ఆయిల్ ‘ఫ్రాడ్’తో కోటీశ్వరులు – కోట్లకు పడగలెత్తిన అధికారులు

  • కాంట్రాక్టర్లతో కుమ్మక్కు..టెండర్లలో అక్రమాలు
  • ప్రీ యూనిక్ కంపెనీతో చెట్టాపట్టాల్
  • సబ్ కాంట్రాక్టులు దక్కించుకొని వ్యాపారం
  • నర్మెట్ట ఫ్యాక్టరీలో ఒక అధికారి సబ్ కాంట్రాక్టరే
  • పామాయిల్ మొక్కల్లో అక్రమాలతో సంపాదన

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ఆయిల్ ఫెడ్ లో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థను ఫణంగా పెట్టి కోట్లకు పడగలెత్తుతున్నారని అందులోని ఉద్యోగులే మండిపడుతున్నారు. తమ అధికారాలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పామాయిల్ మొక్కల్లో అక్రమాలు, నూనెల విక్రయాల్లో అవకతవకలు, నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్లలో గోల్మాల్… ఇలా అనేక రూపాలుగా అవినీతి పేరుకుపోయినట్లు చెప్తున్నారు. అందులోని కీలక స్థానాల్లో ఉన్నవారు సిండికేట్ అయ్యి సంస్థను నట్టేట ముంచుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి అక్రమాలకు అడ్డువేసే నాధుడే లేడా అని ఎదురుచూస్తున్నారు.

కాంట్రాక్టర్లతో కుమ్మక్కు..టెండర్లలో అక్రమాలు
ఆయిల్ ఫెడ్ లో ఇప్పుడు పామాయిల్ విస్తరణ, మొక్కల సరఫరా, నర్సరీల పెంపకం, ఫ్యాక్టరీల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్షల ఎకరాలకు పామాయిల్ సాగును విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఆయిల్ ఫెడ్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దీన్నే కొందరు అధికారులు ఆదాయానికి అవకాశంగా మలుచుకున్నారు. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా నర్మెట్టలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. వాస్తవంగా దానికి అంత ఖర్చు కానప్పటికీ, ప్రీ యూనిక్ అనే కంపెనీతో కుమ్మక్కై అంచనాలు ఎక్కువ వేసి ఆ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు.

వాస్తవంగా ఆ ఏరియాలో పండే పంటతో పోలిస్తే అంత సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీ అక్కడ అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. కేవలం 100 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ నిర్మిస్తే సరిపోతుందని… కానీ 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధాయేనని ఉద్యోగులు, ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ మాజీ కీలక ప్రజా ప్రతినిధి, మాజీ ఎండీ, ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న కొందరు ఆయిల్ ఫెడ్ అధికారులు కంపెనీతో కుమ్మకై నర్మెట్ట ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. తద్వారా ఆ కంపెనీ నుంచి మాజీలు, ఇప్పుడున్న కొందరు అధికారులు కోట్ల రూపాయలు గడించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో అంతర్గత విచారణ కూడా జరిగింది. కానీ అంతా మేనేజ్ చేసినట్లు సమాచారం.

సబ్ కాంట్రాక్టర్ల అవతారం…
ఆయిల్ ఫెడ్ సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ జీతం పొందాల్సిన కొందరు ఉద్యోగులు… సబ్ కాంట్రాక్ట్ అవతారం ఎత్తడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రైవేట్ కంపెనీలకు అమ్ముడుపోయి వారితో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతుండటం వారి అక్రమాలకు పరాకాష్ట. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రీ యూనిక్ కంపెనీ సీఈఓ సత్యనారాయణతో ఆయిల్ ఫెడ్ అధికారి ఒకరు నిత్యం కలిసి తిరుగుతుంటారు. అంతేకాదు ఆ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తి కోట్లు గడిస్తున్నారని అందులోని ఉద్యోగులే చెప్తున్నారు. ఆయన పేరును రివర్స్ చేసి షార్ట్ ఫామ్ లో రాస్తే ఏమొస్తుందో అదే ఆయన కంపెనీ. దానిద్వారా నాణ్యతలేని వస్తువులను నర్మెట్ట ఫ్యాక్టరీకి తరలిస్తూ అక్రమంగా కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్నట్లు సమాచారం. కార్పొరేషన్ ను కాపాడాల్సిన ఆ అధికారి దాన్ని నట్టేట ముంచుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఆయన హైదరాబాదులో ఒక విల్లా, అపార్ట్మెంట్లలో రెండు ఫ్లాట్లు, సొంతూరులో 15 ఎకరాల భూమి కొన్నట్లు ఒక కీలక అధికారి చెప్పారు.

నెలకు వచ్చే అద్దెలే రూ. 50 లక్షలు
ఒక ప్రముఖ దేవుడి పేరు కలిగిన అధికారి ఆయన. ఆయిల్ ఫెడ్ లో కీలక స్థానంలో ఉన్న అధికారుల్లో ఒకరు. ఆయన ఇప్పటివరకు జీతంతో మాత్రమే పని చేసి ఉంటే మహా అంటే ఒక త్రిబుల్ బెడ్ రూమ్, ఒకటి రెండు ఫ్లాట్లు కొనగలరు. కానీ ఆయనకు ఇప్పుడు హైదరాబాదులో పలుచోట్ల ఇళ్ళు, విల్లాలు, భూములు, ఫ్లాట్లు ఉన్నాయి. ఆయన పనిచేసిన చోట్ల కమీషన్లు తీసుకోవడం, టెండర్ల సమయంలో కాంట్రాక్టర్లతో సిండికేట్ కావడం… ఇలా తన ఉద్యోగ కాలంలో దాదాపు 100 కోట్లు సంపాదించి ఉంటారని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ఆయన సంపాదించిన ఆస్తుల ద్వారా నెలకు ఏకంగా 50 లక్షల రూపాయల అద్దె ద్వారా ఆదాయం వస్తుందని ఉద్యోగులు అంటున్నారు.

ఆయిల్ ఫెడ్ ను బంగారు బాతుగా భావించి దోపిడీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అదే స్థాయిలో సీనియారిటీ ఉన్న మరో అధికారి కూడా అదే స్థాయిలో సంపాదించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మాజీ కీలక అధికారి, ప్రస్తుతం పని చేస్తున్న ఇద్దరు ముఖ్య అధికారులు కలిసి హైదరాబాదులో ఒక ప్రముఖ ప్రాంతంలో కోట్ల రూపాయలతో వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నట్లు ఉద్యోగులు చెప్తున్నారు. అంటే వీరి అవినీతి అంతస్తులు ఏ స్థాయిలో పేరుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *