వీసమెత్తు పనికిరానివారికి వీసా – అమెరికాలో హైదరాబాద్ పరువు గంగపాలు

Chennai-Based Visa Scam Exposed
  • చెన్నై కేంద్రంగా హెచ్-1బీ వీసా కుంభకోణం
  • దొంగ డిగ్రీలు,.. ఫోర్జరీ పత్రాలతో దరఖాస్తు
  • నకిలీ అభ్యర్థులే ఇంటర్వ్యూలకు హాజరు
  • 70 శాతం పైగా నకిలీ దరఖాస్తుదారులే
  • అమెరికన్ భారత్ దౌత్యవేత్త సంచలన వ్యాఖ్య
  • డబ్బులు తీసుకుని ఉద్యోగాలిచ్చే మాఫియా
  • ఉన్నతస్థాయి రాజకీయ ఒత్తిడితోనే మోసం

సహనం వందే, హైదరాబాద్/చెన్నై:

అమెరికా వెళ్లేందుకు తీసుకునే వీసా ప్రక్రియలో భారీగా మోసాలు జరిగాయని ఒక దౌత్యవేత్త సంచలన ఆరోపణలు చేశారు. భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా వ్యవస్థలోని అక్రమాలను ఒక అమెరికన్-భారతీయ దౌత్యవేత్త మహ్వాష్ సిద్ధిఖీ బట్టబయలు చేశారు. వీసాల కోసం వచ్చే దరఖాస్తులలో దాదాపు 70 నుంచి 90 శాతం వరకు నకిలీవి అని… ఈ వ్యవస్థ ఒక కుంభకోణంగా మారిందని మహ్వాష్ సిద్ధిఖీ ఆరోపణలు చేశారు. ఏమాత్రం నైపుణ్యం లేనివారు, నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ పత్రాలతో వీసాలను పొందుతున్నారని ఆమె బయట పెట్టడంతో దేశ పరువు అంతర్జాతీయ వేదికపై బజారున పడింది.

చెన్నై సాక్షిగా వీసా ఫ్రాడ్స్…

2005-2007 మధ్య చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్‌లో తాను పనిచేసినప్పుడు ఇక్కడి అధికారులంతా ఈ మోసాన్ని పదేపదే గుర్తించి అప్పటి యంత్రాంగానికి తెలియజేసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సిద్ధిఖీ ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యధిక హెచ్-1బీ వీసాలు ప్రాసెస్ అయ్యే కేంద్రాలలో చెన్నై ఒకటి. అయినా మోసాలను అరికట్టేందుకు తాము చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆమె విమర్శించారు. కొందరు రాజకీయ నాయకులు ఈ దందాలో భాగమయ్యారని… ఉన్నత స్థాయి నేతలను సంతృప్తి పరచడానికి ఈ దర్యాప్తును ఆపేశారని సిద్ధిఖీ ఆవేదన వ్యక్తం చేశారు.

Chennai based H1BVisa Scam - Most of the scams from Hyderabad

హైదరాబాద్ నుంచే అక్రమాలు అధికం…
తాను రెండేళ్ల పాటు చెన్నైలో పనిచేసి దాదాపు 51,000 వీసాలను పరిశీలించానని సిద్ధిఖీ తెలిపారు. ముఖ్యంగా చెన్నై కాన్సులేట్ పరిధిలోని నాలుగు ప్రాంతాలైన హైదరాబాద్, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో…. హైదరాబాద్ నుంచే అత్యధికంగా మోసాలు జరిగాయని ఆమె ప్రకటించారు. ‘ఒక భారతీయ-అమెరికన్‌గా చెప్పడానికి బాధగా ఉన్నా… భారత్‌లో మోసం, లంచగొండితనం సర్వసాధారణమైపోయాయి’ అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికన్ అధికారి ఇంటర్వ్యూ చేస్తుంటే అసలైన అభ్యర్థులు దరఖాస్తుదారులు రాకపోవడం, అసలు అభ్యర్థికి బదులు ప్రాక్సీ అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం, డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే భారతీయ మేనేజర్లు ఉండేవారని ఆమె ఆరోపించడం ఈ దందా తీవ్రతను చాటుతోంది.

ఉద్యోగాలు కాదు… మాఫియా కేంద్రం
అమెరికాలో టెక్నాలజీ ఇంజినీరింగ్ నిపుణుల కొరత ఉందన్న వాదన అబద్ధమని సిద్ధిఖీ కొట్టిపారేశారు. నకిలీ నిపుణులను, నకిలీ పత్రాలను అంగీకరించి వీసాలు ఇవ్వడం ద్వారా అమెరికా కంపెనీలు చౌకగా శ్రమను దోచుకోవడమే కాకుండా నిజమైన ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోంది.

70% మంది లబ్ధిదారులు భారతీయులే ఉన్న హెచ్-1బీ వీసా పథకం ఇప్పుడు మోసానికి, లంచగొండితనానికి చిరునామాగా మారడం యావత్ దేశం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా జరుగుతున్న ఈ వీసా మాఫియాపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Source:https://timesofindia.indiatimes.com/world/us/as-an-indian-american-us-diplomat-who-was-posted-in-chennai-says-h-1b-is-industrialized-fraud/articleshow/125521961.cms

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *