డాక్టర్ ప్లాన్… నోట్ల స్కామ్ – ప్రభుత్వ వైద్యుడి సిగ్గుమాలిన నిర్వాకం

Doctor Arrested for Fake Currency Printing
  • ప్లాట్ అద్దెకు తీసుకొని నకిలీ కరెన్సీ ప్రింటింగ్
  • మధ్యప్రదేశ్ నేరస్తులతో చేతులు కలిపి దందా
  • ఇప్పటికే లక్షలు ప్రింట్ చేసిన ప్రభుత్వ డాక్టర్
  • పలు రాష్ట్రాలకు రహస్యంగా సరఫరా
  • ఎట్టకేలకు పట్టుకున్న భోపాల్ పోలీసులు

సహనం వందే, మధ్యప్రదేశ్:
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్ ఏకంగా నకిలీ నోట్ల రాకెట్‌కు హెడ్‌గా మారిపోయాడు! మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ కుంభకోణం వెనుక అసలు కుట్ర ఖండ్వా జైలు గోడల మధ్యే జరిగింది. ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేసిన ప్రతీక్ నవ్లాఖే అనే ఘనాపాఠీ కోట్లాది రూపాయల మోసంలో జైలుకు వెళ్లాడు. అక్కడే అతనికి పాత నేరగాళ్లతో స్నేహం కుదిరింది. జైలు నుంచి బయటకు రాగానే వీరంతా కలిసి మళ్లీ అక్రమ దందా మొదలుపెట్టారు. ఈ నేరగాళ్లంతా ఒక్కటయ్యేందుకు జైలు ట్రైనింగ్ సెంటర్‌గా ఉపయోగపడింది.

డాక్టర్ నకిలీ నోట్ల రాకెట్‌

ఫ్లాట్ అద్దెకి తీసుకొని కరెన్సీ ప్రింటింగ్…
ఒక డాక్టర్… అందునా ప్రభుత్వ ఉద్యోగి… 40 లక్షలు విలువ చేసే నకిలీ కరెన్సీని ముద్రించాడంటే వ్యవస్థ పరువు ఎక్కడికి పోవాలి? నకిలీ నోట్లను ముద్రించి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చెలామణి చేశాడు. భోపాల్‌లోని గోకుల్‌ధామ్ సొసైటీలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని దాన్ని పూర్తిస్థాయి నకిలీ నోట్ల ఫ్యాక్టరీగా మార్చేశాడు. అక్కడ ప్రింటర్లు, కట్టర్లు పెట్టి రూ. 500 నోట్లను ముద్రించారు. వీరి నకిలీ నోట్ల నాణ్యత చూస్తే సామాన్యులు కాదు కదా వ్యాపారులు కూడా గుర్తించలేనంత పక్కాగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కళ్లకూ కనిపించకుండా ట్రావెల్ ఏజెన్సీ ముసుగులో ఈ దందా నడిపించారు.

ఈ డబ్బుతో మనీ లాండరింగ్ దందా!
ఈ గ్యాంగ్‌ నకిలీ నోట్ల తయారీతో ఆగకుండా వాటిని ఉపయోగించి ఆస్తులు కొనడం, మనీ లాండరింగ్ వంటివి కూడా చేశారు. మౌలానా జుబైర్ అన్సారీ అనే ప్రధాన నేరగాడు ఈ నకిలీ డబ్బును నాగ్‌పూర్, మాలెగావ్ లాంటి ప్రాంతాల్లో పంపిణీ చేశాడు. ఒక రాష్ట్రంలో దొరికినా మరో రాష్ట్రంలో దందా కొనసాగింది.

చివరికి పోలీసుల చేతికి చిక్కి…
నవంబర్ 2న పోలీసులు మౌలానా అన్సారీని అరెస్ట్ చేసి కొంత నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కానీ అసలు కింగ్‌పిన్‌ అయిన డాక్టర్ ప్రతీక్ మాత్రం చార్ ధామ్ యాత్రకు వెళ్లినట్టు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. హై-రిస్క్ క్రిమినల్ అయిన అతన్ని ట్రాక్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చివరికి ఆదివారం భోపాల్ ఆ ముగ్గురిని అరెస్ట్ చేసినా ఆ లోపు ఎంత నకిలీ డబ్బు మార్కెట్లోకి వెళ్లిందో ఎవరికీ తెలియదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *