- ఆ మూత్రాన్ని తాగమని వృద్ధుడిపై దాడి
- అనారోగ్యంతో అనుకోకుండా మూత్రం
- దీన్ని సాకుగా తీసుకొని దళితులపై దాడి
సహనం వందే, లక్నో:
లక్నో సమీపంలోని కాకోరి పట్టణంలో జరిగిన దారుణ ఘటన దేశంలో కుల వివక్ష ఎంత వికృతంగా ఉందో మరోసారి బట్టబయలు చేసింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల దళిత వృద్ధుడు రంపాల్ రావత్... దీపావళి రోజున శీత్ల మాతా ఆలయం సమీపంలో అనుకోకుండా మూత్ర విసర్జన చేస్తే… ఒక స్థానికుడు అతనిపై దాడి చేసి అవమానించడం మానవత్వానికే సిగ్గుచేటు. మందిరానికి కనీసం 40 మీటర్ల దూరంలో జరిగిన ఈ చిన్నపాటి అనుకోని ఘటనను సాకుగా తీసుకుని స్వామీకాంత్ అనే వ్యక్తి చేసిన అకృత్యం శోచనీయం. మందిరాన్ని అపవిత్రం చేశావంటూ అనారోగ్యంతో ఉన్న దళితుడిని దారుణంగా హింసించడం వెనుక దాగి ఉన్న కుల అహంకారం బయటపడింది.
మూత్రం తాగమని బలవంతం…
నిందితుడు స్వామీకాంత్ చేసిన ఆగడాలు మధ్యయుగాల క్రూరత్వాన్ని తలపిస్తున్నాయి. రంపాల్‌ను బలవంతంగా కొట్టి అతని మూత్రాన్ని తాగమని ఆదేశించడమే కాకుండా నేలను తుడవమని చెప్పి తర్వాత పవిత్రీకరణ చేయడం అంటరానితనం అనే భయంకరమైన జాడ్యం ఇంకా మన సమాజంలో జీవంతో ఉందని నిరూపించింది. కులంతో రంపాల్‌ను దూషిస్తూ బహిరంగంగా కొట్టడం దళిత సమాజంపై జరుగుతున్న అత్యాచారాలకు పరాకాష్ట. రంపాల్ అనారోగ్యం దృష్ట్యా అనుకోకుండా జరిగిన ఒక చర్యను ఇంత దారుణమైన అవమానంగా మార్చి, వ్యక్తి గౌరవాన్ని మంటగలిపిన తీరును మానవ హక్కుల సంస్థలు, దళిత సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఈ చర్య రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును బహిరంగంగా దెబ్బ తీసింది.
పోలీసుల చిత్తశుద్ధిపై అనుమానాలు
బాధితుడు రంపాల్ ధైర్యం చేసి కాకోరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్వామీకాంత్‌ను అరెస్టు చేశారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం స్వాగతించదగిన చర్య. అయితే రంపాల్‌ను మూత్రం తాగమని బలవంతం చేయలేదని, కేవలం తాకమని మాత్రమే చెప్పానని నిందితుడు బుకాయించడం ఈ కేసును నీరుగార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ వంటి రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. నిందితుడు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అని కాంగ్రెస్ ఆరోపించడం... బీజేపీ పాలనలో కుల వివక్ష పెరిగిపోతోందని విమర్శించడం ద్వారా రాజకీయ రంగు పులుముకుంది. కేవలం అరెస్టుతో సరిపెట్టకుండా ఎస్సీ ఎస్టీ చట్టం కింద కఠినంగా శిక్షించి బాధితుడికి తక్షణ రక్షణ, పరిహారం అందించడంలో ప్రభుత్వం నిజమైన చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సి ఉంది.