జెన్ జెడ్ జెట్ స్పీడ్…

  • అయితే ఆచరణలో కాస్తంత గందరగోళం
  • చిన్న విషయాలకే భయం భయం
  • సామర్థ్యం మెండు… దారి చూపిస్తే ట్రెండే
  • 6 శాతంలోనే టాప్ కు వెళ్లాలనే ఆలోచన

జనరేషన్‌ జెడ్‌… ఇప్పుడిప్పుడే పదహారేళ్ల పడుచుప్రాయాన్ని పూర్తి చేసుకున్న యువత. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ… ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడేందుకు… లక్ష్య సాధన కోసం జెట్‌ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఎంతో పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ సరికొత్త ప్రపంచాన్ని చుట్టేసేందుకు పయనమైన జనరేషన్‌ జెడ్‌కు చిత్రవిచిత్ర పరిస్థితులు ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఇన్నాళ్లూ నేర్చుకున్న పరిజ్ఞానం… అనుసరించిన విధానం…. సాగుతున్న తరుణం సరైన దిశలోను ఉందా? లేక దారితప్పిందా? అనే సందేహాలు యువ మస్తిష్కాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
‘నా సమాచారం సరిగ్గా ఉపయోగపడుతోందా? లేక తప్పుదోవపట్టిస్తున్నదా? నేను నిజంగా కృషి చేస్తున్నానా లేక సమయాన్ని వృథా చేస్తున్నానా? జీవితంలో ఏదైనా విషయాన్ని నిజంగా సీరియస్‌గా తీసుకుంటున్నానా? నేను విజయవంతం అవగలుగుతానా?’ ఇవి ఈ తరం యువతలో ముఖ్యంగా జనరేషన్ జెడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్నలు. తమ దగ్గర అపారమైన సమాచారం ఉన్నా, వాళ్లు ఎంతో గందరగోళంగా ఉన్నారని చర్చ జరుగుతుంది.

చిన్న విషయాలకే భయం భయం…
‘ఇప్పటి టీనేజర్లు మానసిక ఆరోగ్య సంక్షోభానికి అంచులపై ఉన్నార’అని ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ జీన్ ట్వెంగ్ హెచ్చరిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ రిసెర్చ్ నివేదిక ఆధారంగా 17 నుంచి 25 ఏళ్ల వయస్సు కలిగిన వారిలో 33.7 శాతం మంది మానసిక సమస్యలు కలిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. చిన్న చిన్న సమస్యలకే ఎక్కువగా యువత మానసికంగా డిప్రెషన్‌కి లోనవుతున్నారు. 70% నుండి 75% యువత ఓవర్ థింకింగ్ అనే మానసిక నలతతో బాధపడుతున్నారు. ‘ఒకవేళ ఫెయిల్ అయితే?’ అనే భయం వారిని ఎటూ వెళ్ళనీకుండా చేస్తుంది. దీనివల్ల చదువు, కెరీర్‌పైనా శ్రద్ధ తగ్గిపోతుంది.

కెరీర్ పై అస్పష్టత..‌.
‘ఇంజనీర్ అవ్వాలా? డాక్టర్ అవ్వాలా? ఆర్టిస్టా లేక ఎంట్రప్రెన్యూరా?’ అని అనేక దారుల మధ్య చిక్కుకుపోతున్నారు. అత్యధిక ఆప్షన్ల వల్ల వారికి ఏది తమకు కావాలో, ఏది సమాజం కోరుకుంటుందో తెలియడం లేదు. ఈ రోజుల్లో యువత అత్యున్నత స్థాయిలను చేరాలనే ఆసక్తి తక్కువ. కేవలం 6% మందికే టాప్ పొజిషన్లలో ఉండాలనే దృష్టి ఉందని అధ్యయనంలో తేలింది.

పోలికల వలలో పడుతున్న యువత
‘వాడు నాకంటే బెటర్‌గా చేస్తున్నాడు. నేను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాన’నే భావన వారిని వెంటాడుతోంది. ఇలా ఇతరులను పోల్చుకుంటూ తమ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇతరులతో పోలిక వల్ల కొందరికి తామె ప్రపంచాన్ని ఓడించినట్టు గర్వం వస్తుంది, మరికొందరికి తాము ఏమీ చేయలేమన్నా నిరాశ కలుగుతుంది. ఇవి రెండూ ప్రమాదకరమే.

అంతర్గత ఒత్తిడే ప్రధాన శత్రువు
సమాజం, తల్లిదండ్రుల ఒత్తిడితో పాటు యువత తమపై అపారమైన అంచనాలు వేసుకుంటున్నారు. ఈ అంచనాలకు తాము చేరుకోలేకపోతే ఆత్మవిమర్శ, ఆందోళన మొదలవుతుంది. ఇది మానసిక సమస్యల్ని పెంచుతుంది.

అయినా జనరేషన్ జెడ్ ట్రెండింగే…
అన్ని కష్టాల మధ్యనూ జనరేషన్ జెడ్ తరం అత్యంత ప్రతిభావంతులు, పోటీభావం ఉన్నవారు. వాళ్లు మిలీనియల్స్ కన్నా ఎక్కువగా తమ లక్ష్యం కోసం పోరాడతారు. క్రియేటివిటీ, టెక్నాలజీ పరిజ్ఞానం – ఇవే వారి బలాలు. సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండే ఈ తరం యువత, ఒకసారి తమ మార్గాన్ని గుర్తించగలిగితే ఏదైనా సాధించగలరు.

సరైన దారిన చూపిస్తే…
సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం, స్వీయ ఆత్మపరిశీలన అవసరం. ఈ రెండూ ఉన్నపుడే వారు గందరగోళాన్ని అధిగమించి స్పష్టతతో జీవితం గడపగలుగుతారు. జనరేషన్ జెడ్ తరం సమస్యలు తప్ప, సామర్థ్యం అపారంగా ఉంది. దాన్ని గుర్తిస్తే భవిష్యత్తు మెరిసిపోతుంది!

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *