సంతోషానికి సంకెళ్లు

  కులం, మతం, అవినీతి, ఆర్థిక అసమానతలే అడ్డంకులు
– ఒక శాతం ధనవంతుల చేతుల్లో 58 శాతం సంపద
– సంతోష కొలమానాలను చేరుకోలేకపోతున్న భారతదేశం
– ప్రపంచ సంతోష సూచికలో 118వ దేశంగా భారత్
– పాకిస్తాన్, నేపాల్ దేశాల కంటే మనమే మరింత వెనుకబాటు

సహనం వందే, హైదరాబాద్:
భారతదేశంలో సంతోషం కరువైంది. హాయిగా బతకడానికి అనుకూలమైన వాతావరణం లేకుండా పోతుంది. కుల, మతాల కల్లోలాలు, సామాజిక-ఆర్థిక అసమానతలు భారతదేశాన్ని సంతోష సూచికలో అగాధంలోకి నెట్టాయి. 2025 ప్రపంచ సంతోష నివేదికలో ఫిన్లాండ్ ఎనిమిదోసారి అగ్రస్థానంలో ఉండగా, భారత్ 118వ స్థానంతో అవమానకరంగా వెనుకబడింది. పాకిస్తాన్ (109), నేపాల్ (92) వంటి పొరుగు దేశాలు కూడా మనల్ని మించిపోయాయి. గత ఏడాది మన దేశం 126 స్థానం నుంచి కొంత మెరుగైనా, ఈ స్థితి సిగ్గుచేటు! ఆరు కొలమానాల ఆధారంగా రూపొందిన ఈ సూచికలో భారత్ ఎందుకు దారుణంగా విఫలమైంది? ఫిన్లాండ్ ఎలా ముందుంది? ఈ దుస్థితికి కారణాలను విశ్లేషిద్దాం.

సంతోషంలో భారత్ ఎక్కడ తప్పింది?
సంతోష సూచికను వ్యక్తి తలసరి ఆదాయం, సామాజిక పరిస్థితులు, ఆరోగ్యకర జీవనశైలి… ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లేని వాతావరణం ఆధారంగా లెక్కిస్తారు. 2022-2024 మధ్య గాలప్ వరల్డ్ పోల్ సర్వేలతో స్కోరు నిర్ణయిస్తారు. ఈ కొలతల్లో భారత్ పూర్తిగా చతికిలపడింది. ఎందుకీ దుర్గతి? భారత్ స్కోరు 4.389తో 118వ స్థానంలో నిలవడం అవమానకరం! కుల వ్యవస్థ షెడ్యూల్డ్ కులాలు, తెగలను అవకాశాల నుంచి దూరం చేస్తోంది. మతపరమైన ఘర్షణలు, మహిళలపై గృహహింస సామాజిక విషవాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి జరుగుతున్నా అసమానతలు పట్టిపీడిస్తున్నాయి. ఒక శాతం ధనవంతుల చేతుల్లో 58% సంపద పోగు పడింది. కాగా అరవై శాతం మంది కనీస వేతనాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

ఆరోగ్య సేవల్లో వెనుకబాటు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, మానసిక ఆరోగ్య సేవలు పట్టణాలకే పరిమితం. ఆధునికీకరణతో కుటుంబ బంధాలు కుప్పకూలాయి. అవినీతి వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం సన్నగిల్లింది. స్వేచ్ఛను సామాజిక ఆంక్షలు హరిస్తున్నాయి. వాయు కాలుష్యం లాంటి పర్యావరణ సమస్య జీవన ఒత్తిడిని రెట్టింపు చేస్తున్నాయి. ఇదీ భారత్ అధోగతి కథ!

ఫిన్లాండ్ విజయం వెనుక…
ఫిన్లాండ్ 7.736 స్కోరుతో అగ్రస్థానంలో ఉండటం వెనుక దాని పటిష్ఠ విధానాలే ప్రధాన కారణం. ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి హామీలు ప్రజలకు భరోసా ఇస్తున్నాయి. అవినీతి లేని పాలన విశ్వాసాన్ని పెంచుతుంది. తక్కువ పని ఒత్తిడి, ప్రకృతితో సాన్నిహిత్యం జీవన నాణ్యతను ఉన్నతంగా ఉంచాయి. ఆర్థిక, సామాజిక విభజన లేకపోవడం సమానత్వాన్ని చాటుతుంది. డెన్మార్క్ (2వ), ఐస్‌లాండ్ (3వ), స్వీడన్ (4వ) లాంటి దేశాలు ఇదే బాటలో ఉన్నాయి.

భారత్‌కు సిగ్గుచేటు…
పాకిస్తాన్ (109) ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, సంతోష సూచికలో భారత్‌ను మించిపోయింది. నేపాల్ (92) తక్కువ ఆదాయంతోనూ సాంస్కృతిక ఆశావాదంతో ముందుంది. అమెరికా (24) ఒంటరితనం, యువత అసంతృప్తితో వెనుకబడినా భారత్ కంటే బాగుంది. కెనడా (18) ఆర్థిక బలం, సామాజిక అభివృద్ధిలో మెరుగ్గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ (147) యుద్ధం, ఆర్థిక‌ సంక్షోభంతో అట్టడుగున ఉంది.

ఏం చేయాలి?
భారతదేశం సంతోషంగా ఉండాలంటే కుల, మత వివక్షను కూకటివేళ్లతో పెరికేయాలి. ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతలపై నిర్లక్ష్యం ఉండొద్దు. అవినీతిని నిర్మూలించి, ఆర్థిక అసమానతలను సరిచేయాలి. యూనివర్సల్ బేసిక్ ఆదాయం, ఆరోగ్య కేంద్రాల బలోపేతం తప్పనిసరి. ప్రజలు మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలి. ఫిన్లాండ్ నుంచి సమతుల్యత, పారదర్శకతను నేర్చుకోకపోతే ఈ దుస్థితి మారదు.

టాప్ 25 సంతోషకరమైన దేశాల జాబితా…
* ఫిన్‌లాండ్      * డెన్మార్క్     * ఐస్‌లాండ్    * స్వీడన్     * ఇజ్రాయెల్   * నెదర్లాండ్స్     * నార్వే     * లక్సెంబర్గ్      * స్విట్జర్లాండ్
* ఆస్ట్రేలియా    * న్యూజిలాండ్   * ఆస్ట్రియా     * కెనడా       * ఐర్లాండ్    * అమెరికా      * జర్మనీ    * బెల్జియం     * యునైటెడ్ కింగ్‌డమ్
* చెక్ రిపబ్లిక్    * లిథువేనియా   * ఫ్రాన్స్    స్లోవేనియా     * యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్    * సౌదీ అరేబియా           * లాట్వియా

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *