- పాకిస్తాన్ మహిళలకు ప్రత్యేకంగా ఉగ్ర శిక్షణ
- జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కొత్త వింగ్ ఏర్పాటు
- దాని పేరు జమాత్ ఉల్ మొమినాత్
- అక్క మరణంతో మహిళా విభాగానికి ఆజ్యం
- ఇద్దరు చెల్లెళ్లకు ఉమెన్ బ్రిగేడ్ బాధ్యతలు
- డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా డొనేషన్స్ సేకరణ
సహనం వందే, న్యూఢిల్లీ:
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ నడ్డి విరిగినా ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కొత్త కుట్రకు తెర లేపాడు. తన ఉగ్ర ఎజెండాను కొనసాగించేందుకు ఏకంగా మహిళలనే జిహాదీ బ్రిగేడ్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బహవల్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ వ్యూహం రూపొందుతోంది. పాకిస్తాన్ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా ఈ ప్రమాదకర కుట్ర చేయడం అసాధ్యం. నిషేధించిన సంస్థలంటూ పదే పదే ప్రపంచానికి అబద్ధాలు చెప్పే పాక్… ఇంకా ఈ ఉగ్రవాద రాజకీయాన్ని పెంచి పోషిస్తోందనడానికి ఇదే నిదర్శనం.
అక్క మరణం… మహిళా విభాగానికి ఆజ్యం
భారత గూఢచారుల చేతికి చిక్కిన 21 నిమిషాల ఆడియో రికార్డింగ్‌లో మసూద్ అజార్ వ్యక్తం చేసిన ఆవేదనే ఈ కొత్త కుట్రకు కారణమని తెలుస్తోంది. బహవల్‌పూర్ మర్కజ్ ఉస్మాన్ అలీలో చేసిన ఈ ప్రసంగంలో… ఆపరేషన్ సిందూర్‌లో తన కుటుంబానికి చెందిన 14 మంది మరణించిన విషయాన్ని వెల్లడించాడు. ముఖ్యంగా తన అక్క హవా బీబీ మరణం తర్వాతే జమాత్ ఉల్ మొమినాత్ అనే మహిళల విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన మొదలైనట్లు ప్రకటించాడు. ఇది జిహాదీ సంస్థకు జెండర్ జోష్‌ను పెంచే వ్యూహంలో భాగమే.
మరణిస్తే స్వర్గం… 15 రోజుల ఉగ్ర శిక్షణ
జైష్‌లో పురుషుల రిక్రూట్స్‌కు ఉండే దౌరా ఏ తర్బియత్ మాదిరిగానే… మహిళలకు ప్రత్యేకంగా 15 రోజుల పాటు దౌరా ఏ తస్కియా అనే కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దౌరా ఆయత్ ఉల్ నిసాహ్ ద్వారా ఇస్లాం గ్రంథాల్లోని జిహాద్ బోధనలను వారికి నూరిపోస్తారు. ఈ మహిళలు భారత దళాలతో తలపడి మరణిస్తే స్వర్గం సిద్ధిస్తుందని మసూద్ అజార్ హామీ ఇస్తున్నాడు. హిందూ మహిళలు సైన్యంలో ఉన్నారని… మీడియాలో కనిపిస్తున్నారని చెప్పి తమ మహిళలను కూడా రంగంలోకి దింపుతామని ఆయన చేస్తున్న హెచ్చరిక తీవ్రమైన భద్రతా ముప్పు.
సాదియా… సమైరా నేతృత్వం
ఈ మహిళా ఉగ్ర బ్రిగేడ్‌కు నాయకత్వం వహించేందుకు మసూద్ అజార్ తన చెల్లెళ్లనే నియమించాడు. అతని సోదరి సాదియా అజార్ ను జమాత్ ఉల్ మొమినాత్ అధిపతిగా నియమించగా... మరో చెల్లెలు సమైరా అజార్ (ఉమ్మే మసూద్) కూడా కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో పుల్వామా బాంబర్ భార్య అఫీరా ఫారూక్ కూడా ఈ ముఠాలో చేరడం ఆందోళనకరం. వీరంతా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా రోజూ ఇండాక్ట్రినేషన్ సెషన్స్‌ను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి వారంలో ఐదు రోజులు ఈ తరగతులు సాగుతున్నాయి.
కొత్త బేస్‌లు… పాక్ జిల్లాల్లో శాఖలు
జైష్ ప్లాన్ ప్రకారం… పాకిస్తాన్‌లోని ప్రతి జిల్లాలో ఈ జమాత్ ఉల్ మొమినాత్ శాఖలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి శాఖకు ముంతజిమా అనే అధికారిని నియమిస్తారు. మహిళలకు భర్త తప్ప ఇతర పురుషులతో మాట్లాడకూడదనే కఠిన నియమాలు విధించారు. గతంలో భారత దళాలతో పోరాడి మరణించిన వారి బంధువులైన నాలుగైదుగురు మహిళలను రోల్ మోడల్స్‌గా చూపిస్తూ మిగతావారిని ప్రేరేపిస్తున్నారు. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా డొనేషన్స్ సేకరిస్తూ మళ్లీ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ ఉగ్రవాద రాజకీయం దేశ భద్రతకు కొత్త ముప్పును సూచిస్తోంది. భారత్ ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది.