- బ్రాహ్మణ అమ్మాయి… దళిత అబ్బాయి…
- ఐఏఎస్ అయినా కుల వివక్ష ఉందని ఆవేదన
- రిజర్వేషననేది కేవలం ఉద్యోగం కాదని వ్యాఖ్య
సహనం వందే, భోపాల్:
రిజర్వేషన్లను కేవలం పేదరికంతో ముడిపెట్టి పదేపదే ప్రశ్నించే అగ్ర కులాలకు దళిత ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ గట్టి సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించినా… ఆర్థికంగా నిలదొక్కుకున్నా ఈ సమాజం ఇంకా తనను సామాజికంగా అంగీకరించడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. అనుసూచిత్ జాతి-జనజాతి అధికారి కర్మచారి సంఘం (అజ్జాక్స్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన… రిజర్వేషన్లు ఎందుకు కొనసాగాలని ప్రశ్నించిన వారికి సూటిగా జవాబిచ్చారు. ‘ఒక బ్రాహ్మణుడు తన కూతురిని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసే వరకు (దానం చేసే వరకు) రిజర్వేషన్లు కొనసాగించాలి’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు కుల వ్యవస్థకు, సామాజిక అసమానతలకు అద్దం పడుతున్నాయి. రిజర్వేషన్ అనేది కేవలం ఉద్యోగం కాదు… సామాజిక గౌరవం దక్కే వరకు దళిత, బహుజన వర్గాలకు ఉన్న హక్కు అని వర్మ తన మాటలతో బలంగా నిరూపించారు.

వివక్షపై మాట్లాడితే అసభ్యమా?
ఐఏఎస్ సంతోష్ వర్మ నిజం మాట్లాడగానే అఖిల భారత బ్రాహ్మణ సమాజ్ తట్టుకోలేకపోయింది. ఆయన వ్యాఖ్యలు అసభ్యకరమని, కులతత్వమని మండిపడింది. కానీ వర్మ ప్రశ్నించింది కేవలం సామాజిక ఆమోదం గురించే. ఆర్థికంగా ఎదిగినా కులం పేరుతో ఇంట్లో కూతురిని ఇవ్వడానికి, రోటీ-బేటీ (అంతర్-కుల వివాహం) సంబంధాలు పెట్టుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని దళిత-బహుజన సమాజం ప్రశ్నిస్తోంది. రిజర్వేషన్లను రద్దు చేయాలని మాట్లాడే అగ్ర కుల నాయకులు… సామాజిక అసమానతలను తొలగించడానికి మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదో వర్మ వ్యాఖ్యలతో స్పష్టమైంది. బ్రాహ్మణ సమాజ్ వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేయడాన్ని బహుజన వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ఆగ్రహమే కుల వివక్ష ఇంకా బలంగా, పచ్చిగా ఉందనడానికి నిదర్శనం.
రిజర్వేషన్ల లక్ష్యం సమానత్వం…
ఐఏఎస్ సంతోష్ వర్మ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కాదు… దశాబ్దాలుగా కుల వివక్షతో అణచివేయబడిన బహుజన దళిత వర్గాల ఆవేదనను, ఆకాంక్షను వినిపించారని అజ్జాక్స్ నేతలు గట్టిగా చెబుతున్నారు. భారత రాజ్యాంగ లక్ష్యం కేవలం ఆర్థిక సాధికారత కాదు సామాజిక సమానత్వం అని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం బేటీ బచావో అంటూ గొప్పలు చెప్పుకుంటుంది కానీ కూతురిని కులం దాటి ఇచ్చే సామాజిక ధైర్యాన్ని మాత్రం పౌరులకు ఇవ్వలేకపోతోంది. అందుకే ఈ వివాదంలో ప్రభుత్వం సంతోష్ వర్మకు మద్దతుగా నిలవాలి. కులం పేరుతో వివక్ష చూపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజికంగా పూర్తి సమానత్వం, అంగీకారం వచ్చే వరకు రిజర్వేషన్లు కొనసాగాలని దళిత బహుజన సంఘాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేస్తున్నాయి.