ఐ బొమ్మ అప్పారావు ‘మెగా’ వార్నింగ్ – సినిమా పరిశ్రమను ఉతికి ఆరేసిన రవి తండ్రి

ఐ-బొమ్మ రవి తండ్రి అప్పారావు 'మెగా' వార్నింగ్
  • సినీ నటులు ఆకాశం నుండి ఊడిపడ్డారా?
  • అల్లు లేకుంటే చిరంజీవి ఎక్కడ అని ప్రశ్న?
  • తన కొడుకు చేసింది తప్పేనని అంగీకారం
  • దానికే ఎన్ కౌంటర్ చేయాలా అని నిలదీత
  • కొడుకును ఎన్ కౌంటర్ చేయాలనడంపై ఫైర్
  • సినిమా వాళ్లనే అలా చేయాలని డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి తండ్రి అప్పారావు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలని సినీ నిర్మాత సి. కల్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యానించడంపై అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేసే అంత తప్పు ఏమీ చేయలేదని… నిజంగా ఎన్‌కౌంటర్ చేయాలంటే కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచి సామాన్య ప్రజలను వినోదానికి దూరం చేస్తున్న కల్యాణ్‌ను, సినిమా వాళ్లనే చేయాలని అప్పారావు నిప్పులు చెరిగారు. తన కొడుకు చేసింది తప్పేనని, చట్టం ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధమేనని స్పష్టం చేస్తూనే సినిమా పెద్దల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

సినిమా హీరోలు ఆకాశం నుంచి ఊడిపడ్డారా?

మెగా హీరోలు ఆకాశం నుంచి ఊడిపడ్డారా అంటూ అప్పారావు చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానులకు కోపం తెప్పించాయి. ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లోనే ఉందని, వారసత్వం ఉంటేనే అవకాశాలు దక్కుతున్నాయని ఆయన ఆరోపించారు. అల్లు రామలింగయ్య గొప్ప నటుడని, ఆయన కూతురిని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయడంతోనే చిరంజీవికి ఇండస్ట్రీలో మంచి పేరు, స్థానం లభించాయని అన్నారు. ఆ తరువాతే చిరంజీవి ద్వారా పవన్ కల్యాణ్, రామ్ చరణ్ వంటి వారంతా పరిశ్రమకు వచ్చారని అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకుంటున్న పవన్ కల్యాణ్, నాగార్జున, చిరంజీవి వంటి హీరోలు కెరీర్ మొదట్లో ఎలా ఉండేవారో వారి తొలి సినిమాలు చూస్తే తెలుస్తుందని… వారేమీ పుట్టుకతో అందంగా లేరని వ్యాఖ్యానించారు.

బ్లాక్ మనీ… టికెట్ల రేట్ల దోపిడీ!
సినిమా
టికెట్ల ధరలు, హీరోల పారితోషికాలపై అప్పారావు చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ లోపాలను ఎత్తి చూపాయి. ప్రస్తుతం ఉన్న హీరోలకే కోట్ల రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమాలు తీయడం, ఆ భారాన్ని టికెట్ల రేట్లు పెంచి పేద ప్రజలపై మోపడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీయమని ఎవరు అడిగారని, బ్లాక్ మనీ ఉన్నవారే అన్ని కోట్లు పెడతారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్క సినిమా చూడాలంటే పేద కుటుంబానికి రూ. 1000 ఖర్చవుతుందని, థియేటర్లలో తినుబండారాల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని మండిపడ్డారు.

కొత్తవారిని ప్రోత్సహించండి!
సినిమా
పరిశ్రమ ఎదగాలంటే కొత్త నటీనటులకు అవకాశాలు ఇవ్వాలని అప్పారావు కోరారు. బయట మంచి నటనా నైపుణ్యం ఉండి అందంగా ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారన్నారు. వారిని గుర్తించి అవకాశాలు ఇస్తే తక్కువ బడ్జెట్‌తోనే సినిమాలు తీయవచ్చని, అప్పుడు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉండదని ఆయన సూచించారు. తక్కువ రెమ్యూనరేషన్‌తో నటించడానికి సిద్ధంగా ఉన్న సుమన్, రాజశేఖర్ వంటి వారికి అవకాశాలు ఇవ్వకుండా, ఉన్న హీరోలకే కోట్లు ఇవ్వడం సరికాదని విమర్శించారు. కొత్తవారికి అవకాశం కల్పిస్తే సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు తగ్గి, ఇతరులకు జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారని ఆయన దయతో విజ్ఞప్తి చేశారు.

తండ్రి ఆవేదన… ప్రజల మద్దతు!
తన కొడుకు ఐ బొమ్మ రవి చేసింది తప్పే అయినా ఈ స్థాయికి రావడానికి కారణం ఆకలి, పేదరికమేనని అప్పారావు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సమస్యల వల్ల రవి ఒంటరివాడయ్యాడని, పస్తులు పడుకున్నాడని భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు కోట్లాది మంది సామాన్యులు తన కొడుకుకు మద్దతు ఇస్తున్నారని, కానీ ఆ పేరు ప్రఖ్యాతులు తనకు వద్దని, తన కొడుకు క్షేమంగా ఇంట్లో ఉంటే చాలని ఆవేదన వెలిబుచ్చారు. అప్పారావు మాటలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఇండస్ట్రీలోని లోపాలను ఎత్తి చూపినందుకు కొంతమంది ప్రజలు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *