తాగకుండానే తూలుతున్నారు… – తిన్న అన్నానికే ఊగుతున్నారు!

Food Makes you Drunk
  • మందు కొట్టకపోయినా మత్తెక్కుతోంది
  • పొట్టలోనే మద్యం తయారీ ఫ్యాక్టరీ
  • అన్నం, రొట్టె వంటి పిండి పదార్థాలే విలన్లు
  • వింత వ్యాధితో అమాయకుల తిప్పలు
  • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం
  • బ్యాక్టీరియాతో కిక్కు… ప్రాణాపాయ పరిస్థితి
  • యాంటీబయోటిక్స్ అతి వాడకమే కారణం

సహనం వందే, హైదరాబాద్:

మందు ముట్టకపోయినా మనిషి మత్తులో తూలిపోవడం… ఇది వినడానికి వింతగా ఉన్నా నగ్న సత్యం. మన శరీరంలోని జీర్ణవ్యవస్థే ఒక మద్యం తయారీ కేంద్రంగా మారే ఈ భయంకర స్థితిని వైద్య పరిభాషలో ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటారు. ఇది కేవలం అనారోగ్యమే కాదు బాధితుల జీవితాలను సామాజికంగా, మానసికంగా చిన్నాభిన్నం చేస్తున్న ఒక నిగూఢ వైద్య సంక్షోభం.

కడుపు లోపలే మద్యం ఫ్యాక్టరీ
శరీరం ఒక మద్యం తయారీ కేంద్రంగా మారితే ఎలా ఉంటుంది? మీరు చుక్క మందు ముట్టకపోయినా కేవలం అన్నం లేదా స్వీట్లు లేదా బంగాళాదుంపలు తిన్నందుకే కిర్రెక్కి కింద పడిపోతే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ లేదా గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అనేది అత్యంత అరుదైన వ్యాధి. ఇందులో బాధితుడి పేగుల్లో ఉండే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు అసాధారణ రీతిలో ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఈ ప్రక్రియ వేగవంతం అవుతుంది. అంటే మీరు తినే అన్నం లేదా రొట్టె మీ పొట్టలోనే మద్యంగా మారి రక్తంలో కలుస్తుంది.

లక్షణాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే
ఈ వ్యాధి ఉన్నవారికి మాట తడబడటం… నడకలో బ్యాలెన్స్ తప్పడం… కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తిన్న 24 గంటల లోపు ఎప్పుడైనా ఈ మత్తు ఆవహించవచ్చు. దీనికి తోడు వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విపరీతమైన అలసట వేధిస్తాయి. నోటి నుంచి వచ్చే మద్యం వాసన వల్ల వీరు సమాజంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చాలామంది వీటిని చూసి సదరు వ్యక్తి మద్యం తాగాడని పొరబడతారు.

Food Makes you Drunk

గణాంకాలు చెబుతున్న భయం
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 100 కేసులు మాత్రమే అధికారికంగా నమోదయ్యాయి. కానీ వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం వేల సంఖ్యలో ప్రజలు దీని బారిన పడి ఉంటారని అంచనా. 1952లో జపాన్‌లో మొదటిసారిగా దీన్ని గుర్తించారు. 2019లో ఒక 25 ఏళ్ల యువకుడికి మద్యం తాగకపోయినా రక్తంలో 0.3 గ్రాముల మేర ఆల్కహాల్ స్థాయిలు కనిపించాయి. కొందరికి రక్తంలో ఆల్కహాల్ శాతం 0.08 నుండి 0.40 గ్రాముల వరకు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇది సాధారణ పరిమితి కంటే ఎంతో ఎక్కువ. మన దేశంలో కూడా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

యాంటీబయోటిక్స్ అతి వాడకం వల్లే…
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం లేదా యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. దీనివల్ల ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు రాజ్యమేలి ఆహారాన్ని మద్యంగా మారుస్తాయి. డయాబెటిస్, ఊబకాయం లేదా క్రోన్ వ్యాధి ఉన్నవారిలో ఈ ముప్పు 40 శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక కేసులో 44 ఏళ్ల వ్యక్తి కేవలం యాంటీబయోటిక్స్ వాడిన 8 రోజులకే ఈ వ్యాధి బారిన పడ్డాడు. చిన్న పేగుల్లో సాక్రోమైసెస్ సెరెవిసియా అనే బ్రూవర్స్ ఈస్ట్ పెరగడమే దీనికి ప్రధాన కారణం.

Food Vs Drunk and Drive

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో బాధితులు…
ఈ వ్యాధి కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు… జేబును కూడా ఖాళీ చేస్తుంది. అమెరికా వంటి దేశాల్లో దీని చికిత్స కోసం నెలకు లక్షన్నర రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కుని ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఒక మహిళ తన చికిత్స కోసం దాదాపు 10 లక్షల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది దీనిని మానసిక సమస్యగా భావించి వేల రూపాయలు తగలేస్తున్నారు.

పొంచి ఉన్న ప్రాణాపాయం…
దీనిని నిర్లక్ష్యం చేస్తే కాలేయం దెబ్బతినడం ఖాయం. శరీరంలో నిరంతరం మద్యం ఉత్పత్తి కావడం వల్ల సిర్రోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. 1948లో ఒక ఐదేళ్ల బాలుడు ఈ వ్యాధి కారణంగానే కడుపు ఉబ్బి మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. పొట్టలో తయారైన గ్యాస్ ఒత్తిడికి జీర్ణాశయం పగిలిపోవడం వంటి అత్యంత ప్రమాదకర స్థితికి ఇది దారితీస్తుంది. ఇది కేవలం మత్తు కాదు… ప్రాణాలను చిత్తు చేసే విషమని గుర్తించాలి.

పరిష్కారం… జాగ్రత్తలు
కార్బోహైడ్రేట్లు, చక్కెర ఉన్న ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. వైద్యులు ఫ్లుకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ మందులను సిఫార్సు చేస్తున్నారు. పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడుకోవడం అత్యంత అవసరం. ప్రోబయోటిక్స్ తీసుకోవడం, అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడకపోవడం ద్వారా ఈ వింత వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *