దళారులకు మార్క్‌ఫెడ్‌ అండదండ

  • జొన్నల కొనుగోలులో అక్రమాలు
  • దళారులకే అందుతున్న మద్దతు ధర
  • రైతుల సొమ్ముతో క్వింటాల్‌కు వెయ్యి దోపిడీ
  • ఆదిలాబాద్‌లో ఓ మార్క్‌ఫెడ్ అధికారి అండదండలు
  • హైదరాబాదులో మరో అధికారి సహకారం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి… వీళ్లంతా జొన్న రైతుల కోసం కృషి చేస్తుంటే కిందిస్థాయిలో కొందరు అధికారులు మాత్రం దళారులకు అమ్ముడుపోతున్నారు. జొన్న రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జొన్న కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం తమ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాదు నుంచి మొదలుపెట్టి జిల్లాల వరకు కొందరు అధికారులు అక్రమార్జనే ధ్యేయంగా దళారులకు కొంత పాడుతున్నారు. దీంతో అన్నదాతలకు అన్యాయం జరుగుతుంది. మార్క్ ఫెడ్ కు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది.

అవినీతి కుంభకోణాల కేంద్రంగా…
మార్క్‌ఫెడ్ అవినీతి కుంభకోణాల కేంద్రంగా మారింది! రైతుల రక్తాన్ని పీల్చే దళారులకు కొందరు అధికారులు కొమ్ముకాస్తూ అడ్డగోలుగా దోపిడీకి తెరలేపారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా సహా పలు మార్కెట్లలో జొన్నల కొనుగోలు పేరుతో జరుగుతున్న ముడుపుల మాయాజాలం రైతులను నడ్డివిరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి జొన్నలను తెచ్చి మద్దతు ధర పేరుతో దళారులు లక్షలు దండుకుంటుంటే, మార్క్‌ఫెడ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉన్నారు. ఈ దోపిడీ వెనుక అధికారుల హస్తం ఉందని అంటున్నారు.

క్వింటాల్‌కు రూ.1,000 దోపిడీ…
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి మార్కెట్లలో దళారులు క్వింటాల్ జొన్నలను కేవలం రూ.2,000కు కొనుగోలు చేస్తున్నారు. ఈ జొన్నలను తెలంగాణకు తరలించి, మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాల్‌కు రూ.3,371 మద్దతు ధర పేరుతో అమ్ముకుంటున్నారు. ఒక్కో క్వింటాల్‌పై రూ.1,000కి పైగా దళారులు దండుకుంటున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులు ఈ దోపిడీని చూస్తూ మౌనంగా ఉండటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారుల జేబులు కూడా నిండుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.

రైతుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న మార్క్‌ఫెడ్…
మార్క్‌ఫెడ్ రైతులకు అండగా నిలవాల్సింది పోయి, దళారులకు అండగా ఉంటుంది. వేల టన్నుల జొన్నలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తే మద్దతు ధరకు ఎలా కొంటున్నారు? అధికారుల అండ లేకుండా ఇది సాధ్యమా? కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు ఎందుకు జరపడం లేదు? రైతుల వివరాలు సరిగా పరిశీలించకపోవడం వెనుక అవినీతి దాగి ఉందని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. రైతుల ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలను అడ్డం పెట్టుకుని దళారులు జొన్నలను విక్రయిస్తుంటే, అధికారులు కళ్లు మూసుకుని చూస్తున్నారు. ఈ మౌనం వెనుక అవినీతి దాగి ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.

ముందే దళారుల చేతుల్లోకి చేరిన పంట…
మార్చి నెలలో జొన్నల పంట చేతికి వచ్చినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు మార్చి నెల నుంచే రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.2,000 నుంచి రూ.2,300 వరకు చెల్లించి పంటను కొనుగోలు చేశారు. మే 1 నుంచి మార్క్‌ఫెడ్ 608 కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించిన తర్వాత, రైతులతో పాటు దళారులు కూడా పెద్ద ఎత్తున జొన్నలను విక్రయిస్తున్నారు. ఒక రైతు ఎకరాకు 14 క్వింటాళ్ల వరకు విక్రయించే వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ, రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను ఉపయోగించి దళారులు ఈ దందా సాగిస్తున్నారు. ఈ కుట్రలో మార్క్‌ఫెడ్ అధికారులతో పాటు కొనుగోలు కేంద్రాల బాధ్యులు కూడా భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ నుంచే దళారుల దందా…
రాష్ట్రంలోని దళారులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు కూడా ఈ దోపిడీలో పాలుపంచుకుంటున్నారు. ఏపీలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో, అక్కడి బహిరంగ మార్కెట్లలో క్వింటాల్‌కు రూ.2,000 ఆపై ధరలకు జొన్నలను కొనుగోలు చేసిన వ్యాపారులు, తెలంగాణలోని మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో రైతుల ముసుగులో విక్రయిస్తున్నారు. ఈ దందాలో ఆదిలాబాద్‌కు చెందిన ఓ మార్క్‌ఫెడ్ అధికారి, హైదరాబాదులో మరో అధికారి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అధికారుల సహకారం లేకుండా ఇంత భారీ దోపిడీ సాధ్యమా? ఈ అవినీతిపరులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?

అవినీతి కుట్రలపై చర్యలు తీసుకోవాలి…
ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, రైతుల సొమ్మును దోచుకుంటున్న ఈ దళారులు, అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో సమగ్ర తనిఖీలు నిర్వహించి, ఈ అవినీతి కుట్రలను బయటపెట్టాలని కోరుతున్నారు. రైతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని దోపిడీ సాగిస్తున్న ఈ దళారులను, వారికి సహకరిస్తున్న అధికారులను వెంటనే శిక్షించాలని రైతులు కోరుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *