అందం వెనుక విషాదం

  • ప్రపంచ సుందరి ఓపల్ సుచాతా కన్నీటి జర్నీ
  • 16 ఏళ్ల వయసులో రొమ్ము కణితి శస్త్రచికిత్స
  • హైదరాబాదులో ముగిసిన మిస్ వరల్డ్ పోటీ

హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల వయసులో రొమ్ము కణితి శస్త్రచికిత్సను చేయించుకుని, రొమ్ము క్యాన్సర్ అవగాహనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఈ యువతి ప్రస్థానం హృదయాన్ని పిండేస్తుంది. ఆమె విజయం కేవలం అందానికే కాదు. ఆమె సంకల్పానికి, సమాజం పట్ల బాధ్యతకు నిదర్శనం.

16 ఏళ్లలోనే జీవిత పాఠం…
2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించిన సుచాతా, 16 ఏళ్ల వయసులో రొమ్ములో కణితిని గుర్తించారు. శస్త్రచికిత్సతో దాన్ని తొలగించినప్పటికీ, ఆ అనుభవం ఆమె జీవితాన్ని మార్చేసింది. ‘నా అనుభవం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం నా లక్ష్యంగా మారింద’ని సుచాతా చెప్పింది. ఈ సంకల్పంతోనే ఆమె అందాల పోటీల వైపు అడుగులు వేసింది.

విద్యా నేపథ్యం… బహుభాషా ప్రతిభ
సుచాతా ఫుకెట్‌లోని కాజోంకియెట్సుక్సా, ట్రైమ్ ఉడోమ్ సుక్సా పాఠశాలల్లో విద్యనభ్యసించింది. ప్రస్తుతం థమ్మాసాట్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు చదువుతోంది. థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో ప్రావీణ్యం కలిగిన ఆమె, తన విద్యా నేపథ్యాన్ని సామాజిక సేవకు అనుసంధానం చేసింది.

అందాల పోటీల్లో అసాధారణ ప్రస్థానం…
సుచాతా 2021లో మిస్ రత్తనకోసిన్ పోటీతో తన అందాల ప్రయాణాన్ని ప్రారంభించింది. 2022లో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచింది. 2024లో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ కిరీటాన్ని గెలుచుకొని, అనేక ప్రత్యేక అవార్డులను సొంతం చేసుకుంది. మెక్సికో సిటీలో జరిగిన మిస్ యూనివర్స్ 2024లో మూడో రన్నరప్‌గా నిలిచి, వాయిస్ ఫర్ చేంజ్ సిల్వర్ అవార్డును అందుకుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికపై జరిగిన మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో 108 దేశాల నుంచి వచ్చిన పోటీదారులను మించి సుచాతా కిరీటాన్ని గెలుచుకుంది. రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌లాండ్‌కు గుర్తింపు తెచ్చిన ఆమె యువతకు స్ఫూర్తిగా నిలిచింది.

ఇథియోపియా సుందరి ఫస్ట్ రన్నరప్‌…
మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఇథియోపియా సుందరి ఫస్ట్ రన్నరప్‌గా, పోలండ్ సెకండ్ రన్నరప్‌గా, మార్టినిక్ థర్డ్ రన్నరప్‌గా నిలిచారు. సుచాతా విజయం థాయ్‌లాండ్‌తో పాటు హైదరాబాద్‌కు కూడా గర్వకారణంగా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *