గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో మహిళల హవా

– టాపర్లుగా ఇద్దరు మహిళా అభ్యర్థులు

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. మల్టీ జోన్-1, మల్టీ జోన్-2ల్లో టాపర్లుగా మహిళలే నిలవడం విశేషం. మల్టీజోన్-2లో 550 మార్కులతో ఒక మహిళా అభ్యర్థి టాపర్‌గా నిలవగా, మల్టీజోన్-1 లో 532.5 మార్కులతో మరొక మహిళా అభ్యర్థి అగ్రస్థానంలో నిలిచారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆదివారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్) ను విడుదల చేసింది.
పరీక్ష వివరాలు, ఫలితాల వెల్లడి…
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేయగా, 4,03,465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, జులై 7న ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షలకు 31,383 మందిని ఎంపిక చేయగా, అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 21,093 మంది అభ్యర్థులు ఏడు పేపర్లకు హాజరయ్యారు. ఏప్రిల్ 10న ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేయగా, మార్కుల రీకౌంటింగ్ కోసం 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, తదుపరి ప్రక్రియ…
జనరల్ ఇంగ్లీష్ లో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మెమోలు ఏప్రిల్ 5 వరకు అందుబాటులో ఉంటాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ఏప్రిల్ 28 వరకు వెబ్ సైట్ లో ఉంచుతారు.
త్వరలో 1:2 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేసి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తామని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలు, అనెక్జర్-6 లో పేర్కొన్న డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
టాప్-25 అభ్యర్థుల వివరాలు…
మల్టీజోన్-2లో 550 మార్కులతో 240946218 హాల్ టికెట్ నంబర్ కలిగిన మహిళా అభ్యర్థి మొదటి స్థానంలో నిలిచారు. మల్టీజోన్-1లో 532.5 మార్కులతో 240911068 హాల్ టికెట్ నంబర్ కలిగిన మహిళా అభ్యర్థి నాల్గవ స్థానంలో నిలిచారు. టాప్-25 లో అధిక శాతం మంది మహిళలు ఉన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *