నడిరోడ్డుపై ‘నో’మాజ్ – ఆర్ఎస్ఎస్ నేత అంబేకర్ ఘాటు వ్యాఖ్యలు

RSS Chief comments on muslim
  • ముస్లిం దేశాల్లో రోడ్లపై నమాజ్ నిషేధం
  • చట్టం అందరికీ సమానమని స్పష్తీకరణ
  • క్రమశిక్షణే దేశానికి ముఖ్యమని వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:

భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛ, పౌర క్రమశిక్షణ మధ్య నెలకొన్న సన్నని గీతపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరోసారి గొడ్డలివేటు వేసింది. బహిరంగ రహదారులను ప్రార్థనా స్థలాలుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ ఇస్లామిక్ దేశాల నిబంధనలను ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార కర్త ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఉదహరించారు. ఇది కేవలం మతపరమైన ఆచారం కాదు… వ్యవస్థాగతమైన అతిక్రమణ అని ఆయన ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు.

అంతర్జాతీయ ఆంక్షల పాఠం…
సునీల్ అంబేకర్ తన వాదనను సమర్థించుకోవడానికి ముస్లిం మెజారిటీ దేశాలలోని సామాజిక సూత్రాలను తెరపైకి తెచ్చారు. ప్రపంచంలోని అనేక ఇస్లామిక్ దేశాల్లో కూడా రహదారులపై ప్రార్థనలు చేయడానికి అనుమతులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అక్కడ పౌర సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని… ప్రార్థనల కోసం ప్రభుత్వం కేటాయించిన నిర్దేశిత ప్రదేశాలను మాత్రమే వాడుతారని వివరించారు. ఈ పద్ధతిని భారత్‌లో ఎందుకు అమలు చేయకూడదనేది ఆయన సంధిస్తున్న ప్రధాన ప్రశ్న.

పౌర హక్కుల హననం
రహదారులు అనేవి ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అని… వాటిని స్తంభింపజేయడం రాజ్యాంగబద్ధం కాదని అంబేకర్ అభిప్రాయపడ్డారు. ముస్లిం దేశాలే తమ పౌరుల సౌకర్యం కోసం మతపరమైన పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నప్పుడు… భారత్‌లో ఆ వర్గం ఎందుకు పట్టుబడుతోందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇతర పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని విశ్లేషించారు. చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు… రోడ్ల వినియోగంలో ప్రత్యేక మినహాయింపులు ఉండకూడదని ఆయన డిమాండ్ చేశారు.

Muslim no Namaz on roads

వ్యవస్థాగత మార్పు అవసరం
దేశంలో క్రమశిక్షణను నెలకొల్పడంలో మతపరమైన సంస్థలు విఫలమవుతున్నాయని అంబేకర్ పరోక్షంగా విమర్శించారు. ఇస్లామిక్ దేశాల నమూనాను స్వీకరించడం ద్వారా ఇక్కడ సామాజిక సామరస్యం మెరుగుపడుతుందని ఆయన సూచించారు. ఆరాధన అనేది అంతర్గత విషయమని… అది బహిరంగ ప్రదర్శనగా మారి ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని హితవు పలికారు. కేటాయించిన చోటే పూజలు లేదా ప్రార్థనలు నిర్వహించడం ద్వారానే నాగరిక సమాజం నిర్మించబడుతుందని ఆయన గట్టిగా వాదించారు.

ప్రభుత్వ బాధ్యతపై ఒత్తిడి
ఈ ఇంటర్వ్యూ ద్వారా అంబేకర్ ప్రభుత్వాలకు కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. ముస్లిం దేశాల్లో ఉన్న నిబంధనలను ఇక్కడ అమలు చేయడానికి వెనకాడాల్సిన పనిలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పౌర సౌకర్యాలను తాకట్టు పెట్టకూడదని విమర్శనాత్మకంగా పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన కార్యక్రమాలను నియంత్రించడం వల్ల శాంతిభద్రతల సమస్యలు కూడా తగ్గుతాయని ఆయన విశ్లేషించారు. ఇది సామాజిక సంస్కరణలో భాగమని ఆయన నొక్కి చెప్పారు. ఏ మతమైనా సరే సమాజ హితాన్ని కోరినప్పుడే దానికి గౌరవం ఉంటుందని ఆయన తన విశ్లేషణలో వివరించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *