బడాబాబుల గుండెల్లో ‘హైడ్రా’ గుబులు – అక్రమాలకు బ్రేక్… బాధితులకు భరోసా

64Complaints to Hydra in One day
  • ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు
  • ఒక్కరోజు ఏకంగా 64 మంది కంప్లైంట్
  • పబ్లిక్ స్థలాలు గోల్మాల్: ఫెన్సింగ్ మాయం!
  • వరద కాలువ మూత: బిల్డర్ల బరితెగింపు!
  • హైడ్రా కమిషనర్ చొరవ: బాధితుల ఊరట

సహనం వందే, హైదరాబాద్:

గ్రేటర్ హైదరాబాద్‌ను ఆక్రమణలు, భూకబ్జాలు ఏ స్థాయిలో పట్టి పీడిస్తున్నాయో చెప్పడానికి ‘హైడ్రా‘ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులే నిదర్శనం. సోమవారం ఒక్కరోజే ఏకంగా 64 ఫిర్యాదులు అందాయంటే సామాన్యుడి కష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా పరిష్కారాలను చూసి ధైర్యం చేసి ఫిర్యాదుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. లే అవుట్ల మ్యాపులు పట్టుకు వచ్చి అక్రమణలను కళ్లకు కట్టినట్టు వివరించడం చూస్తుంటే అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.

వరద కాలువ మూత: బిల్డర్ల బరితెగింపు!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గాజుల రామారం, వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ ప్రతినిధులు చేసిన ఫిర్యాదు బిల్డర్ల బరితెగింపుకు అద్దం పడుతోంది. ఏడు ఎకరాల పరిధిలో ఉన్న 200 కుటుంబాలకు ముప్పు తెచ్చేలా ఒక నిర్మాణ సంస్థ ఏకంగా వరద కాలువనే మూసేసి అపార్టుమెంట్లు కడుతోంది. పైన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు బంధం చెరువుకు వెళ్లే దారిని మూసేసి గతంలో మున్సిపాలిటీ వేసిన పైపులైన్లను కూడా ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? దీంతో మురుగు, వరద నీరు నిలిచిపోయి కాలనీవాసులకు నరకం కనిపిస్తోంది. రహదారుల విషయంలోనూ ఇదే దౌర్జన్యం. లే అవుట్‌లోకి జరిగి మరీ రోడ్లను కాజేయడం భూబకాసురుల దురాశకు పరాకాష్ఠ!

చెరువు అలుగులు బంద్: కాలనీలకు కష్టాలు!
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో జరిగిన ఘటన అధికారుల పర్యవేక్షణ లోపాన్ని స్పష్టం చేస్తోంది. కాప్రాయి చెరువు అలుగులు, తూములను కబ్జాదారులు మూసేయడంతో చెరువు నిండి ఎగువన ఉన్న హరిహరపురం కాలనీతో పాటు మొత్తం 20 కాలనీల ప్రజలు వరద ముంపు భయంతో బతుకుతున్నారు. ఈ చెరువు నిండి కింద ఉన్న బాతుల చెరువుకు నీరు వెళ్లేది. కానీ ఇప్పుడు దారి మూయడంతో కాలనీలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా స్థానిక యంత్రాంగం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి కబ్జాదారులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?

పబ్లిక్ స్థలాలు గోల్మాల్: ఫెన్సింగ్ మాయం!
ప్రభుత్వ స్థలాలను, పబ్లిక్ అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కూడా కబ్జా చేయడం సర్వసాధారణమైంది. మూసాపేట ఆంజనేయ నగర్‌లో కబ్జాకు గురైన 2 వేల గజాల పార్కును హైడ్రా కాపాడటం హర్షణీయం. దాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని నివాసితులు కోరారు. అలాగే అల్వాల్ మండలం వెంకటాపురం బ్యాంక్ కాలనీలో ఉన్న 372 గజాల ఓపెన్ బావిని పూడ్చి ప్రజావసరాలకు వాడుకుంటుంటే ఒక వ్యక్తి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని కొట్టేయాలని ప్రయత్నించాడు. జీహెచ్‌ఎంసీ వేసిన ఫెన్సింగ్‌ను కూడా తొలగించి ఆ స్థలాన్ని బ్యాంకు ఆఫ్ ఇండియా మార్టుగేజ్‌లో ఉందంటూ బోర్డు పెట్టడం స్థానిక అధికారుల సహకారం లేకుండా జరగదన్న అనుమానాన్ని బలపరుస్తోంది.

‘హైడ్రా’ కమిషనర్ చొరవ: బాధితుల ఊరట

అన్నింటికి మించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవ బాధితులకు కొంత ఊరటనిస్తోంది. ఫిర్యాదుదారుల ముందే గూగుల్ మ్యాప్స్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఆధారంగా ఆక్రమణల తీరును వివరించి పరిష్కార మార్గాలు సూచించడం పారదర్శకతకు నిదర్శనం. అధికారులు తక్షణమే స్పందించి భూబకాసురుల భరతం పట్టి ప్రజల ఆస్తులను కాపాడాలని సామాన్యులు కోరుకుంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *