- బీహార్ రాజకీయాల్లో రోహిణిని గెంటిశారు
- ఒకప్పుడు సోనియా ప్రధాని కాకుండా అడ్డు
- జయలలిత సీఎం కాకుండా భారీ కుట్రలు
- షర్మిల… కవిత… కనిమొళి అందరిపై కుట్రలు
- ఆడపడుచు తమకు పోటీకి వస్తారన్న భయం
- జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో పురుషాధిక్యత
- దేశంలో రాబోయేది ఆడబిడ్డల సునామీ…
సహనం వందే, హైదరాబాద్:
రాజకీయ చదరంగంలో ఎప్పుడూ బలిపశువులు అయ్యేది ఆడబిడ్డ అనే చేదు నిజం మరోసారి బయటపడింది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రాన్ని కుదిపేయడమే కాదు అక్కడి అతిపెద్ద రాజకీయ కుటుంబమైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో కూడా చిచ్చు రేపాయి. రాష్ట్రీయ జనతా దళ్ ఘోర పరాజయం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తే… ఆ ఓటమికి కారణం ఎవరని ప్రశ్నించిన లాలూ కూతురు రోహిణి ఆచార్య ఏకంగా ఇల్లు విడిచి బయటకు రావాల్సి వచ్చింది. ఇంట్లో తండ్రి ఉన్నాడు… అన్నలు ఉన్నారు… బాబాయిలు ఉన్నారు… కానీ పార్టీ ఓడిపోతే మాత్రం ఆ నిందలన్నీ ఆడపిల్లల మీదకే నెట్టేసే సంస్కృతి అక్కడ రాజ్యమేలుతోంది. ఇది కేవలం ఒక్క రోహిణి ఆవేదన కాదు దేశంలోని రాజకీయ సామ్రాజ్యాలను ఏలుతున్న చాలా కుటుంబాల్లోని ఆడబిడ్డల ఘోష. అధికారం అనుభవించడానికి మగ వారసులు కావాలి… కానీ కష్టాలు వచ్చినప్పుడు నిందలు మోయడానికి మాత్రం ఆడకూతుళ్లు కావాలన్నట్టుగా తయారైంది పరిస్థితి.

మహిళ ప్రశ్నిస్తే మునిగే ప్రమాదం
రాజకీయ వారసత్వం అంటే అది కేవలం మగవాళ్లకే సొంతం అన్నట్టుగా వ్యవహరించడం దేశంలోని రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. కొడుకులు ఎన్ని తప్పులు చేసినా… ఎన్నిసార్లు ఓడిపోయినా వాళ్లకు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తారు. వాళ్ల తప్పులను కప్పిపుచ్చి సమర్థిస్తారు. అదే సమయంలో కుటుంబంలోని ఆడపిల్లలు ఒక్క మాట మాట్లాడినా లేదా చిన్న తప్పు చేసినా వెంటనే వారిని తిరుగుబాటుదారులుగా ముద్ర వేసి అణచివేస్తారు. ఇప్పుడు రోహిణి ఆచార్య విషయంలో జరిగింది అదే. షర్మిల, కవితల పరిస్థితి కూడా అలాంటిదే. రాజకీయ కుటుంబాలలో ఆడపిల్లలు ఎంతటి మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అదే కథ
ఇది కేవలం బీహారుకు పరిమితమైన సమస్య కాదు. దేశంలోని అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనూ సోనియా గాంధీ తన ఉనికి కోసం ఎంతటి పోరాటం చేయాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. ఆమె ప్రధాని పదవి చేపట్టాల్సిన పరిస్థితి వస్తే విదేశీ ముద్ర వేసి అడ్డుకున్నారు. తమిళనాడులో కరుణానిధి కుమార్తె కనిమొళి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. స్టాలిన్ నీడలోనే ఆమె ఉండాల్సి వస్తోంది. అలాగే దివంగత జయలలిత ఎంతటి దారుణ పరిస్థితి ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. ఆమెను సొంత పార్టీ వాళ్లు... అప్పటి ప్రతిపక్షం డీఎంకే కూడా అవమానపరిచింది.
తెలుగు నేలపైనా చెల్లెలి కన్నీరు
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వైఎస్ షర్మిల ఉదంతం కళ్ల ముందే ఉంది. అన్న జగన్ మోహన్ రెడ్డి కోసం పాదయాత్రలు చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని భుజాన వేసుకుని నడిపించారు. కానీ తీరా అన్న అధికారంలోకి వచ్చాక చెల్లికి దక్కింది ఏమిటి? ఆమెను పూర్తిగా దూరంపెట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కవితను కూడా పార్టీ నుంచి గెంటేశారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి ఊరువాడ బతుకమ్మ ఆటలతో ఆడపడుచులను ఏకం చేశారు. కానీ వారసత్వం దగ్గరికి వచ్చేసరికి ఆమెను సొంత పార్టీ వాళ్లే విమర్శించే పరిస్థితి ఏర్పడింది. షర్మిల, కవితలకు వారసులుగా రావడానికి అర్హత లేదా? అక్కడ రోహిణి ఆచార్య అయినా ఇక్కడ షర్మిల, కవిత అయినా కథ ఒక్కటే. కుటుంబంలో ఆడపిల్లలు రాజకీయాల్లోకి వస్తే వాళ్లను మొదట అవసరానికి వాడుకుంటారు. ఆ తర్వాత వాళ్లు ఎక్కడ తమకు పోటీ అవుతారో అన్న భయంతో పక్కన పెట్టేస్తారు. సీటు ఇచ్చేటప్పుడు నాన్చుతారు గెలిచాక పక్కకు నెట్టేస్తారు.
రాబోయేది ఆడబిడ్డల సునామీ
కుటుంబ రాజకీయాల్లో ఇన్నాళ్లుగా సాగుతున్న మగ పెత్తనానికి ఇక కాలం చెల్లినట్టే కనిపిస్తోంది. రోహిణి ఆచార్య రూపంలో ఇప్పుడు నిప్పు రవ్వ రాజుకుంది. ఇది ఇంతటితో ఆగుతుందని అనుకుంటే పొరపాటే. రేపు కవిత, షర్మిల మరో రూపంలో రావచ్చు… మహారాష్ట్రలో సుప్రియా సూలే గొంతు ఎత్తవచ్చు… తమిళనాడులో కనిమొళి తిరగబడవచ్చు. తమకు దక్కాల్సిన హక్కుల కోసం వాటా కోసం ఆడబిడ్డలు రోడ్డెక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. రాజకీయ వారసత్వం అనేది కేవలం మగవాడి జేబులో ఉండే కర్చీఫ్ కాదని అది తమ హక్కు అని చాటిచెప్పడానికి సిద్ధమవుతున్నారు. బీహార్ లో రోహిణి చేసిన ఈ తిరుగుబాటు ఒక హెచ్చరిక మాత్రమే. రాబోయే రోజుల్లో రాజకీయ కుటుంబాల్లోని పితృస్వామ్యపు గుండెలు గడగడలాడేలా ఇంకా పెద్ద విస్ఫోటనం జరగబోతోంది