- గతవారం సమర్పణ… పాత పద్ధతిలోనే వాటా
- అలాగైతే దక్షిణాది రాష్ట్రాలకు లక్ష కోట్లు నష్టం
- వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం
- 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్లు అమలు
- ఇలాగైతే దక్షిణాది అడుక్కోవాల్సిందే…!
సహనం వందే, హైదరాబాద్:
16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు అరవింద్ పనగరియా తన నివేదికను గతవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాల పంపిణీని ఈ నివేదిక నిర్ణయించనుంది. కీలకమైన ఈ నివేదికను ఇంకా బహిర్గతం చేయకుండా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీనిపై అప్పుడే తీవ్ర ఆందోళన మొదలైంది. కేంద్ర నిధుల పంపిణీ పాత పద్ధతిలోనే ఉంటే తమకు రావాల్సిన వాటా తగ్గుతుందని, ఇది అన్యాయమని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా గొంతెత్తుతున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల గొంతులో పచ్చి వెలక్కాయ
16వ ఆర్థిక సంఘం నివేదిక సమర్పణతో మరోసారి దక్షిణాది రాష్ట్రాల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ, జీఎస్టీలో దాదాపు 40 శాతం పన్నులు కడుతున్న కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తిరిగి వస్తున్న వాటా కేవలం 28 శాతం మాత్రమే. ఇది కేవలం లెక్కల తారుమారు కాదు. దక్షిణాది ప్రజల కష్టాన్ని ఉత్తరాది రాష్ట్రాలు దోచుకుంటున్నాయన్నది బహిరంగ సత్యం. గత 15వ ఆర్థిక సంఘం సిఫారసులతోనే మన వాటా తగ్గితే ఇప్పుడు 16వ కమిషన్ పేరుతో మళ్లీ అదే కుట్రకు తెరలేస్తే కర్ణాటకకు ఏటా 40 వేల కోట్లు, తమిళనాడుకు 30 వేల కోట్లు, ఆంధ్రాకు 20 వేల కోట్ల నష్టం తప్పదు. ఈ అన్యాయాన్ని ఇంకెంత కాలం సహించాలి?
ఉచితాల ఖర్చుకు మనమెందుకు బాధ్యులం?
ఉత్తరాదిలోని పేద రాష్ట్రాలు ఎక్కువ ఖర్చు చేస్తూ అప్పులు పెంచుకుంటున్నాయని కేంద్రం చెబుతోంది. కానీ ఆ ఖర్చు ఎక్కడికి పోతోంది? ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, ఉచిత ఇల్లు, ఉచిత డబ్బు వంటి సంస్కృతిని పెంచడానికే కదా! బడ్జెట్ క్రమశిక్షణ పాటిస్తూ పన్నులు సక్రమంగా చెల్లిస్తున్న దక్షిణ రాష్ట్రాలను ఎందుకు శిక్షించాలి? ఇది బాధ్యతాయుత రాజకీయాలను పూర్తిగా దెబ్బతీయడమే. ఒక రాష్ట్రం ఆచితూచి ఖర్చు చేస్తుంటే మరో రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు ఉచితాలు పంచుతూ పోతే ఆ భారాన్ని దక్షిణ రాష్ట్రాలు మోయాలా? మొన్న బీహార్ ఎన్నికలకు ముందు ఒక్కో మహిళకు పదివేల రూపాయలు ఇచ్చారు. ఇది ఎవరు సొమ్ము?
దక్షిణాది తిరుగుబాటు…
దక్షిణ రాష్ట్రాల నుంచి అధిక పన్నులు వసూలు చేసి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్ర ఇప్పుడు బహిరంగ రహస్యం. ఇకపై దక్షిణాది మౌనంగా ఉండబోదు. 16వ ఆర్థిక కమిషన్ నివేదిక దక్షిణ రాష్ట్రాలకు న్యాయం చేయకపోతే రాజకీయంగా, చట్టబద్ధంగా బృహత్తర పోరాటం తప్పదని మన రాష్ట్రాల నాయకులు ఇప్పటికే యుద్ధభేరి మోగించారు. దేశ ఐక్యత పేరు చెప్పి దక్షిణాదిని ఆర్థికంగా దోచుకుంటే ముప్పు తప్పదని ఢిల్లీ పెద్దలకు గట్టి హెచ్చరికలు పంపిస్తున్నారు.