గుల్జార్ ఘటన…వ్యవస్థాగత ఉగ్రవాదం

  • గుల్జార్ హౌస్ శవాల దిబ్బ
  • ఇది ప్రమాదం కాదు… ప్రభుత్వ హత్య!
  • రోబోటిక్ ఫైర్‌ఫైటింగ్ యూనిట్లు ఎక్కడ?
  • బాధ్యతలేని అధికారులపై కేసులు పెట్టాల్సిందే

పహల్గాంలో ఉగ్రవాదుల చేతుల్లో 26 మంది చనిపోతే, భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్ధం చేసింది. మరి హైదరాబాదులోని గుల్జార్ హౌస్‌లో మంటలు చెలరేగి 17 మంది చనిపోతే ఎవరిపై మనం యుద్ధం చేయాలి? నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలను బలిగొన్న ఇక్కడ ఉగ్రవాదులు ఎవరు? అధికారులు కాదా? ఇది అంతర్గత వ్యవస్థాగత ఉగ్రవాదం కాదా? ఈ ఉగ్రవాదులపై చర్యలు ఉండవా? ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటే సరిపోతుందా? ఇది కేవలం దుర్ఘటన కాదు. నిస్సహాయ ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం! ఏసీ షార్ట్ సర్క్యూట్ అంటూ చేతులు దులుపుకుంటున్న పాలకులు…మంటల్లో తమ బాధ్యతారాహిత్యం ఎంత ఉందో తెలుసుకోవాలి! ఇది ప్రమాదం కాదు… వ్యవస్థాగత హత్య!

నిద్రపోతున్న అగ్నిమాపక శాఖ…
ఆదివారం ఉదయం 6:16 గంటలకు మంటలు మొదలైతే… అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడు కళ్లు తెరిచారు? బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆర్తనాదాలు చేస్తుంటే… మీరెక్కడ నిద్రపోయారు? 10 ఫైరింజన్లు వచ్చాయంటున్నారు… కానీ వాటిల్లో నీళ్లు లేవు! ఆక్సిజన్ సిలిండర్లు మాయమయ్యాయి! అత్యాధునిక పరికరాల ఊసే లేదు! పాతబస్తీ సందులు ఇరుకుగా ఉంటే… వాటిని వెడల్పు చేయాల్సింది ఎవరు? అగ్నిమాపక వాహనాలు వెళ్లలేని చోట ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు? మీ నిర్లక్ష్యం వల్లే 17 మంది బలైపోయారు!

రోబోటిక్ ఫైర్‌ఫైటింగ్ లు ఎక్కడ?
ప్రపంచం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతుంది.‌ ఏఐ రాకతో ప్రపంచ స్వరూపమే మారిపోతుంది. అలాంటిది అగ్నిమాపక శాఖలో ఉన్నది తుప్పు పట్టిన యంత్రాలు కాదా? కార్బన్ డయాక్సైడ్ లేదు… బీసీఎఫ్ లేదు… హైడ్రాలిక్ లిఫ్ట్‌లు కనిపించవు… థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు ఎక్కడ దాచారు? రోబోటిక్ ఫైర్‌ఫైటింగ్ యూనిట్ల గురించి మాట్లాడటం దండగ! మీ దగ్గర కనీసం నీళ్లున్న ఫైరింజన్లు కూడా లేవు! ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రజలు ఊపిరాడక చస్తుంటే… మీరేం చేస్తున్నారు? స్మోక్ ఎక్స్‌ట్రాక్టర్లు, హై-ప్రెజర్ వాటర్ జెట్‌లు ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా. ప్రజల ప్రాణాలంటే మీకు ఇంత చులకనా?

సందులు అడ్డంకి అయితే ఏం చేస్తున్నారు?
పాతబస్తీ సందులు ఇరుకుగా ఉన్నాయని మీకు ఇప్పుడే తెలిసిందా? ఏళ్లుగా ప్రజలు మొత్తుకుంటుంటే ఏం చేశారు? చిన్న రోబోటిక్ ఫైర్‌ఫైటింగ్ యూనిట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు? పోర్టబుల్ అగ్నిమాపక యంత్రాలు ఎందుకు అందుబాటులో ఉంచలేదు? జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ సందులను వెడల్పు చేయడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? ప్రజల ప్రాణాలు పోతున్నా మీరెందుకు కళ్లు మూసుకున్నారు?

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిధులు లేవా?
అగ్నిమాపక శాఖకు నిధులు లేవా? రాష్ట్ర ఖజానా ఏమైంది? విపత్తుల కోసం కేటాయించిన డబ్బులు ఏమయ్యాయి? అత్యాధునిక పరికరాలు కొనడానికి మీకేమైనా ఆటంకాలు ఉన్నాయా? శిక్షణ ఇవ్వడానికి డబ్బుల్లేవా? మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేతులు రావట్లేదా? హైదరాబాద్ లాంటి నగరంలో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణం అయినా… మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు?

డీజీ నాగిరెడ్డి సమాధానం చెప్పాలి!
17 మంది చనిపోతే… ప్రధాని రెండు లక్షలు, సీఎం రూ. 5 లక్షలు ఇస్తే సరిపోతుందా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఈ ఘోర తప్పిదానికి బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఏం చేస్తున్నారు? జీహెచ్‌ఎంసీ అధికారులు ఏంచేస్తున్నారు? పోలీసు శాఖ ఏం చేస్తోంది? వీళ్లందరి నిర్లక్ష్యం వల్లే కదా ఈ మరణాలు సంభవించాయి! వీరిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదు?

సీపీఎం ఆగ్రహం!
ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం వల్లే చార్మినార్ పక్కన గుల్జార్ హౌస్‌లో 17 మంది చనిపోయారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా మండిపడ్డారు. అత్యాధునిక ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉండి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కావని ఆయన అన్నారు. ఫైరింజన్లలో నీళ్లు లేకపోవడం, ఆక్సిజన్ సిలిండర్లు, మాస్క్‌లు అందుబాటులో లేకపోవడం వల్లే సామాన్య ప్రజలు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *