ఆన్ లైన్ లో సరు’కుళ్లు’- బ్లింక్ ఇట్, జెప్టో, జొమాటోల నాసిరకం సప్లై

Online platform Food Safety Inspection
  • చెడిపోయిన పదార్థాలు అమ్ముతున్న సంస్థలు
  • రాష్ట్రంలో గోదాములపై ఫుడ్ సేఫ్టీ దాడులు
  • అమ్ముతోంది సరుకా? అనారోగ్యమా?
  • కొనుగోలుదారుల ప్రాణాలతో చెలగాటం
  • పలు ఈ-కామర్స్ కంపెనీలకు నోటీసులు జారీ

సహనం వందే, హైదరాబాద్:

ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో మనం నిత్యం కొనే సరుకులు ఎంతవరకు సురక్షితం? తాజా తనిఖీల్లో వెల్లడైన వివరాలు వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ జియోమార్ట్, జెప్టో, బ్లింక్ ఇట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల స్టోరేజ్ సెంటర్లు, గోదాముల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఎంత దారుణంగా ఉల్లంఘనకు గురవుతున్నాయో ఈ దాడులు బట్టబయలు చేశాయి. గడువు ముగిసిన, నాణ్యత లేని సరుకులను అమ్ముతూ ఈ సంస్థలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ ప్రకటించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

కుప్పలు తెప్పలుగా కల్తీ ఆన్ లైన్ సరుకు

ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 75 గోదాములలో తనిఖీలు జరపగా అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోని జీహెచ్‌ఎంసీలో 25 యూనిట్లలో దాడులు జరిగాయి. వీటిలో శాంపిల్స్‌ సేకరించారు. హైదరాబాద్ పరిధిలో 19 యూనిట్లకు నోటీసులు జారీ చేయడాన్ని బట్టి చూస్తే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. సంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లోనూ నిబంధనలు గాలికొదిలేసినట్లు తేలింది. వరంగల్‌లోనూ 15 శాంపిల్స్ సేకరించారు.

ప్రమాదకరమైన ఆహార పదార్థాలు…
నిబంధనలు ఉల్లంఘించిన మూడు యూనిట్లను అధికారులు పూర్తిగా సీజ్ చేశారు. అంతేకాక 1903 యూనిట్లలో గడువు ముగిసిన లేదా తప్పుగా లేబుల్ వేసిన ఆహార పదార్థాలను పట్టుకున్నారు. దాదాపు 77 కిలోల కాలం చెల్లిన ఆహార పదార్థాలు, పాడైపోయిన సరుకులు, కుళ్లిపోయిన కూరగాయలను అధికారులు స్వాధీనం చేసుకుని పడవేశారు.

మనుషులు తినడానికి పనికిరాని ఈ సరుకును ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు విక్రయించడానికి సిద్ధంగా ఉంచాయంటే వారి వ్యాపార నైతికత ఎంత దిగజారిందో తెలుస్తుంది. ఈ రకమైన ఆహారం తింటే తీవ్రమైన జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

హెచ్చరికలు నామమాత్రమేనా?
ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని మొత్తం 32 యూనిట్లకు నోటీసులు జారీ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంత పెద్ద సంస్థ అయినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలు, నోటీసులు నామమాత్రంగా మిగిలిపోకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించిన సంస్థలపై భారీ జరిమానాలు విధించాలి, లేదంటే ఈ తరహా ఉల్లంఘనలు పునరావృతమవుతూనే ఉంటాయి.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే…
బ్లింక్ ఇట్, జెప్టో వంటి తక్షణ డెలివరీ వేదికల్లోని ఆహారం నాణ్యతపై ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ దాడుల్లో వెల్లడైన వివరాల ప్రకారం ఈ సంస్థలు లాభాపేక్షతో వినియోగదారుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఆహారం కొనే ప్రతి ఒక్కరూ వస్తువుల గడువు తేదీలను (ఎక్స్‌పైరీ డేట్), లేబులింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *