- అవయవ దానం చేసిన పది నెలల చిన్నారి
- 10 నెలల చిన్నారి త్యాగం ఐదుగురికి జీవితం
- రోడ్డు ప్రమాదంలో మరణించి బ్రెయిన్ డెడ్
- గ్రీన్ కారిడార్ ద్వారా అవయవాల తరలింపు
- తల్లిదండ్రులను కొనియాడిన ప్రధాని, సీఎం
- ప్రశంసించిన కమలహాసన్, మోహన్ లాల్
సహనం వందే, కేరళ:
మృత్యువు ఒడిలోనూ మరో ఐదుగురికి ప్రాణం పోసిన పసిపాప కథ ఇది. కేరళ రోడ్డు ప్రమాదంలో కేవలం పది నెలల వయసున్న ఆలిన్ షెరిన్ అబ్రహం అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాతగా చరిత్ర సృష్టించింది. తన మరణంతో ఐదుగురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ చిన్నారి త్యాగం చూసి అగ్రనటులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

ఘోర ప్రమాదం మిగిల్చిన శోకం
పతనంతిట్ట జిల్లాకు చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ దంపతుల కుమార్తె ఆలిన్. ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొనడంతో తల్లి, తాతమ్మలతో కలిసి ప్రయాణిస్తున్న ఆలిన్ పరిస్థితి విషమించింది. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆలిన్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు.
తల్లిదండ్రుల సాహసోపేత నిర్ణయం
పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆలిన్ కాలేయం, మూత్రపిండాలు, గుండె కవాటాలు, కనుపాపలను సేకరించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని అత్యున్నత మానవతా దృక్పథంగా అభివర్ణించారు. ఆలిన్ త్యాగం కేరళ ఆత్మను ప్రతిబింబిస్తోందని ఆయన ప్రశంసించారు.
మెరుపు వేగంతో గ్రీన్ కారిడార్
అవయవాలను వేగంగా తరలించేందుకు కేరళ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రాత్రి సమయంలో హెలికాప్టర్ ప్రయాణం సాధ్యం కాకపోవడంతో అంబులెన్స్ ద్వారా తరలించారు. కొచ్చి నుండి తిరువనంతపురం వరకు ఉన్న 230 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల 20 నిమిషాల్లో అధిగమించారు. పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి ఒక గ్రీన్ కారిడార్‌ను సృష్టించారు. వైద్యులు ఈ ప్రయాణంలో అవయవాలు పాడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఐదుగురు చిన్నారులకు పునర్జన్మ
ఆలిన్ కాలేయాన్ని ఆరు నెలల పసికందుకు విజయవంతంగా అమర్చారు. రెండు మూత్రపిండాలను పదేళ్ల బాలుడికి ఇచ్చారు. గుండె కవాటాలు, కనుపాపలను ఇతర రోగులకు అమర్చి వారికి చూపు, జీవం పోశారు. ఈ ప్రక్రియలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్వయంగా పర్యవేక్షించారు. ఆలిన్ ద్వారా ఐదుగురు తల్లుల కడుపుకోత తప్పిందని జనం చర్చించుకుంటున్నారు.
ప్రముఖుల భావోద్వేగ నివాళులు
అగ్రనటులు కమల్ హాసన్, మోహన్‌లాల్ ఆలిన్ తల్లిదండ్రులకు లేఖలు రాశారు. ఆలిన్ ఒక దేవదూత అని మోహన్‌లాల్ నివాళి అర్పించారు. తమ బిడ్డ ఐదుగురు బిడ్డల రూపంలో జీవిస్తుందని కమల్ హాసన్ ఓదార్చారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తరపున సురేష్ గోపి అంత్యక్రియలకు హాజరయ్యారు.
అధికారిక లాంఛనాలతో వీడ్కోలు
ఆదివారం పతనంతిట్టలోని చర్చిలో ఆలిన్ అంత్యక్రియలు జరిగాయి. కేరళ ప్రభుత్వం ఈ చిన్నారికి పూర్తి రాష్ట్ర అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికింది. కేసీ వేణుగోపాల్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి నేతలు ఆ తల్లిదండ్రుల ధైర్యాన్ని కొనియాడారు. ఆలిన్ భౌతికంగా లేకపోయినా ఐదుగురి ప్రాణాల్లో సజీవంగా ఉంటుంది.