‘సంస్కృతం చచ్చిపోయిన భాష’ – తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అటాక్

Udayanidhi Stalin Comments on Sanskrit Language
  • తమ భాషకు నిధుల కేటాయింపులో వివక్ష
  • కేంద్రం ప్రభుత్వంపై ఉదయనిధి స్టాలిన్ విమర్శ
  • హిందీని, సంస్కృతాన్ని రుద్దుతున్నారని ఫైర్
  • తమిళ భాషాభివృద్ధి కేవలం రూ. 150 కోట్లు
  • అదే సంస్కృతానికి 2,400 కోట్లు కేటాయింపు
  • గత పదేళ్ల లెక్కలను బయటపెట్టిన స్టాలిన్

సహనం వందే, తమిళనాడు:
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళ భాషను పక్కన పెట్టి సంస్కృతానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, సంస్కృతం చచ్చిపోయిన భాష (డెడ్ లాంగ్వేజ్) అంటూ వ్యాఖ్యానించి, సంచలనం సృష్టించారు. ‘మీరు తమిళ భాషను ప్రేమిస్తున్నట్లు నటిస్తారు. కానీ మా విద్యార్థులు తమిళం చదవకుండా ఉండటానికి హిందీని, సంస్కృతాన్ని రుద్దుతారు. ఇది ఎంతవరకు న్యాయం?’ అని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు.

పదింతలు ఎక్కువ సంస్కృతానికే!
కేంద్రం అనుసరిస్తున్న భాషా విధానాలపై ఉదయనిధి నేరుగా లెక్కలతో దాడి చేశారు. గత పదేళ్లలో తమిళ భాషా అభివృద్ధి కోసం కేవలం రూ. 150 కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్రం… సంస్కృత భాషకు ఏకంగా రూ. 2,400 కోట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ స్థాయిలో నిధుల కేటాయింపులో వ్యత్యాసం చూపడం తమిళ ప్రజలకు అన్యాయం చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. త్రిభాషా విధానాన్ని అంగీకరిస్తేనే నిధులు ఇస్తామని చెప్పడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. తమిళ భాషాభివృద్ధి కోసం కేంద్రం చేసిందేమిటని నిలదీశారు. రాబోయే 2026 ఎన్నికల్లో ప్రజలు ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు.

భాషల మధ్య విభేదాలు వద్దు: బీజేపీ కౌంటర్!
ఉదయనిధి వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రతిఘటించింది. బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళ సై సౌందర రాజన్ స్పందిస్తూ… ఏ భాషను కూడా ‘చచ్చిపోయిన భాష’ అని పిలిచే హక్కు ఎవరికీ లేదన్నారు. సంస్కృతం దేశవ్యాప్తంగా పూజలు, ఆచారాలలో విస్తృతంగా ఉపయోగించే భాష అని ఆమె గుర్తు చేశారు. నాయకులు భాష, సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని హితవు పలికారు. అంతేకాకుండా తమిళ భాష కూడా కాలక్రమేణా అనేక సంస్కృత పదాలను తనలో ఇముడ్చుకుందని, ఇది తమిళ భాష గొప్పదనాన్ని, బలాన్ని సూచిస్తుందే తప్ప బలహీనత కాదని ఆమె ఉదయనిధికి కౌంటర్ ఇచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *