీబీఐ రెండు సంస్థలూ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే 2017 నుంచి నితిన్, చేతన్లు నైజీరియాలో దర్జాగా దాక్కున్నారు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా వారిని పట్టుకోలేకపోవడం అత్యంత దారుణం.

మూడో వంతు కడితే కేసులు ఖతం!
ఈ నేపథ్యంలో బ్యాంకులు ఆ బిలినియర్లకు ఒక బిగ్ ఆఫర్ ప్రకటించాయి. రాజీమార్గం చూపించాయి. ఆ ప్రకారం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాయి. అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. మొత్తం రుణంలో 33 శాతం డబ్బును బ్యాంకులకు తిరిగి చెల్లిస్తే వారిపై ఉన్న క్రిమినల్ కేసులన్నీ రద్దు చేస్తామని కోర్టు ప్రకటించింది. అంటే దాదాపు రూ. 5,100 కోట్లు చెల్లిస్తే మిగిలిన డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ఈ తీర్పు సారాంశంగా చెబుతున్నారు. పైగా వారిపై ఉన్న దీనికి సంబంధించిన క్రిమినల్ కేసులన్నీ కొట్టివేస్తామని కోర్టు స్పష్టం చేసినట్లు రాయిటర్ సంస్థ తెలిపింది. అంటే ఇంత పెద్ద నేరం నుంచి వారికి విముక్తి లభిస్తుంది. ఈ ఒప్పందం అమలైతే సందేసరాలు రాజాలా దేశానికి తిరిగి వచ్చి చట్టం నుంచి తప్పించుకుంటారు!
కొత్త మోసాలకు పచ్చజెండా!
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశంలోని ఇతర బడా రుణ ఎగవేతదారులకు పచ్చజెండాగా మారింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వంటి వారు కూడా ఇలాంటి ఒప్పందాల కోసం ప్రయత్నిస్తారా అన్న ప్రశ్న ఇప్పుడు దేశాన్ని వెంటాడుతోంది. సామాన్యుడు పదివేల రూపాయల రుణ మాఫీ కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతూ అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వేల కోట్ల మోసం చేసిన బిలియనీర్లకు ఇలాంటి సౌకర్యం లభించడంపై చర్చ జరుగుతుంది.
దేశవ్యాప్తంగా కలకలం…
ఈ తీర్పు రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. బడా వ్యాపారులకు బ్యాంకులు రాజీమార్గం వెతికి కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకులు భారీ నష్టాల్లో కూరుకుపోతున్నా వారి నష్టాన్ని తగ్గించుకోవడానికి మూడో వంతు చెల్లింపు ఒప్పందానికి అంగీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా నేరస్థులు శిక్ష నుంచి తప్పించుకుంటారన్న చర్చ జరుగుతుంది. ఇలాంటి ఒప్పందాలు భవిష్యత్తులో బ్యాంకు మోసాలను ప్రోత్సహిస్తే దేశ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని ఆర్థిక నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సందేసరా సోదరులు డబ్బు చెల్లించి కేసుల నుంచి తప్పించుకుంటే దేశ న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసం సన్నగిల్లడం ఖాయమన్నది నిష్టుర సత్యం!