- తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియామకం
- సానియా మీర్జా చెల్లెను పెళ్లి చేసుకున్న అసదుద్దీన్
సహనం వందే, హైదరాబాద్:
భారత క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 35 ఏళ్ల అసదుద్దీన్ గతంలో హైదరాబాద్ కోల్ట్స్, గోవా వంటి జట్లకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. తన రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నుండి అపారమైన స్ఫూర్తి పొందినట్లు అసదుద్దీన్ వెల్లడించారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం పట్ల, పార్టీ విలువల పట్ల కనబరుస్తున్న నిబద్ధత తనను ఎంతగానో ఆకర్షించిందని పేర్కొన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కూడా పార్టీ కోసం పోరాడుతున్న రాహుల్ తన ఆదర్శమని తెలిపారు.
సానియా మీర్జా సోదరితో వివాహం…
ఒక క్రీడాకారుడి కెరీర్ స్వల్పకాలికమని అసదుద్దీన్ అన్నారు. ‘నా క్రికెట్ సమయం ముగిసిందని భావించాను. నాకు ఉత్సాహం కలిగించే మరో రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాన’ని తెలిపారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జాను వివాహం చేసుకున్నారు. కుమారుడు అసదుద్దీన్ నియామకం తనను గర్వపడేలా చేసిందని, ఇది తనకు ఒక భావోద్వేగ క్షణమని మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు.