డార్క్ వెబ్‌తో డ్రగ్స్ దందా

   తెలుగు రాష్ట్రాల్లో యువతను ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల మహమ్మారి
– హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, ఖమ్మంలలో విక్రయాలు
– క్రిప్టో కరెన్సీతో మాదకద్రవ్యాల లావాదేవీలు… డిజిటల్ పద్ధతిలో దందా
– డ్రగ్స్ కేసుల్లో సినిమా తారలున్నట్లు నిర్ధారణ… అయినా శిక్ష పడలేదు
– ప్రముఖులు తప్పించుకుంటే సామాన్యులు బలవుతున్నారన్న విమర్శలు

సహనం వందే, హైదరాబాద్/విజయవాడ/విశాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో డార్క్ వెబ్, బిట్‌కాయిన్‌లతో మాదకద్రవ్యాల వ్యాపారం యువతను కబళించే విషసర్పంలా విస్తరిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాలు ఈ డ్రగ్స్ బారిన పడ్డాయి. 2017లో హైదరాబాద్‌లో సినిమా తారలు, ప్రముఖులు డ్రగ్స్ కేసుల్లో చిక్కినా, వారికి శిక్ష పడకపోవడం ఈ దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఒకవైపు “డ్రగ్స్ వద్దు” అని గొంతు చించుకుంటూ, మరోవైపు దొరికిన వారిని వదిలేస్తుండటంతో మాదకద్రవ్యాల వ్యాపారులు ఇష్టారాజ్యాంగా సరఫరా చేస్తున్నారు. ఈ విషం వలయం యువతను నాశనం చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.

క్రిప్టో కరెన్సీ ద్వారా డ్రగ్స్ వ్యాపారం…
డార్క్ వెబ్ ద్వారా ఈ పట్టణాల్లో డ్రగ్స్ ఆర్డర్‌లు రాకెట్ వేగంతో జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో రూ.45 కోట్ల క్రిప్టో లావాదేవీలు బట్టబయలయ్యాయి. వాట్సాప్, టెలిగ్రామ్‌తో ఈ విషం ఇళ్లకు చేరుతోంది. బిట్‌కాయిన్, మోనెరోతో హైదరాబాద్, విశాఖలో డ్రగ్స్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ కరెన్సీలను ట్రాక్ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి హెరాయిన్, జర్మనీ నుంచి ఎల్‌ఎస్‌డీ, విజయవాడలో స్థానిక గంజాయి సరఫరా అవుతుంది.

డ్రగ్స్ విక్రయం జరిగే నగరాలు, పట్టణాలు
– హైదరాబాద్: 2024లో 1,118 కేసులు, 1,991 అరెస్టులు జరిగాయి. పబ్‌లు, హోటళ్లలో గంజాయి, కొకైన్ విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి.
– విజయవాడ: స్ట్రీట్ చిల్డ్రన్, విద్యార్థులను గంజాయి ముంచెత్తుతోంది.
– విశాఖపట్నం: 2024లో 25,000 కేజీల డ్రగ్స్ స్వాధీనం—పోర్టు ద్వారా దేశాన్ని నాశనం చేస్తోంది.
– వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ లు కూడా తెలంగాణలో డ్రగ్స్ దందా కేంద్రాలు.
– కృష్ణా, గోదావరి జిల్లాలు: గంజాయి సాగు, స్మగ్లింగ్‌తో యువత జీవితాలు చిదిమేస్తున్నాయి.

డ్రగ్స్ దాడుల్లో సినిమా తారలు…
2017లో హైదరాబాద్‌లో సిట్ కాల్విన్ మాస్కరెన్హాస్ ఫోన్ డేటాతో టాలీవుడ్ తారలను పట్టుకుంది.
– పూరి జగన్నాథ్: 10 గంటలు విచారించింది.
– రవి తేజ: డ్రైవర్ డ్రగ్స్ సేకరణలో ఉన్నట్లు ఆరోపణలు.
– చార్మీ కౌర్: మహిళా అధికారులతో విచారణ చేశారు.
– ముమైత్ ఖాన్: బిగ్ బాస్ నుంచి వచ్చి విచారణకు హాజరైంది.

తారలకు శిక్ష పడకపోవడంతో…
2017లో 12 పెడ్లర్లను పట్టుకుని 4 చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. కానీ, సినిమా తారలు, ప్రముఖులు ఆధారాల లేకపోవడం, రాజకీయ ఒత్తిడితో తప్పించుకున్నారు. రఫెల్ అలెక్స్ విక్టర్ వంటి చిన్నవారే మాత్రమే శిక్ష అనుభవించారు. ఈ నిర్లక్ష్యం డ్రగ్స్ దందాను రెచ్చగొట్టింది—యువతలో “పెద్దలకే శిక్ష లేదు, మనం ఎందుకు భయపడాలి?” అనే ధైర్యం పెరిగి, వ్యసనం ఆకాశాన్నంటింది.

డ్రగ్స్ వాడొద్దని గొంతెత్తి చెబుతూనే...
“డ్రగ్స్ వద్దు” అని గొంతెత్తి చెబుతూనే, దొరికిన వారిని వదిలేస్తున్న వైఖరి ప్రభుత్వ వ్యవస్థను హాస్యాస్పదం చేస్తోంది. యువతలో భయం తగ్గి, డ్రగ్స్ వాడకం సాధారణమై, సమాజం విషకలశంలా మారుతోంది. ప్రముఖులు తప్పించుకుంటే, సామాన్య యువత బలైపోతోంది.

చర్యలు తీసుకుంటేనే చెక్…
వైద్య డిటాక్స్, థెరపీ, కౌన్సెలింగ్ ఉన్నా, చర్యలు లేకపోతే ఈ విష వలయం ఆగదు. కఠిన చట్టాలు, సమాన న్యాయం లేకపోతే డ్రగ్స్ దందాలో యువత బలికాక తప్పదు.

10 ప్రమాదకర మాదకద్రవ్యాలు…
1. గంజాయి: తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వాడే ఈ డ్రగ్‌ మెదడును నాశనం చేస్తుంది. మానసిక రుగ్మతలు, ఊపిరితిత్తుల వ్యాధులు, జ్ఞాపకశక్తి నశించడం జరుగుతుంది. ఇదొక వ్యసనంగా మారి యువతను కబలిస్తుంది.
2. ఫెంటానిల్: మార్ఫిన్ కంటే 100 రెట్లు శక్తివంతమైన ఈ ఓపియాయిడ్ శ్వాసను ఆపేసి, క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది. వేగంగా వ్యసనం చేసే ఈ విషం యువతను చంపే ఆయుధం. విచిత్రం ఏంటంటే ఈ డ్రగ్ కు అవసరమైన ముడి పదార్థం హైదరాబాదులోని వసుధ ఫార్మా కంపెనీ నుంచే తయారు కావడం విస్మయం కలిగిస్తుంది. ఇటీవలే దీనికి సంబంధించిన సీఈఓ, డైరెక్టర్లను అమెరికాలో అరెస్టు చేశారు.
3. హెరాయిన్: ఓపియం నుంచి వచ్చే ఈ డ్రగ్ శ్వాస ఆగిపోవడం, హెపటైటిస్, కాలేయ-కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి యువత జీవితాలను నాశనం చేస్తోంది. దీని ముడిపదార్థాలు కూడా హైదరాబాద్ నుంచి మెక్సికో వంటి దేశాలకు గతంలో సరఫరా చేసినట్టు నిర్థారణ అయింది.
4. కొకైన్: డోపామైన్ స్థాయిలను పెంచే ఈ డ్రగ్ గుండెపోటు, స్ట్రోక్, శ్వాసకోశ సమస్యలు, మానసిక రుగ్మతలతో యువతను చీడలా కుళ్లబొడుస్తోంది. దీని ముడి పదార్థాల తయారీ కూడా హైదరాబాదుతో ముడిపడి ఉంది.
5. మెథాంఫెటమైన్ (క్రిస్టల్ మెథ్): స్ఫటిక రూపంలో వాడే ఈ ఉత్తేజక డ్రగ్ మెదడును ధ్వంసం చేస్తూ, దంత సమస్యలు, గుండె జబ్బులు, హింసతో యువతను నరకంలోకి నెట్టుతోంది.
6. జానాక్స్ (ఆల్ప్రజోలం):
ఆందోళనకు వాడే ఈ మందు వ్యసనం, శ్వాస సమస్యలతో యువతను చిత్రహింసలకు గురిచేస్తోంది.
7. ఆక్సికోడోన్: నొప్పి నివారిణిగా వాడే ఈ ఓపియాయిడ్ వ్యసనం, శ్వాస సమస్యలు, అవయవ ఫెయిల్యూర్ తో బలితీసుకుంటోంది.
8. కెటమిన్: అనస్థీషియాగా వాడే ఈ డ్రగ్ అధిక రక్తపోటు, గుండె సమస్యలతో యువతను చీకటిలోకి లాగుతోంది.
9. మార్ఫిన్: ఓపియం నుంచి వచ్చే ఈ డ్రగ్ వ్యసనం, శ్వాస ఆగిపోవడం, అవయవ ఫెయిల్యూర్ తో యువతను సమాధి చేస్తోంది.
10. డయాజపామ్ (వాలియం): ఆందోళనకు వాడే ఈ మందు వ్యసనం, శ్వాస సమస్యలు, మానసిక రుగ్మతలతో యువతను విషబీజంలా కుళ్లబొడుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *