ఐఐటీ… ఏమిటిదీ? – పడిపోయిన ఉద్యోగాల రేటు

IIT Placements
  • కరిగిపోతున్న నమ్మకాల కోట
  • ముఖం చాటేస్తున్న కంపెనీలు
  • ప్యాకేజీల వెనుక అసలు నిజం
  • బాంబే ఐఐటీ నివేదికలో విస్తుపోయే నిజాలు

సహనం వందే, హైదరాబాద్:

దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీల చుట్టూ అల్లిన కలల సామ్రాజ్యం ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల పాలిట ఆర్థిక భారంగా మారుతోంది. లక్షలాది రూపాయల అప్పులు చేసి సర్వస్వం దారపోస్తున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని ఐఐటీ బాంబే తాజా నియామకాల గణాంకాలు దడ పుట్టిస్తున్నాయి.

కరిగిపోతున్న కలలు…
భారతదేశంలో ఐఐటీ సీటు సాధించడమంటే జీవితం స్థిరపడిపోయినట్లేననే నమ్మకం దశాబ్దాలుగా ఉంది. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలు ఈ నమ్మకాన్ని వట్టి భ్రమగా మారుస్తున్నాయి. జేఈఈ కోచింగ్ కోసం తల్లిదండ్రులు తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని గుమ్మరిస్తున్నారు. కోచింగ్ కోసం ఐదు నుండి ఎనిమిది లక్షల రూపాయలు, ఐఐటీ ఫీజుల కోసం మరో ఎనిమిది నుండి పది లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఇరవై లక్షల రూపాయల వరకు ఐఐటీ కల కోసం, పది లక్షల రూపాయల వరకు ఫీజుల కోసం తగలేస్తున్నారు. ఇంత చేసినా ఆశించిన ఫలితం దక్కడం లేదు.

బాంబే నివేదికలో ఏముంది?
ఐఐటీ వ్యవస్థకే మకుటాయమానంగా భావించే ఐఐటీ బాంబే తాజా ప్లేస్‌మెంట్ నివేదిక విద్యా రంగంలోని చీకటి కోణాన్ని బయటపెట్టింది. ఈ నివేదిక తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగాల నియామక రేటు గణనీయంగా పడిపోయింది. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులు ఉండే క్యాంపస్‌లోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన విద్యా సంస్థల గతి ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. విద్యా వ్యవస్థలోని లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖం చాటేస్తున్న కంపెనీలు…
క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చే కంపెనీల సంఖ్య ఈసారి బాగా తగ్గిపోయింది. గతంలో ఎగబడే కంపెనీలు ఇప్పుడు ఐఐటీ బాంబే వైపు చూడటానికే వెనుకాడుతున్నాయి. వచ్చిన కొన్ని కంపెనీలు కూడా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలను ఆఫర్ చేయడం లేదు. సగటు ప్లేస్‌మెంట్ శాతాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నమోదు కాలేదు. దీనివల్ల ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉద్యోగాలు సాధించలేక ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

ప్యాకేజీల వెనుక అసలు నిజం
ఐఐటీ బాంబే నివేదిక ప్రకారం సగటున 26 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీలు లభిస్తున్నట్లు చూపిస్తున్నారు. కానీ ఈ సంఖ్య కేవలం కాగితాల మీదే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పన్నులు కట్ కాకముందు, చేతికి వచ్చే జీతం లెక్కలు వేయకముందు మాత్రమే ఇది పెద్ద మొత్తంగా తోస్తుంది. చేతికి వచ్చేసరికి పన్నులు కోతకు గురవుతాయి. దీనికి తోడు నగరాల్లో ఉండే అద్దెలు, ఇతర ఖర్చులు పోను మిగిలేది చాలా తక్కువ.

అప్పుల ఊబిలో మధ్యతరగతి
కోచింగ్ కోసం, ఫీజుల కోసం చేసిన అప్పులకు కట్టాల్సిన ఈఎంఐలు విద్యార్థులను వేధిస్తున్నాయి. చదువు పూర్తి కాగానే వచ్చే జీతంతో ఈ అప్పులు తీరుతాయనుకుంటే సీన్ రివర్స్ అవుతోంది. 26 లక్షల రూపాయల ప్యాకేజీ కూడా చేతికి వచ్చేసరికి నెలవారీ ఈఎంఐలు, అద్దెలు కట్టడానికే సరిపోతోంది. దీంతో ఈ చదువుల పెట్టుబడి లాభసాటిగా మారాల్సింది పోయి కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక భారంగా మారుతోంది.

మారాల్సిన విద్యా ప్రమాణాలు
ఐఐటీల్లో చదివితే జీవితం బంగారమే అనే పాత సూత్రీకరణ ఇప్పుడు చెల్లకుండా పోతోంది. లక్షల రూపాయలు గుమ్మరించి చదివించినా విద్యార్థులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. ఈ విద్యా వ్యాపారంలో కోచింగ్ సెంటర్లు, ఫీజుల దోపిడీ మాత్రమే సాగుతోంది. ఐఐటీల బ్రాండ్ ఇమేజ్ చూసి మోసపోకుండా క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విద్యా విధానంలో తక్షణ మార్పులు రాకపోతే మరిన్ని కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *