కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో… చిన్న తిమింగలం 200 కోట్లు మింగేస్తే..

  • మరి పెద్ద తిమింగాలాలు ఎన్ని వేల కోట్లు తినేశాయి?
  • కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ ఆస్తులతో తెరపైకి కీలక చర్చ
  • ఏటీఎంలాగా వాడుకున్న వాళ్లకు శిక్షెప్పుడు అని ప్రశ్నిస్తున్న ప్రజలు

తెలంగాణ ప్రజల కలలను ఆశలతో నింపి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా చిత్రీకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, దానిని అవినీతి యంత్రంగా మార్చి ముంచింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో బంగారం, నగదు, విలాసవంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ, శ్రీధర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది.

పెద్దలు ఎంత కొట్టేశారు?
ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూ. 200 కోట్ల ఆస్తులను సమకూర్చుకోగలిగాడంటే, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ఎంత దోచుకున్నారో ఊహించడం కష్టం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలోనే గగ్గోలు పెట్టింది. ఇప్పుడు శ్రీధర్ కేసు ఆ ఆరోపణలకు పటిష్టమైన సాక్ష్యంగా నిలుస్తోంది. ఒక మధ్యస్థాయి అధికారి ఇంత భారీగా దోచుకున్నాడంటే, అతడికి రక్షణ కల్పించిన పెద్దలు, ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ నాయకులు ఎంత దోపిడీ చేశారోనని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

బీఆర్ఎస్ కు ఏటీఎం మిషన్…
రూ. 1.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రాజెక్టు, బీఆర్ఎస్ పెద్దలకు అవినీతి సొరంగంగా మారింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, నాణ్యత లేకపోవడం, డిజైన్ లోపాలు బయటపడ్డాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఈ అంశాలు స్పష్టమవుతున్నాయి. కానీ ఈ లోపాల వెనుక దాగిన అవినీతి లింకు ఎంత పెద్దదో శ్రీధర్ కేసు బహిర్గతం చేస్తోంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమంగా బిల్లులు చెల్లించి నామమాత్రపు పర్యవేక్షణతో ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు. ఈ దోపిడీలో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు వంటి కీలక నేతల పాత్ర గురించి ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. శ్రీధర్ కేసు ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *