‘నకిలీ’ల చేతిలో ప్రాణాలు

  • తెలంగాణలో నకిలీ డాక్టర్ల హవా
  • ఖమ్మం జిల్లాలో నకిలీ వైద్యుల గుట్టు
  • సూర్యాపేటలో ఇష్టారాజ్యాంగా అనుమతులు
  • కొందరు అధికారుల సహకారంతో వ్యవహారం

తెలంగాణ రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు, అనధికార ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా మారి, నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు, ఆసుపత్రులు నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటపడుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్‌ వంటి జిల్లాల్లో ఇటీవల జరిగిన తనిఖీలు ఈ సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నకిలీ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ దందా ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఖమ్మంలో 10 ఆసుపత్రుల సీజ్…
ఖమ్మం జిల్లాలో నకిలీ వైద్యుల గుట్టు రట్టయింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 41 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అనధికారంగా నడుస్తున్న 10 ఆసుపత్రులను సీజ్ చేశారు. అర్హత లేని వ్యక్తులు సొంత క్లినిక్‌లు ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు అందిస్తున్నట్లు తేలింది. కొందరు ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీలు తమ అర్హతకు మించి చికిత్సలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

సూర్యాపేటలో నకిలీ క్లినిక్‌లపై దాడులు…
సూర్యాపేట జిల్లాలోనూ నకిలీ వైద్యులు, అనధికార క్లినిక్‌లు రెచ్చిపోతున్నాయి. కోదాడలోని నయానగర్ మెయిన్ రోడ్డులో ఒక వ్యక్తి నడుపుతున్న నకిలీ క్లినిక్‌పై డీసీఏ అధికారులు గతంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.1.5 లక్షల విలువైన యాంటీబయాటిక్స్, అనాల్జెసిక్స్, యాంటీ-అల్సర్ డ్రగ్స్ వంటి 87 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా నిల్వ ఉంచిన ఈ మందులు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా సూర్యాపేటలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై అవినీతి ఆరోపణలు రావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. డాక్టర్ రాథోడ్ నేతృత్వంలోని బృందం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పర్మిషన్ సర్టిఫికెట్లు, వైద్యుల అర్హతలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు ఆసుపత్రుల వివరాలను సేకరించింది. ఈ నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్‌కు సమర్పించారు. చివరకు ఆ జిల్లా వైద్యాధికారిని బదిలీ చేశారు.

నల్గొండ, నిజామాబాద్‌లో నకిలీ గుట్టు రట్టు…
నల్గొండ జిల్లాలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు చేసింది. కొందరు గతంలో కాంపౌండర్లుగా పనిచేసి, నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతున్నట్లు తేలింది. నిజామాబాద్‌లో ఇద్దరు నకిలీ వైద్యులు పట్టుబడ్డారు. ఖలీల్ వాడిలోని ఒక కంటి ఆసుపత్రిలో ఒక వ్యక్తి ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా చికిత్సలు చేస్తున్నాడు. బోధన్ బస్టాండ్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ పేరుతో అనధికార చికిత్సలు అందిస్తున్నాడు. ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది.

నకిలీ ఔషధాలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు
నకిలీ వైద్యులతో పాటు నకిలీ ఔషధాల సరఫరా కూడా తెలంగాణలో పెను సమస్యగా మారింది. 2024లో డీసీఏ నిర్వహించిన తనిఖీల్లో రూ.11.32 కోట్ల విలువైన నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కరకపట్లలోని బయోటెక్ పార్క్‌లో నకిలీ యాంటీబయాటిక్స్ తయారు చేస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. ఈ మందులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తేలింది. పారాసిటమాల్ నుంచి క్యాన్సర్ చికిత్సకు వాడే మందుల వరకు నకిలీ ఔషధాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి, ఇవి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం… అవినీతి ఆరోపణలు
నకిలీ ఆసుపత్రులు, వైద్యులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కోవిడ్ నిధుల దుర్వినియోగం, అనధికార ఆసుపత్రులకు లక్షల రూపాయలు తీసుకొని అనుమతులు ఇవ్వడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 400 మంది నకిలీ వైద్యులను గుర్తించినట్లు మెడికల్ కౌన్సిల్ వెల్లడించినప్పటికీ, చాలా ప్రాంతాల్లో ఇలాంటి క్లినిక్‌లు యథావిధిగా నడుస్తున్నాయి.

ప్రజలకు అప్రమత్తత అవసరం…
నకిలీ వైద్యులు, ఆసుపత్రుల సమస్యను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వైద్యులు ఎన్‌ఎంసీ లేదా ఎస్‌ఎంసీలో రిజిస్టర్ అయ్యారా లేదా అని తనిఖీ చేయడం, ఆసుపత్రుల లైసెన్స్‌లను పరిశీలించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్ ఇస్తూ నకిలీ వైద్యులు ప్రజలను ఆకర్షిస్తున్నారని, ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *